భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వచ్చే నెలలో టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: మరో 200 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకు వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయ నుందని ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. తాజాగా ఏవో పోస్టుల ఫలితాల్లోనూ ఏఈవోలూ అర్హత సాధిం చారు. దీంతో కొన్ని ఏఈవో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశముంది. వాటితో కలిపి 200కు పైగా ఏఈవో పోస్టులు ఉంటాయని.. వాటి భర్తీకి సర్కారు ఆమోదం కూడా లభించిందని పార్థసారథి తెలిపారు. ఇదిలావుండగా ఈసారి ఏఈవో పోస్టులకు వ్యవసాయ ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
పదిలో ఒక పోస్టు చొప్పున గతంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కేటాయించగా... వారితోపాటు ఈసారి ఆ పోస్టును వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా భాగం కల్పించారు. ఆ ప్రకారం 200 పోస్టుల్లో 20 పోస్టులు వ్యవసాయ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు దక్కుతాయి. ఈ మేరకు న్యాయశాఖ కూడా అనుమతి ఇచ్చిందని పార్థసారథి తెలిపారు.
వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు న్యాయం...
ఏఈవో పోస్టుల్లో వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన వ్యవసాయశాఖ మరోవైపు ఇతర పోస్టుల్లోనూ వారికి అర్హత కల్పించే విషయంపై సమగ్ర పరిశీలన చేస్తోంది. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 16, నిజామాబాద్ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 7, మహబూబ్‌నగర్ జిల్లాలో 28, మెదక్‌లో 15, రంగారెడ్డిలో 37, కరీంనగర్‌లో 16, ఖమ్మంలో 11, నల్లగొండ జిల్లాలో 11 ఖాళీగా ఉన్నట్లు తెలిసింది.
మొత్తం ఆ పోస్టుల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులు రెండు, వివిధ కేటగిరీలకు చెందిన డ్రాఫ్ట్‌మేన్ పోస్టులు 18 పోస్టులు, వ్యవసాయ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు నాలుగున్నాయి. వివిధ గ్రేడ్లకు చెందిన మెకానికల్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి. వాటిలో తమనే భర్తీ చేయాలని వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ ఫైలును కూడా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.