కామ్‌నేని!
కామ్‌నేని!
Published Sat, Apr 15 2017 7:42 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
► ఆరోగ్యశాఖ మంత్రి వస్తారు... వెళ్తారు!
► సిక్కోలులో మెరుగుపడని వైద్య సౌకర్యాలు
► ఆచరణకు నోచుకోని కామినేని హామీలు
► ఉద్దానం యేతర ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్న కిడ్నీ వ్యాధులు
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:
ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర శీర్షికతో ఈనెల 11న సాక్షి ప్రచురించిన కథనంతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది! రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు! వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు! అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం ఇది తొలిసారి కాదు! శ్రీకాకుళం జిల్లా పర్యటనకొచ్చినప్పుడల్లా వైద్య సౌకర్యాలపై దృష్టి పెడతామని చెబుతున్నారు! ఇలా ఆయన ఎన్నిసార్లు పర్యటించి వెళ్లినా పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు.
పలాస ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ప్రారంభించేందుకు మంత్రి కామినేని శ్రీకాకుళం జిల్లాకు శనివారం మరోసారి వస్తున్నారు. వాస్తవానికి మంత్రి స్థాయిలో ప్రారంభించాల్సిన కార్యక్రమం కాకపోయినా ఆయన వస్తే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి మారుతుందేమోనన్న ఆశలు జిల్లా ప్రజల్లో అలాగే ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాను కిడ్నీ వ్యాధులు వణికిస్తున్నాయి. ఒక్క ఉద్దానం ప్రాంతంలోని ఎనిమిది మండలాల్లోనే 28 శాతం మంది వాటిని బారినపడ్డారు. ప్రపంచంలో అంత ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధి ప్రబలిన మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ఎప్పుడో హెచ్చరించింది.
ఇప్పుడు జిల్లాలో ఉద్దానం ఒక్కటే కాదు ఆమదాలవలస, ఫరీదుపేట, చిలకపాలెం, పాలకొండ తదితర ప్రాంతాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఉద్దానంలోనైనా నిపుణులు ఎవ్వరికి వారు పరిశోధనలు చేసి వెళ్లిపోవడమే తప్ప వాటినన్నింటినీ క్రోడీకరించి, తదుపరి పరిశోధనలను కొనసాగించే, సమన్వయం చేసే వ్యవస్థే లేకుండా పోయింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు అనుబంధంగా పరిశోధన కేంద్రాన్ని శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించట్లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కూడా రాలేదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మంత్రి కామినేని దీనిపై ఏదొక ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఉద్దానంలో ఇప్పటివరకు 39 వేల మందికి రక్తం, యూరియా, సీరం క్రియేటినిన్ పరీక్షలు నిర్వహించగా వారిలో 12 వేల మందికి సీరం క్రియేటినిన్ 1.2 శాతం కంటే ఎక్కువుగా ఉన్నట్లు వెల్లడైంది. కిడ్నీ వ్యాధి బారిన పడిన వీరికి తక్షణమే వైద్య సహాయం అందించాల్సి ఉంది. మిగతావారికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. గత జనవరి 19న సోంపేటలో జరిగిన సమావేశంలో పలాస, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని హామీ ఇచ్చినప్పటికీ కేవలం పలాసలో మాత్రమే శనివారం ప్రారంభిస్తున్నారు.
నిర్లక్ష్యం నీడలో రిమ్స్..
వెనుకబడిన సిక్కోలు జిల్లాకు ఆరోగ్య ప్రదాయినిలా ఉంటుందనే ఆశయంతో 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రిమ్స్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఛాయల్లోకి నెట్టేసింది. దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా చూడాలన్న వైఎస్ ఆశయాన్ని నీరుగార్చేస్తోంది. మొత్తం 13 బ్లాక్‌ల్లో ఇప్పటికీ ఏడు బ్లాకులు అందుబాటులోకి రాలేదు. పీజీ మెడికల్ సీటు ఒక్కటే రిమ్స్ బోధనాసుపత్రిలో ఉందంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
పరిపాలన తూతూమంత్రంగా మారిపోయింది. కీలకమైన పోస్టులన్నింటిలోనూ ఇన్‌చార్జి్జలతోనే నెట్టుకొస్తున్నారు. ఎంతో కీలకమైన డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, డీన్ (ప్రిన్సిపాల్) వంటి పోస్టుల్లోనూ రెండేళ్లుగా ఇన్‌చార్జి్జలే కొనసాగుతున్నారు. ఇలా ముఖ్యమైన వైద్యసిబ్బంది కొరత ఉన్నా ఆ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీని పర్యవసానంగా వైద్య కళాశాల, ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్లు తీవ్రమైన పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
రిమ్స్ ఫ్యాకల్టీ విభాగాల్లో 30 శాతం, వైద్యుల విభాగంలో 20 శాతం, దిగువ స్థాయి సిబ్బందిలో 20 శాతం మేర ఖాళీలు ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రిమ్స్‌కు వచ్చే రోగులకు తగినవిధంగా వైద్యసేవలు అందట్లేదు. వారంతా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులకో, లేదంటే విశాఖపట్నంలోని కేజీహెచ్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకో పరుగులు తీస్తున్నారు. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Advertisement