తెలంగాణకు న్యాయం జరగలేదు
కొత్త రాష్ట్రం కొండంత ఆశలు పెట్టుకుంది
రైల్వే బడ్జెట్‌పై చర్చలో ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం లోక్‌సభలో రైల్వేబడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రైల్వే బడ్జెట్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై అంతగా దృష్టి పెట్టలేదు. ఇది ప్రజలందరినీ నిరుత్సాహ పరిచింది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం, భారత రైల్వేవిభాగం సగటు మనిషి అవసరాలను, ఆకాంక్షలను తీర్చడంలో విఫలమయ్యాయి.
రైల్వేలో సరైన సదుపాయాలు ఏర్పడక పోవడంతో రోజూ రైల్వే ద్వారా ప్రయాణం చేస్తున్న 2.5 కోట్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈసారైనా కొంత మేలు జరుగుతుందని ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. 120 కోట్లుగా ఉన్న ప్రస్తుత దేశ జనాభాకు అనుగుణంగా రైల్వే నెట్ వర్క్ విస్తరించాలని, ప్రజల అవసరాలు తీర్చాలని చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కేవలం 12 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ మాత్రమే ఉంది. ఉన్న రైలు మార్గాల్లోనే ఏటా కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు.
దీనికారణంగా రైలు మార్గాలపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలకు దారితీసే పరిస్థితి ఉంది. విద్యుదీకరణ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 65 వేల కిలోమీటర్ల ట్రాక్‌లో కేవలం 20,833 కిలోమీటర్ల ట్రాక్‌కు మాత్రమే విద్యుదీకరణ పూర్తయ్యింది. ఇప్పటికీ దేశ వాణిజ్య రాజధాని ముంబై, దేశంలోనే ఐదో పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య డీజిల్ లోకోమోటివ్ సర్వీసులు నడుస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ఇక అడ్వాన్స్ రిజర్వేషన్‌ను 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. సీట్లను బ్లాక్ చేసుకోవడానికి టికెట్ మాఫియాకు ఇదొక సువర్ణ అవకాశంగా మారనుంది.
బహుశా మంత్రి విమానయాన సర్వీసుల్లో మాదిరిగా అడ్వాన్స్ టికెటింగ్ ద్వారా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు దీనిని ప్రవేశపెట్టారేమో. కానీ విమానయాన సర్వీసుల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే కాస్త చవకగా, డిస్కౌంట్‌తో కూడిన టికెట్ ఇస్తారు. కానీ రైల్వేలో ప్రవేశపెట్టిన ఈ 120 రోజుల ముందస్తు టికెట్‌కు ఏ రకమైన డిస్కౌంట్ లభించదు. అయితే రైల్వే టికెట్ చార్జీలను పెంచకుండా ప్రయాణికులపై భారం వేయనందుకు సంతోషం. దీనిని స్వాగతిస్తున్నాం. మరో ముఖ్యవిషయం ఏంటంటే ఈ బడ్జెట్లో ఒక కొత్త రైలును కూడా ప్రకటించలేదు.
ఇది కూడా స్వాగతించదగిన పరిణా మం. గత బడ్జెట్లలో చేసిన ప్రకటనలను ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రకటించిన కొత్త రైల్లేవీ ఇంకా పట్టాలెక్కలేదు. అలాగే ఇప్పుడు ట్రాక్ సంబంధిత మౌలిక వసతులను బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది. రైల్వేబోర్డు మాజీ సభ్యుడొకరు ఏం చెప్పారంటే ఒక ప్యాసింజర్ రైలు కి.మీ.కు రూ. 450 సంపాదిస్తే.. గూడ్స్ రైలు రూ. 4,500 సంపాదిస్తుందని చెప్పారు.
అందువల్లే ప్రభుత్వం గూడ్స్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తూ ప్యాసింజర్ ట్రాఫిక్‌ను విస్మరిస్తున్నట్టుగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేకు మౌలిక వసతుల కోసం రూ. 2,768 కోట్లు కేటాయించారు. అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల పేర్లతో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఉండకూడదు? తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించడంలో గానీ, ప్రస్తుత ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పేరు మార్చకపోవడంపై గానీ రైల్వే శాఖ నిర్ణ యం తీసుకోకపోవడంలో ఉన్న తర్కమేంటో నాకు అర్థం కావడం లేదు. కాజీపేటను డివి జన్‌గా మార్చడం వల్ల వెనకబడిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌ను ప్రకటించింది. కానీ దీనికి సరైన కేటాయింపులు లేక ముం దుకు సాగడం లేదు.’ అని పేర్కొన్నారు.
మేనేజ్మెంట్ విద్యాసంస్థల మూసివేతపై ప్రస్తావన
విద్యార్థుల కొరత కారణంగా ఎంబీఏ విద్యాసంస్థలు ఉనికి కోల్పోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఎంపీలు ధృవ్ నారాయణ, జి.హరి లోక్‌సభలో బుధవారం ప్రశ్నించారు. ఉనికి కోల్పోతున్న విద్యాసంస్థల వివరాలను రాష్ట్రాల వారీగా అందజేయాలని, కళాశాలల మూసివేతకు కారణాలపై ప్రభుత్వం చేసిన అధ్యయనం, తీసుకున్న చర్యలను తెలపాలని ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. ఎంపీల ప్రశ్నలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ బదులిస్తూ దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల్లో విద్యార్థుల కొరతతో ఎంబీఏ విద్యాసంస్థలు ఉనికి కోల్పోతున్న విషయం కేంద్రం దృష్టికి రాలేదన్నారు. దేశంలో 12 రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్న 41 సంస్థలను 2014-15లో మూసివేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 విద్యాసంస్థలను మూసివేసినట్టు తెలిపారు.