aeo posts
-
మరో 200 ఏఈవో పోస్టులు
భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చే నెలలో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: మరో 200 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకు వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయ నుందని ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. తాజాగా ఏవో పోస్టుల ఫలితాల్లోనూ ఏఈవోలూ అర్హత సాధిం చారు. దీంతో కొన్ని ఏఈవో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశముంది. వాటితో కలిపి 200కు పైగా ఏఈవో పోస్టులు ఉంటాయని.. వాటి భర్తీకి సర్కారు ఆమోదం కూడా లభించిందని పార్థసారథి తెలిపారు. ఇదిలావుండగా ఈసారి ఏఈవో పోస్టులకు వ్యవసాయ ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పదిలో ఒక పోస్టు చొప్పున గతంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కేటాయించగా... వారితోపాటు ఈసారి ఆ పోస్టును వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా భాగం కల్పించారు. ఆ ప్రకారం 200 పోస్టుల్లో 20 పోస్టులు వ్యవసాయ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు దక్కుతాయి. ఈ మేరకు న్యాయశాఖ కూడా అనుమతి ఇచ్చిందని పార్థసారథి తెలిపారు. వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు న్యాయం... ఏఈవో పోస్టుల్లో వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన వ్యవసాయశాఖ మరోవైపు ఇతర పోస్టుల్లోనూ వారికి అర్హత కల్పించే విషయంపై సమగ్ర పరిశీలన చేస్తోంది. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 16, నిజామాబాద్ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 7, మహబూబ్నగర్ జిల్లాలో 28, మెదక్లో 15, రంగారెడ్డిలో 37, కరీంనగర్లో 16, ఖమ్మంలో 11, నల్లగొండ జిల్లాలో 11 ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం ఆ పోస్టుల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులు రెండు, వివిధ కేటగిరీలకు చెందిన డ్రాఫ్ట్మేన్ పోస్టులు 18 పోస్టులు, వ్యవసాయ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు నాలుగున్నాయి. వివిధ గ్రేడ్లకు చెందిన మెకానికల్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి. వాటిలో తమనే భర్తీ చేయాలని వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ ఫైలును కూడా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. -
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే
సాక్షి, హైదరాబాద్: వ్యవ సాయ శాఖలో ఖాళీగా ఉన్న 1000 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులేనని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టుల కోసం ఈనెల 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చినందున వారు దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో (www.tspsc.gov.in) పొందవచ్చని వివరించారు. -
తెలంగాణలో మరిన్ని కొలువులు వచ్చేశాయ్
► మూడు శాఖల్లో 1,477 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో శుభవార్త. మూడు శాఖల్లో మొత్తం 1,477 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 1,000 గ్రేడ్-2 విస్తరణాధికారి (ఏఈవో) పోస్టులకు, రవాణాశాఖలో 137 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 340 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏఈవో పోస్టులకు మే 19 వరకు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మే 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఏఈవో పోస్టులకు జూన్ 4న రాతపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టులకు రాతపరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటి స్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. అర్హతలు, ఇతర వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. -
అగ్రికల్చర్ వర్సిటీలో కొనసాగుతున్నఆందోళన
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రెండో రోజు కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఈఓ పోస్టులను అగ్రికల్చర్ విద్యార్థులకే కేటాయించాలని కోరుతూ యూనివర్సిటీలో సుమారు 300 మంది విద్యార్థులు ధర్నా చేసి, అనంతరం ర్యాలీ తీశారు. యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావును విద్యార్థులు అడ్డుకున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న పరీక్షలను కూడా అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. -
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆందోళన
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం ధర్నాకు దిగారు. ఏఈఓ పోస్టులను అగ్రికల్చర్ విద్యార్థులకే కేటాయించాలని వారు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలో తరగతులను బహిష్కరించి కాలేజీ గేటు ముందు బైఠాయించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.