అమెరికా ‘రావెన్’లు ఇక మేడిన్ ఇండియా!
బెంగళూరులో ఇరు దేశాల సంయుక్త తయారీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ భారీ ప్రాజెక్టు భారత్‌కు దక్కనుంది. ఇప్పటిదాకా అమెరికా కంపెనీ ఎరో విరోన్‌మెంట్ తయారుచేస్తున్న తేలికపాటి ‘రావెన్’ మానవ రహిత విమానాలు(యూఏవీ) ఇక బెంగళూరులో తయారు కానున్నాయి. దీంతో భారత్‌కు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కనున్నాయి. ఒబామా పర్యటనలో ఇరుదేశాలు దీనిపై ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. రావెన్‌లను ప్రధానంగా నిఘా కోసం వినియోగిస్తారు. వీటిని చేతుల్లో నుంచే గాల్లోకి ఎగరేసే వీలుంటుంది. 10 కి.మీ పరిధిలో నిఘా విధులు నిర్వర్తిస్తాయి.
తేలికపాటి రావెన్‌లను భారత్-అమెరికా సంయుక్తంగా బెంగళూరులో తయారు చేస్తాయని, వీటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఏడు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే సి-130జే రవాణా విమానాలకు సంబంధించిన ‘రోల్-ఆన్, రోల్-ఆఫ్’ టెక్నాలజీ కూడా భారత్‌కు అమెరికా అందించనుంది. భారత్ ఇప్పటికే 12 సీ-130జే హెర్క్యూల్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది. అమెరికా అందజేసే టెక్నాలజీతో వీటి సామర్థ్యం మరింత పెరగనుంది. ఈ విమానాలు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కిందకు దిగేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేయనుంది.