నేడు ‘ఏఈఈ’ ప్రాథమిక కీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ‘ఏఈఈ’ పరీక్ష ప్రాథమిక కీని మంగళవారం (ఈ నెల 22న) ఉదయం 10 గంటలకు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అలాగే అభ్యర్థుల జవాబు పత్రాల కాపీలను కూడా అందజేస్తామని.. వీటిని కూడా మంగళవారం వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది.
పరీక్షను వాయిదా వేయించే కుట్ర?
ఆదివారం నిర్వహించిన ఏఈఈ పరీక్షలను వాయిదా వేయించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో 100 కంప్యూటర్లను మొరాయించేలా చేశారని టీఎస్పీఎస్సీ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఉదయం పరీక్ష పరిశీలకులు వెళ్లినపుడు బాగానే పనిచేసిన కంప్యూటర్లు తర్వాత కొద్దిసేపటికే పనిచేయకుండా పోవడంపై టీఎస్పీఎస్సీ, టెక్నికల్ బృందంతో పరిశీలన జరిపించింది.
ఆ బృందంతోపాటు అబ్జర్వర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కొంత మంది విద్యార్థులు, కాలేజీలో పనిచేసే ఒకరిద్దరు వ్యక్తులు కావాలనే తప్పిదానికి పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్యను విచారణ అధికారిగా టీఎస్పీఎస్సీ నియమించింది. మరోవైపు ఈ సంఘటనపై టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యం కూడా డీజీపీకి లేఖ రాశారని, దీంతో పోలీసు విచారణ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. మరో వైపు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పరీక్ష విజయవం తం కావడానికి సహకారం అందించిన వారందరికీ టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది.