aha naa pellanta
-
అహ! నా పెళ్ళంట!
అహ! నా పెళ్ళంట! హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శ కత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ 1987లో నిర్మించిందీ చిత్రాన్ని. పిసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్లో ఓ చరిత్ర సృష్టించింది. మొదట్నుంచి చివరి వరకూ హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్రప్రసాద్ ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన సినీ కెరీర్లో ‘అహ! నా పెళ్ళంట!’ ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్‌కు వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయోక్తి కాదేమే. కోట శ్రీనివాసరావు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు. హీరోయిన్ గా రజని, ఇంకా నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి వంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.పిసినారులకే పిసినారిసినిమాలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హీరో రాజేంద్రప్రసాద్. తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్ రజని తండ్రి కోట శ్రీనివాస రావు పిసినారులకే పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారిగా మారిన రాజేంద్రప్రసాద్ పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అందులో భాగంగా హీరో తాను ఇంకా వెయ్యి రెట్లు పిసినారినని నిరూపించుకోడానికి నానా తంటాలు పడుతుంటాడు.అలా కొంత కాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో.. తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి నూతన్ ప్రసాద్ కూడా ఆ ఊరొచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకూ పగలబడి నవ్విస్తాడు డైరక్టర్. చివరికి పిసినారి భార్య, కూతురు కలసి తిరగబడి కోటకు బుద్ధి చెప్పి ఈ పెళ్ళికి ఒప్పిస్తారు.కళ్ళజోడుని రాయితో కొట్టి మరీ...‘అహ! నా పెళ్ళంట!’ సినిమా కథను ప్రముఖ కథా రచయిత ఆది విష్ణు రాసిన ‘సత్యం గారి ఇల్లు’ నవల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... కథలో కీలకమైన పాత్ర పిసినారి, హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రను తొలుత రావు గోపాలరావు పోషిస్తే బావుంటుందని భావించారు. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరి కాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకుని కోట శ్రీనివాసరావును అనుకున్నారు. అప్పటికి కేవలం రెండంటే రెండే సినిమాల్లో నటించిన కోటను ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్టే కోట అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావులు పోటీపడి నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట తన జుట్టు చాలా వరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తుండడంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక–నిర్మాతలను ఒప్పించి మరీ ‘అహ! నా పెళ్ళంట!’లో ఆ పాత్ర చేశారు. ముతక పంచె, చిరిగిన బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ రోల్ ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి ఉండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట. కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి మరీ పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు.అరగుండు బ్రహ్మానందంగా...బ్రహ్మానందంకు ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాస రావును తిట్టే తిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను హైదరాబాద్, దేవర, యామి జాల గ్రామాల్లో తీశారు. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్ళలో వేరే సెట్లు వెయ్యకుండానే తియ్యడం ఈ సినిమా మరో ప్రత్యేకత. దాదాపు రూ. 16 లక్షలతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 5 కోట్లు వసూలు సాధించడం విశేషం. సినిమా కథలో ‘పిసినారితనం’ కీలకం... కానీ కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులు చాలా ధారాళం చూపించారు. ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ‘అహ! నా పెళ్ళంట!’ తర్వాత ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. భవిష్యత్తులో వస్తాయా? అంటే ప్రశ్నార్థకమే. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
మండపంలో పెళ్లికూతురు మిస్సింగ్.. ఊహించని రెస్పాన్స్
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'అహ నా పెళ్లంట'. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా అదరగొడుతోంది. నవంబర్ 17న జీ5లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను చేరుకుంది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ చోటు దక్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అసలు కథేంటంటే..: ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూసేలా ఉందని అందరూ అంటున్నారు. ఈ వారాంతాన్ని మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలకుంటే వెంటనే అహ నా పెళ్లంట చూసేయండి. -
ఆ హీరోతో డేటింగ్.. దుబాయ్‌కు పారిపోయానన్నారు : శివానీ రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్‌కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్‌సిరీస్‌లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్‌ను నాకు తగిలేసి శివానీ బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు. దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్‌ఫ్రెండ్‌తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్‌కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరో రాజ్‌తరుణ్‌తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్‌తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది. -
‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్ టైటిల్ : అహ నా పెళ్ళంట (8 ఎపిసోడ్స్) నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, 'గెటప్' శ్రీను, భద్రమ్, తదితరులు నిర్మాతలు: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి దర్శకత్వం: సంజీవ్ రెడ్డి సంగీతం : జుడా శాండీ నేపథ్య సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ ఎడిటర్: మధు రెడ్డి విడుదల తేది: నవంబర్ 17, 2022(జీ5) కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ విజయాలు అందుకొని టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు. ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’. శివానీ రాజశేఖర్ హీరోయిన్. నేటి(నవంబర్ 17) నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి రాజ్ తరుణ్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అహ నా పెళ్లంట’ కథేంటంటే.. నారాయణ అలియాస్ నో బాల్ నారాయణ( హర్ష వర్ధన్), సుశీల(ఆమని) దంపతులు ముద్దుల కొడుకు శ్రీను (రాజ్ తరుణ్). చాలా అల్లరిగా ఉండే శ్రీను.. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఇకపై అమ్మాయిలతో మాట్లాడనని, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని తల్లి సుశీలకు ప్రామిస్ చేస్తాడు. చెప్పినట్లే శ్రీను అమ్మాయిల జోలికి వెళ్లడు. చూడ చూడక ఒక అమ్మాయిని చూస్తే.. ఆ రోజు నాన్న నారాయణకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. దీంతో శ్రీను తను అమ్మాయిలను చూడడం వల్లే నాన్నకు ప్రమాదాలు జరుగుతున్నాయని, పెళ్లి చేసుకుంటే ఇవేవి ఉండవని భావిస్తాడు. తనకు పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడుగుతాడు. వారు చూసిన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా పెళ్లి రోజు ఆ అమ్మాయి ‘ప్రేమించిన అబ్బాయితో లేచిపోతున్నాను’అని లేఖ రాసి పారిపోతుంది. పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగడంతో శ్రీనుతో పాటు కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. తన పెళ్లి ఆగడానికి కారణం మహా(శివానీ రాజశేఖర్) అని శ్రీను తెలుసుకుంటాడు. తన కుటుంబం లాగే ఆమె ఫ్యామిలీ కూడా బాధపడాలని పెళ్లికి ఒక్కరోజు ముందు మహాను కిడ్నాప్ చేస్తాడు. అసలు శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మహా ఎలా కారణమైంది? కిడ్నాప్ తర్వాత శ్రీను, మహా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండడానికి కారణమేంటి? మహా ప్యామికీ వచ్చిన ఓ సమస్యను శ్రీను ఎలా పరిష్కరించాడు? ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు? తనను కిడ్నాప్ చేసింది శ్రీనునే అని మహాకు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత మహా తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే వరుసగా ఎనిమిది ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'అహ నా పెళ్ళంట' ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. పెళ్లి పీటల దగ్గరు వరుడిని వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ వధువు కథ ఇది. వరుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో కథ ముందుకు సాగుతుంది. వెబ్ సిరీస్‌లా కాకుండా సినిమాలా కథనం సాగుతుంది. దీనికి కారణం దర్శకుడు సంజీవ్ రెడ్డి టేకింగ్ అనే చెప్పాలి. వెబ్ సిరీసే అయినప్పటికీ.. సినిమాలోలాగా పాటలు, కామెడీ, రొమాన్స్..అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. తొలి ఎపిసోడ్ నిడివి ఎక్కువైనప్పటికీ సరదాగా సాగుతుంది. పాటలు, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. రెండో ఎపిసోడ్ కాస్త నెమ్మగా, రొటీన్‌గా సాగుతుంది. మహా కిడ్నాప్‌తో మూడో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. కిడ్నాప్ సమయంలో, ఆతర్వాత వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. నాలుగో ఎపిసోడ్ రొటీన్‌గా సాగినప్పటికీ.. శ్రీను, మహా ఒకే ఫ్లాట్‌లోకి రావడంతో ఆసక్తి పెరుగుతుంది. ఐదో ఎపిసోడ్ కూడా కామెడీగానే సాగుతుంది. ఆరో ఎపిసోడ్ నుంచి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చాలని శ్రీను నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్లిపోవడం.. శ్రీనుతో ప్రేమలో పడడం ఇలా ఎమోషనల్‌గా మిగతా ఎపిసోడ్స్ సాగుతాయి. క్లైమాక్స్ కూడా కాస్త డిఫరెంట్‌గా, చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు ఈ సిరీస్‌లో ఉంటాయి. రొటీన్ స్టోరీనే అయినా.. ఫ్రెష్‌గా, ఎలాంటి అశ్లీలత లేకుండా ఈ వెబ్సిరీస్ని తెరకెక్కించాడు సంజీవ్ రెడ్డి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ని ఎంచుకొని, తెరపై అనుకున్న విధంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. శ్రీను పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన శైలీలో కామెడీ పండించాడు. మహా పాత్రకు శివానీ రాజశేఖర్ న్యాయం చేసింది. ఆమె పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. రాజ్‌తరుణ్, శివానీ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. హీరో తల్లిదండ్రులుగా ఆమని, హర్షవర్ధన్ బాగా నటించారు. రాజ్ తరుణ్ స్నేహితులుగా రవి శివతేజ, త్రిశూల్ జీతూరి బాగానే నవ్వించారు. పెళ్లికి ముందు లేచిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, సీఐగా రఘు కారుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీల సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
రాజ్ తరుణ్ 'అహ నా పెళ్లంట' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. కాగా ఈ సిరీస్‌లో నరేష్,పోసాని కృష్ణమురళి, ఆమని కీలక పాత్రలు పోషించారు. -
Raj Tarun: రాజ్‌తరుణ్ ‘అహ నా పెళ్లంట’.. ఆ విశేషాలు ఏమిటంటే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్)/తూర్పుగోదావరి: తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్న అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి దర్వకత్వంలో రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గరిమెళ్ల సత్యనారాయణ ట్రైనింగ్ కళాశాలలో షూటింగ్ మొదలైంది. చదవండి: చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే రాజ్‌తరుణ్, కమెడియన్ హర్షవర్థన్‌పై ఎంపీ భరత్ రామ్ క్లాప్ కొట్టగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లకు రాజమహేంద్రవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సినిమా షూటింగ్‌లు, స్టూడియోల ఏర్పాటుకు విశాఖలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తర్వాత రాజమహేంద్రవరంలోని పిచ్చుకలంకను తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం జంధ్యాల తీసిన అహ నా పెళ్లంట సినిమాలాగా ఈ వెబ్ సిరీస్ విజయవంతం అవుతుందన్నారు. దర్శకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సిరీస్‌లో ఆమని, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తారన్నారు. -
‘అహా నా పెళ్ళంట’ మూవీలో కోట పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా!
రాజేంద్ర ప్రసాద్ తొలి కామెడీ చిత్రం ఆహా నా పెళ్లంట. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా 1987 వచ్చిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్‌కు రెడ్ కార్పెట్ పరిచిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల అలరించాడు. అంతేగకా హాస్య బ్రహ్మ బ్రహ్మనందంను నటుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో బ్రహ్మి నత్తివాడిగా.. అరగుండు పాత్రలో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి. ఈ పాత్రలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. చెప్పాలంటే ఆహా నా పెళ్లంట మూవీ గుర్తు వస్తే చాలు ముందుగా గుర్తోచ్చే పాత్ర కోట శ్రీనివాస్‌దే. ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ కూరతో అన్నం తింటున్నట్టుగా ఆస్వాధించిన సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక చూట్టాలు ఇంటికి వస్తే ఇలా చేయాలంటూ ఆ సన్నివేశాన్నే ఉదహరణగా తీసుకుంటూ చమత్కరిస్తుంటారు. అంతేగాక బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఎన్నో సీన్లలో పిసినారి లక్ష్మిపతిగా కోట తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇప్పటికీ ఆ సీన్లు గుర్తోస్తే నవ్వని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా కోట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఒదిగిపోయాడు. అంతలా ఆ పాత్రను పండించిన కోట శ్రీనివాస్‌ను మొదట తీసుకునేందుకు నిర్మాత రామానాయుడు ఒప్పుకొలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఎందుకంటే ఈ మూవీకి పిసినారి లక్ష్మిపతి పాత్రే కీలకం. అది పండితేనే ఈ సినిమా హిట్ లేదంటే పరాజయం చూడాల్సిందే. అంతటి ఈ ప్రధాన పాత్రకు కోట శ్రీనివాస రావును తీసుకోవాలని డైరెక్టర్ జంధ్యాల రామానాయుడికి సూచించాడట. అయితే ఈ పాత్ర కోటతో వద్దని ప్రముఖ నటుడు రావుగోపాలరావుతో చేయించాలని ఆయన అనుకున్నట్లు కోట వివరించాడు. అయితే జంధ్యాల మాత్రం ఆయనను తప్ప ఇంకేవరిని లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదట. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారని ఆయన అన్నాడు. అయితే కోట నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల తర్వాత జంధ్యాల ఈ పాత్రకు కోటను ఫిక్స్ అయ్యారట, దీంతో ఆ మూవీలో పిసినారి పాత్రకు కోటను తప్ప ఇంకేవరిని తీసుకున్న పరాజయం తప్పదని తెల్చి చెప్పాడట. దీంతో రామానాయుడు చివరకు ఈ పాత్రకు కోట శ్రీనివాసరావును ఓకే చేశారట. కాగా ఒక రోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండా అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారట. కోటను చూసిన ఆయన ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడట. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పి. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడట. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్‌కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని ఆయన బదులిచ్చినట్లు తెలిపారు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్‌నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు ఆయనతో అన్నారని, ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట రామానాయుడు. -
ఉక్కపోత
సమ్సారం సంసారంలో సినిమా కొత్త క్యాలెండర్ వచ్చిన మూడో నెలలో ఉగాది పండగొచ్చింది, పిల్లలకు పరీక్షలూ వచ్చాయి. నాలుగో నెలలో శ్రీరామనవమి వచ్చింది, పానకంతోపాటు ఎండలొచ్చాయి. వేసవి సెలవులూ వచ్చేశాయి. ‘‘చింటూ! ఇంకా బ్రష్ చేయలేదా? త్వరగా బ్రష్ చేసి పాలు తాగు’’ అంటూ పాలగ్లాసు టేబుల్ మీద పెట్టింది గాయత్రి. క్యాలెండర్లో హాలిడేస్ మొదలైన రోజును మార్క్ చేశాడు చింటూ. వెంటనే మరో రెండు పేజీలు తిప్పి... జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయ్యే రోజును మార్క్ చేశాడు.‘‘నాన్నా! ఈ రోజులన్నీ సన్డేలేనా... స్కూల్‌కి వెళ్లడమే ఉండదా నిజంగా’’ క్యాలెండర్లో ఏప్రిల్, మే నెల పేజీలను చూపిస్తూ సందేహంగా అడిగాడు. మా వాడి భాషలో సన్డే అంటే సెలవు. వాడి యుకెజి బుర్రకు స్కూలుకెళ్లని రోజులన్నీ ఆదివారాలే. ‘‘అన్నీ సన్డేలు కాదు. కానీ హాలిడేసే కన్నా’’ అని ఇంకా వివరించబోయా.ఇంక చాల్లే అన్నట్లు అడ్డుపడి ‘‘హాలిడేస్‌కు ఎక్కడికెళ్దాం నాన్నా’’హాలిడే – పదాన్ని చటుక్కున క్యాచ్ చేశాడు మా హీరో... ఎంత షార్పో... నేనింకా మురిపెంలోనే ఉన్నా. చింటూ నా వీపు మీదెక్కి... చేతులు మెడలో వేసి ఊగుతూ ‘‘హాలిడేస్ ఎక్కడికెళ్దాం’’ అని గదిమాడు. ఈ సారి నాన్నా అనే సంబోధన మిస్సింగ్.‘ఊటీకెళ్దామా’’ అని ఊరించాను... నా డ్రామా అంతా చింటూ దగ్గర వేస్తున్నాను కానీ అసలు స్కెచ్ కిచెన్‌లో ఉన్న గాయత్రి కోసమే.‘‘చింటూ! పాలు తాగనే లేదా? మీరు వాడి చేత బ్రష్ చేయించకుండా ఆటలాడుతున్నారా?’’ ఫ్రిజ్‌లో కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన గాయత్రి కరిచినట్లు అరిచింది. ఏకకాలంలో ఇద్దరికీ డోస్.‘ఊటీ’ ఊరింపు తను విన్నదా లేదా? రిపీట్ చేయాలా వద్దా? ‘‘బ్రష్ చేద్దువురా’’ చింటూ ఎత్తుకుని సింక్ దగ్గర స్టూల్ మీద నిలబెట్టాను. వాడు బ్రష్ మీద పేస్టును పిండబోతుంటే లాక్కుని కొద్దిగా వేసిచ్చి ట్యూబ్‌ను వాడికందకుండా పైన పెట్టాను.‘‘ఊటీకి ట్రైన్లో వెళ్దామా, ఫ్లయిట్లో వెళ్దామా నాన్నా’’ ఊటీలో విహరిస్తున్నాడు చింటూ. ‘‘ఊటీకి ఫ్లయిటెళ్లదు. రైల్లో పోదాం’’ హమ్మయ్య జాగ్రత్తగానే మాట్లాడాను. ఫ్లయిట్లో చాలా డబ్బులవుతాయని నాలుక దాకా వచ్చిన మాటను లౌక్యంగా మార్చేశాను. నా భుజాన్ని నేనే తట్టుకున్నాను గాయత్రి కంటపడకుండా.‘‘ఫ్లయిట్ వెళ్లే ఊర్లకేమైనా ఫ్లయిట్లో తీసుకెళ్లారా? ట్రైన్లో స్లీపర్ తప్ప. అయినా ఎప్పుడెళ్తాం? మనకు టూర్ ఊటీ అయితే... మండపేటలో ఉన్న మీ కజిన్‌కి, పిల్లలకు మనూరే టూరిస్ట్ ప్లేస్ కదా’’ పెనం మీద దోశె పోస్తూ అంది గాయత్రి. మధ్యలో వినిపించిన చిటపటలు దోశెపెనానివా? గాయత్రివా? అంతా ఫాలో అవుతూనే ఉందన్నమాట. తెలివిగా టాపిక్ మార్చాలి. ∙ ∙ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాను. పిన్ని కూతురు పద్మ, బావ, వాళ్ల పిల్లలు నిన్ననే వచ్చారు. బహుశా వాళ్లు బయటికెళ్లారేమో! ఇంట్లో సందడి తక్కువగా ఉంది, రిఫ్రెష్ అయ్యి టీవీ ముందు కూర్చున్నాను. యానిమల్ ప్లానెట్ నుంచి బయటకు వచ్చి మనుషుల ముఖాలు చూద్దామని రిమోట్ అందుకున్నాను. ఎంతకీ చానల్ మారట్లేదు. బ్యాటరీ వీక్ అయిందేమోనని రిమోట్‌ని టీవీ ముఖం మీద పెట్టి నొక్కాను. సెట్‌టాప్ బాక్స్ ఎదురుగా వెళ్లి నొక్కాను. ఉహూ... చానల్ మారట్లేదు. పద్మ పిల్లలే ఏదో చేసి ఉంటారు. చానల్ మార్చడానికి కుదరని టెక్నాలజీ మా టీవీలో ఉన్నట్లు నాకే తెలీదు. ఈ పిడుగులకెలా తెలిసిందో. రిమోట్‌తో లాభం లేదనుకుని టీవీ దగ్గరకెళ్లాను. ఆల్రెడీ చైల్డ్లాక్లో ఉంది. ఏ బటన్ నొక్కినా టీవీ స్పందించడం లేదు. ఇక నాకు రిమోటే గతి. ఫ్లాష్‌లాంటి ఐడియా... ఎన్నిసార్లు టార్చ్‌లైట్‌లో బ్యాటరీలను నేలకేసి రుద్ది వెలిగించలేదు. టీవీని పలికించలేనా... నా తెలివికి నాకే ముచ్చటేసింది. నా టాలెంట్ గుర్తించి ఎవరూ దేశానికి ఆర్థిక మంత్రిని చేయడం లేదు. కానీ లేకపోతేనా... అమెరికాకి అప్పిచ్చే స్థాయికి తీసుకురానూ... నాలో ఉన్న నా మనిషి నన్ను మెచ్చుకుంటూ ఉంటే... నేను పెదవుల మీద చిరునవ్వును ధైర్యంగా ప్రకటిస్తూ రిమోట్ ఓపెన్ చేశాను. మైగాడ్... బ్యాటరీలే లేవు.నా రాక గమనించి శ్రీమతి టీ తెచ్చి టీపాయ్ మీద ఠంగున పెట్టింది. ‘‘బ్యాటరీల్లేవేంటి గాయత్రీ...’’ నా మాట పెదవి దాటే లోపు గాయత్రి వచ్చినంత వేగంగా కిచెన్‌లోకి వెళ్లిపోయింది. బంధువులు వచ్చి పని ఎక్కువైందేమో కోపంగా ఉన్నట్లుంది. మంచివాడిని కాబట్టి ఆ ‘ఠంగు’కు నేనే ఓ భాష్యం చెప్పుకున్నా. చింటూ పరుగెత్తుకొచ్చాడు. ఏదైనా మ్యాటర్ రాబట్టాలంటే వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకోవాలి. వాడు చెప్పే కబుర్లు వినాలి. మాటల్లో మాటగా అడగాలి, తప్ప నేరుగా అడిగితే సూటిగా చెప్పడు.‘‘బిట్టూ, బన్నీలతో బాగా ఆడుకున్నావా?’’‘‘స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుకున్నాం. ఈవెనింగ్ అత్త, మామయ్య, బిట్టూ, బన్నీ శిల్పారామానికెళ్లారు నాన్నా. నేను ఆల్రెడీ చూసేశాగా. రేపు వాళ్లతో లుంబినీ పార్క్కెళ్తా’’ అన్నాడు సెల్‌ఫోన్ కోసం నా జేబులో చెయ్యి పెడుతూ. ‘‘రిమోట్లో బ్యాటరీలు ఏమయ్యాయి నాన్నా’’ అన్నాను ముద్దుముద్దుగా.‘‘మరి... ఏసీ రిమోట్లో బ్యాటరీలు పోయాయి. అందుకే అమ్మ టీవీ రిమోట్ బ్యాటరీలు వేసింది’’ అప్పటికే ఫోన్ లాక్కుని యాంగ్రీబర్డ్ గేమ్ స్టార్ట్ చేశాడు చింటూ.గాయత్రి టీ కప్పు టీ పాయ్ మీద పెట్టేటప్పుడు అంతగా ‘ఠంగు’మనడం ఎందుకో ఇప్పుడర్థమైంది. ∙ ∙ ‘‘బావా! మీరున్న వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. మళ్లీ ఎప్పుడొస్తారు హైదరాబాద్‌కి’’ ముందుగదిలో ఉన్న వాళ్ల సామాను కారిడార్‌లో పెడుతూ అప్యాయంగా అన్నాను.‘‘ఇక ఇప్పట్లో హైదరాబాద్ రావాల్సిన పనేమీ లేదులే అన్నయ్యా... అన్నీ చూసేశాంగా’’ అన్నది పద్మ మా ఆవిడ బొట్టు పెట్టి ఇచ్చిన చీరను బ్యాగ్‌లో పెట్టుకుంటూ.‘‘వదినా! చింటూకి సెలవులిచ్చినప్పుడు మా ఊరికి రండి. అన్నయ్యకు ఆఫీసు సెలవు కుదరకపోతే నువ్వు రైలెక్కి ఫోన్ చెయ్యి మేము రిసీవ్ చేసుకుంటాం’’ భారీ ఆఫర్ ఇచ్చేసింది. కానీ... ఎక్కడో ఏదో కొడుతోంది. పద్మ కొన్ని పదాలు ఒత్తి పలుకుతోంది. మాటల్లో శ్లేష ఉందా?బావ వైపు వెర్రి నవ్వుతో చూసి వెంటనే గాయత్రిని చూశాను. వాళ్ల అమ్మానాన్న తనకు గాయత్రి అనే పవర్ఫుల్ పేరు ఎందుకు పెట్టారో గానీ ఆ చూపులకు శక్తి ఉంటే నేను మాడిపోయేవాడిని. చింటూ నిద్రలేవగానే వచ్చి ఒళ్లో కూర్చున్నాడు. నా చేతిలో ఉన్న పేపర్లో ట్రావెల్ యాడ్ దగ్గర వాడి కళ్లు ఆగిపోయాయి. ‘‘నాన్నా ఊటీకెళ్దామన్నావ్గా... ఎప్పుడెళ్దాం?’’‘‘చింటూ! బ్రష్ చేసిరా’’ గాయత్రి గొంతులో తల్లి ప్రేమ వినిపించలేదు.ఆ సంగతి చింటూకీ అర్థమైంది. కామ్‌గా వెళ్లి బ్రష్ అందుకున్నాడు. వాడి బ్రష్ మీద పేస్టు వేస్తూ ‘నెక్ట్స్ మంత్ వెళ్దాంలే’’ అన్నాను.‘‘పోనీ... పెద్దనాన్న వాళ్లను రమ్మను నాన్నా. అక్క, అన్నయ్యతో ఆడుకోవచ్చు’’ అన్నాడు. పాపం ఒక్కడికీ బోర్ కొడుతున్నట్లుంది.గాయత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు.చింటూ చేతిలో బ్రష్ తీసుకుని తానే వాడి పళ్లు తోముతూ ‘‘కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇంటికి వచ్చిన చెల్లెలు, బావ, పిల్లలు ఏసీ వేసుకుంటే కరెంటు బిల్లు పెరుగుతుందని లెక్కలేసే వాళ్లకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎందుకు? ఈ దరిద్రపు తెలివితేటలు ప్రొఫెషన్లో చూపిస్తే ఎన్ని ప్రమోషన్లు వచ్చేవో’’ అంటూ ‘‘చింటూ! సరిగ్గా పుక్కిలించు’’ అని విసవిసా వాడి నోట్లో నీళ్లు పోసింది. గాయత్రి బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడో తేడా. ఏసీ రిమోట్లో బ్యాటరీలు దాచేశానని కన్ఫర్మ్ చేసుకున్నట్లుంది. ఇంట్లో ఈ ఉక్కపోత తగ్గేదెప్పటికో?!. పండ్ల బుట్ట ఇక్కడే ఉంచు! లక్ష్మీపతి ( )కి వెంకట్రావు (సుత్తి వీరభద్రరావు) బావమరిది. లక్ష్మీపతి పరమ పిసినారి. అక్క, బావలను చూద్దామని వస్తూ పండ్లు తెస్తాడు వెంకట్రావు. లక్ష్మీపతి ‘ఈ పండ్లన్నీ మాకే... నీ చాదస్తం... మీ ఇల్లూ మా ఇల్లూ ఒక్కటి కాదేమిటి... అంటూ బుట్ట లాగేసుకుంటాడు లక్ష్మీపతి. లక్ష్మీపతి భార్య కాఫీ తీసుకొస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే.. ‘ఎండలు మండిపోతుంటే కాఫీ అంటావేంటే? చల్లటి మంచి నీళ్లు తీసుకురా’ అంటాడు.అందరూ మాటల్లో ఉండగా... ‘అరగంట్లో వడ్డించేస్తాను’ అంటుంది లక్ష్మీపతి భార్య తమ్ముడితో. ‘ఇదిగో! తీరిగ్గా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవ్. ఐదు నిమిషాలకు ఆఖరి బస్సుంది’ అని, ఏదో చెప్పబోతున్న భార్య నోరు మూసేస్తాడు లక్ష్మీపతి. ‘‘ఇందిగో వెంకట్రావ్. తర్వాత స్టాపులో చంద్రభవన్ అని హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి స్పెషల్ భోజనం చేసి, ఏడో ఎనిమిదో ఇచ్చేయ్. టైమవుతోంది బయలుదేరు’’ అంటూ సూట్‌కేసు తీసి వెంకట్రావుకిస్తాడు లక్ష్మీపతి ‘అహనా పెళ్లంట’ చిత్రంలో. పండ్ల బుట్ట ఇక్కడే ఉంచు! లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు)కి వెంకట్రావు (సుత్తి వీరభద్రరావు) బావమరిది. లక్ష్మీపతి పరమ పిసినారి. అక్క, బావలను చూద్దామని వస్తూ పండ్లు తెస్తాడు వెంకట్రావు. లక్ష్మీపతి ‘ఈ పండ్లన్నీ మాకే... నీ చాదస్తం... మీ ఇల్లూ మా ఇల్లూ ఒక్కటి కాదేమిటి... అంటూ బుట్ట లాగేసుకుంటాడు లక్ష్మీపతి. లక్ష్మీపతి భార్య కాఫీ తీసుకొస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే.. ‘ఎండలు మండిపోతుంటే కాఫీ అంటావేంటే? చల్లటి మంచి నీళ్లు తీసుకురా’ అంటాడు.అందరూ మాటల్లో ఉండగా... ‘అరగంట్లో వడ్డించేస్తాను’ అంటుంది లక్ష్మీపతి భార్య తమ్ముడితో. ‘ఇదిగో! తీరిగ్గా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవ్. ఐదు నిమిషాలకు ఆఖరి బస్సుంది’ అని, ఏదో చెప్పబోతున్న భార్య నోరు మూసేస్తాడు లక్ష్మీపతి. ‘‘ఇందిగో వెంకట్రావ్. తర్వాత స్టాపులో చంద్రభవన్ అని హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి స్పెషల్ భోజనం చేసి, ఏడో ఎనిమిదో ఇచ్చేయ్. టైమవుతోంది బయలుదేరు’’ అంటూ సూట్‌కేసు తీసి వెంకట్రావుకిస్తాడు లక్ష్మీపతి ‘అహనా పెళ్లంట’ చిత్రంలో. – మంజీర