agni gunda pravesham
-
సమాజం ఎటు పోతోంది.. ఏ కాలంలో ఉన్నాం?
ఇటీవల కేరళలో దంపతులు డబ్బుల కోసం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసి, వండుకుని తిని ప్రపంచ ప్రజలకు ఒళ్ళు జలదరింప చేశారు. దీనికి కారణం మూఢనమ్మకాలు మాత్రమే. ఈ సంఘటన మరువక ముందే గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జిల్లాలో కన్న తండ్రే తన 14 సంవత్సరాల కూతురిని భూతశక్తులు వస్తాయి అనే మూఢ నమ్మకంతో అగ్ని గుండంలో తోసేసి జనాన్ని విస్మయపరిచాడు. అసలు నేటి సమాజం ఎటు పోతోంది? ఈ ఆధునిక 21వ శతా బ్దంలో, మానవుడు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న క్రమంలో ఏమిటీ మూఢ నమ్మకాలు, విశ్వాసాలు? దీనికి అంతటికీ కారణం మాయ మాటలు చెప్పి, మోసం చేసే బాబాలు, స్వామీజీలు, భూతవైద్యులు! ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతూంటే, కొందరు ఇంకా మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఆదిమ సమాజంలోనే కూరుకుపోవడం దురదృష్టకరం. ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మరాదు. అంధ విశ్వాసాలను హేతువాదంతో జయించాలి. ఆధునిక కాలంలో అత్యాధునికమైన ఆలోచనలతో నవీన మానవుడుగా మసలడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ దిశలో మీడియా, ప్రభుత్వాలూ తగిన ప్రచారాన్ని చేపట్టాలి. (క్లిక్: కేరళ నరబలి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!) – రావుశ్రీ, కాకినాడ -
మహాశివరాత్రి వేడుకల్లో ప్రమాదం
-
శివా..శివా.. తోసుకురాకండయ్యా..!
సాక్షి, సూర్యాపేట : మండలంలోని పిల్లలమర్రి గ్రామంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఐదు రోజుల శివరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఎరకేశ్వరాలయం ఎదుట నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో శివపార్వతుల విగ్రహాలతో అగ్నిగుండాలు దాటే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ఒకరిపై ఒకరు తోసుకురావడంతో ఒత్తిడికి గురై అగ్నిగుండాల్లో పడిపోయారు. దీంతో పలువురు నిప్పుల్లో పడి గాయాలపాలయ్యారు. మండలి సైదమ్మ, షేక్ నజీమాతో పాటు చిన్నారి మధరబోయిన చందనకు గాయపడ్డారు. అక్కడే ఉన్న భక్తులు వెంటనే స్పందించి నిప్పుల్లో పడినవారిని బయటకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
వైభవంగా శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం
రొద్దం : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రొద్దకాంబ రుద్రపాద 10వ జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రస్వామి వేషాదారుల వీరగాసే నృత్యాలు అందరిని అలరించాయి. వారు వివిధ విన్యాశాలతో భక్తులు విసిరే టెంకాయలు, నిమ్మకాయలను ఖడ్గంతో ఒకే దెబ్బకు కొడుతూ అందరిని ఆశ్చర్య పరిచారు. అనంతరం వారు నృత్యాలు చేస్తూ అశేష జనసందోహం మధ్య అగ్ని గుండ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ మున్నీర్అహ్మద్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.