శ్రీకాకుళం జిల్లా దిశగా హుదూద్ పయనం
శ్రీకాకుళం : విశాఖ సమీపానికి అతివేగంగా దూసుకొస్తున్న హుదూద్ తుఫాను తన దిశ మార్చుకుంది. శ్రీకాకుళం జిల్లా దిశగా తుఫాను పయనిస్తోంది. ఆదివారం ఉదయం కంటే ముందుగానే తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మరింత భీకర రూపం దాల్చి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.
మరోవైపు తుఫానుపై మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని కామినేని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.