ఉద్దానం కిడ్నీకి  రక్షణ కవచం... కిడ్నీభూతంపై సర్కారు యుద్ధం  | World Kidney Day: AP Governments War On Kidney Disease | Sakshi
Sakshi News home page

ఉద్దానం కిడ్నీకి  రక్షణ కవచం... కిడ్నీభూతంపై సర్కారు యుద్ధం 

Published Thu, Mar 9 2023 9:49 AM | Last Updated on Thu, Mar 9 2023 10:23 AM

World Kidney Day: AP Governments War On Kidney Disease - Sakshi

ఉద్దానం అంటే కొబ్బరి, జీడి తోటలే గుర్తుకొస్తాయి. పరిమళించే పచ్చదనం.. సేదదీర్చే ప్రశాంత వాతావరణమే గుర్తుకొస్తాయి. అయితే ఆ ప్రశాంతత వెనుక గూడు కట్టుకున్న విషాదం ఉంది. గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఉన్నాయి. దశాబ్దాలుగా కబళిస్తున్న కిడ్నీ మహమ్మారిని గత పాలకులు పట్టించుకోలేదు. బాధితులను గాలికి వదిలేశారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. వ్యాధిగ్రస్తుల పాలిట ప్రభుత్వమే పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. డయాలసిస్‌ కేంద్రాలు, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు బాధితులకు నిరంతర వైద్య సేవలు, నెలనెలా రూ.పది వేల భృతితో కొండంత అండగా నిలుస్తోంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. కొన్నేళ్లుగా మరణ మృదంగం మోగుతోంది. ఏ ఊరు వెళ్లినా కిడ్నీ రోగులు కనిపిస్తూనే ఉంటారు. వ్యాధి నియంత్రణకు గత పాలకులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. 2019 వరకు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు, పరిశీలనలకే పరిమితయ్యారు తప్ప వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదు. తొలిసారిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నియంత్రణ చర్యలు చేపట్టారు. ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించారు. ఉద్దానానికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు నడుంబిగించారు. ఖర్చుకు వెనకాడకుండా ఏం చేయాలో, ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

పెరిగిన మందుల సరఫరా.. 
టీడీపీ హయాంలో డయాలసిస్‌ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును అక్కడి  అధికారులకు ప్రభుత్వం కల్పించింది.  

కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్స్, యూరిన్‌ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతీ శనివారం పలాస సీహెచ్‌సీలో సేవలుందిస్తున్నారు.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 
మూత్ర పిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది.   
పెయిన్‌ కిల్లర్‌ వినియోగం తగ్గించాలి.  
మద్యం, సిగరెట్లు అధికంగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. మూత్ర పిండాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరు మందగిస్తుంది. 
అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
రక్తంలో సుగర్‌ లెవెల్స్‌ అధికంగా ఉంటే కిడ్నీలకు వడపోత క్లిష్టంగా మారుతుంది. బీపీ కారణంగా శరీరంలో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. కిడ్నీలకు వేగంగా రక్తం రావడం వల్ల ఫిల్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.    

పింఛన్లతో ఆసరా.. 
టీడీపీ ప్రభుత్వంలో రూ.3,500 పింఛన్‌ను ఇచ్చేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక దానిని రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా సీరం క్రియేటినైన్‌ 5కుపైబడి ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.10వేల పింఛన్‌ ఇస్తున్నారు. ఈ లెక్కన 393 మందికి రూ.10వేలు చొప్పున, 367 మందికి రూ.5వేలు చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. 

ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగకు చెందిన నీలాపు కేదారి పదేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాలుగేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వైద్య సహాయం అందకపోవడంతో బరంపురం, విశాఖపట్నంలోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని లక్షల రూపాయల అప్పుల పాలయ్యారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో వచ్చాక మందుల ఖర్చులకు నెలకు రూ.5వేలు ఇవ్వడంతో కొంత ఆర్థిక భారం తగ్గింది. ఏడాదిన్నర నుంచి సోంపేటలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడు నెలకు రూ.10 వేలు పింఛన్‌తో పాటు ఉచితంగా మందులు అందిసున్నారు. వారానికి మూడు సార్లు 108 సిబ్బంది 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంపేటకు తీసుకెళ్తున్నారు. 

బాధితులకు అండగా.. 
ఓ వైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రిని నిర్మించడం, మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 

ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. పథకం అందుబాటులోకి వస్తే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 807 గ్రామాల్లో 7,82,707 మందికి  ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. దీనికోసం వంశధార నుంచి 1.12టీఎంసీల వినియోగించనున్నారు. 84 ఎంఎల్‌ ఫిల్టర్‌ సామర్ధ్యంతో 571 ట్యాంకుల ద్వారా ఊరూరు తాగునీరు అందించనున్నారు. 50 కిలోమీటర్ల పొడవునా మైగా పైపు లైను నిర్మించి, వాటి కింద మరో  134.818 కిలోమీటర్ల పైపులైన్‌ వేసి ఇంటింటికీ నీరందించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. కిడ్నీ వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా మంజూరు చేశారు. రూ.50కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ప్రారంభించనున్నారు.   

పెంచిన డయాలసిస్‌ సేవలు.. 
ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు.  

సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్‌ సెంటర్లలో గతంలో 13 పడకలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 19కి పెంచారు.  
కవిటి సీహెచ్‌సీ డయాలసిస్‌ సెంటర్లలో గతంలో 10 పడకలుండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి.  
హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.  
కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెల గాంలో డయాలసిస్‌ సెంటర్లు మంజూరయ్యాయి.  
ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10 పడకలు, బారువ సీహెచ్‌సీలో 10 పడకలతో డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.  రెండు కంటైన్డ్‌ బేస్డ్‌ సర్వీసెస్‌ డయాలసిస్‌ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క యూనిట్లలో ఏడేసి పడకలు ఉన్నాయి.   

పింఛన్‌తో భరోసా
కిడ్నీ సమస్య ఉందని, డయాలసిస్‌ చేసుకోవాలని ఏడాది క్రితం వైద్యులు సూచించారు. దీంతో పలాస ప్రభుత్వ అసుపత్రిలో డయాలసిస్‌ చేసుకుంటున్నాను. ఐదు నెలలుగా రూ.10 వేలు పింఛన్‌ వస్తుంది. మందులు, ఇతర ఖర్చులకు పింఛన్‌ కొంత వరకు సరిపోతుంది. 
– పి.కుసమయ్య, కిడ్నీ బాధితుడు, పెద్దబొడ్డపాడు, వజ్రపుకొత్తూరు 

సర్కారు అండతో.. 
కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న నేను రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. జగనన్న పుణ్యమా అని నాకు రూ.5వేలు పింఛన్‌ గత నెల వరకు వచ్చేది. ప్రస్తుతం మరో రూ.5 వేలు పింఛన్‌ అదనంగా ఈ నెల నుంచి వస్తుంది. ఈ మొత్తంతో కొంత వరకు ఆర్థిక ఇబ్బందులు తీరుతున్నాయి.  
– సిర్ల కాంతమ్మ, పింఛన్‌ లబ్ధిదారు, వజ్రపుకొత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement