సేలంలో భారీ చోరీ
► 700 సవర్ల బంగారు నగలు, రూ. 2లక్షలు అపహరణ
► నిఘా కెమెరాల కనెక్షన్లు కట్
► రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు
సేలం: సేలంలోని వ్యాపార వేత్త ఇంట్లో భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది. సేలం కిచ్చిపాళయం అంకమ్మాల్ ఆలయ వీధికి చెందిన ఆదియప్పన్ (74). ఈయన సెవ్వాపేట ప్రాంతంలో కొయ్య, ఇనుప వస్తువుల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని మొదటి భార్య మృతి చెందింది. ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(40) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు మనోజ్ కుమార్, కుమార్తె దేవిప్రియ ఉన్నారు. గత ఏడాదిన్నర కిందట అనారోగ్యం కారణంగా ఆదియప్పన్ మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన భార్య విజయలక్ష్మి వ్యాపారం నడుపుతూ వస్తోంది.
ఆమెకు సహాయంగా సోదరుడు భాస్కర్ కూడా ఉన్నాడు. ఆయన తన కుటుంబం సహా సోదరి ఇంట్లోనే ఉంటున్నాడు. విజయలక్ష్మి తన కుటుంబంతో అంకమ్మాల్ ఆలయ వీధిలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం విజయలక్ష్మి తన కుటుంబంతో తిరుమల వెళ్లారు. ఇంటికి భద్రతగా తన తండ్రి దక్షిణా మూర్తి(63), శివభాగ్యం(58) ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం తిరుమల నుంచి తిరిగి వచ్చిన విజయలక్ష్మి కారు డ్రైవర్‌కు డబ్బు ఇవ్వడం కోసం బీరువాను తెరిచి చూసింది. అప్పుడు బీరువాలో ఉన్న 700 సవర్ల నగలు, రూ. 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కిచ్చిపాళయం పోలీసుల విచారణ : విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కిచ్చిపాళయం పోలీసులు, జాగిలం, ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంటి వెనుక వైపు ఉన్న స్నానపు గది తలుపులు, కిటికీలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో పలు గదుల్లో 8 నిఘా కెమెరాలు ఉన్నాయని, అయితే వీడియో దృశ్యాలను నమోదు చేసే బాక్స్‌ను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది.
మంత్రించిన నిమ్మ పండు : బీరువాలో మంత్రించిన నిమ్మపండు, దానితోపాటు పసుపు కుంకుమలు పూసిన ఒక లేఖ ఉంది. ఆ లేఖలో ‘ఈ విషయం గురించి బయట చెబితే కుటుంబం నాశనమవుతుంది’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో తమ ఇంట్లో అప్పుడప్పుడు పూజలు చేస్తారని విజయలక్ష్మి తెలిపారు.
ఆ పూజలు చేసే ఒక స్వామీజీ వద్ద పలుమార్లు డబ్బు, నగలు చూపినట్టు చెప్పింది. అంతేకాకుండా ఇటీవల పూజ చేసిన సమయంలో తమను తిరుపతికి వెళ్లి రావాల్సిందిగా సూచించింది కూడా ఆ స్వామీజీనే అని వెల్లడించింది. దీంతో పూజలు చేసిన ఆ స్వామీజీపై పోలీసులకు సందేహం ఏర్పడింది. ఇంటిలోపల ఒక్క కిటికీ అద్దాలుకానీ, తలుపులు, తాళాలు కానీ ఏవీ పగులగొట్టలేదు. నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ చేసి ఉన్నాయి. దీంతో ఆ కుటుంబీకులకు బాగా తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు సందేహిస్తున్నారు.
రెండు ప్రత్యేక బృందాల పోలీసులు : సేలం నగర పోలీస్ కమిషనర్ సంజయ్‌కుమార్, నేర విభాగ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణన్, పోలీసు అధికారులు చోరీ జరిగిన ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం సంజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సహాయక కమిషనర్ల అధ్యక్షతన ఆరుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నేరస్తులను పట్టుకుంటామన్నారు. సీసీటీవీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి ఉందని, త్వరలో నేరస్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ చోరీ గురించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం వెల్లడైంది.