airbus a380
-
వంటనూనెతో నింగిలోకి..
వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం జెట్‌ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. అది ఎప్పుడు ఎక్కడ టేకాఫ్ అయింది... ఇదెలా సాధ్యమనే ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం ఇటీవల ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. ఈ విమానం 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొవ్వులు, ఇతర వ్యర్థాలతో.. హరిత, మునిసిపల్ వ్యర్థాలు,కొవ్వులతో తయార య్యే ఈ ఎస్ఏఎఫ్ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. ఏవియేషన్ పరిశ్రమ 2050 నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరో లక్ష్యంగా పెట్టుకోగా,యూకే ప్రభుత్వం 2030 నాటికి 10 శా తం ఎస్ఏఎఫ్ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్‌లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్‌ఏఎఫ్‌తో చక్కర్లు కొట్టాయి. ధర ఐదు రెట్లు ఎక్కువ... సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది. ఎస్ఏఎఫ్ వినియోగం పెరిగిందంటే జీరో కర్భన ఉద్గారాల లక్ష్యానికి చేరువవుతున్నట్లే అని ఎయిర్‌బస్ సంస్థ పేర్కొంది. తమ విమానాలన్నింటిని 50శాతం ఎస్ఏఎఫ్–కిరోసిన్ మిశ్రమంతో నడిపేందుకు అనుమతి ఉందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 200 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం అవసరం అవుతుండగా, గత ఏడాది 10–12 కోట్ల లీటర్ల ఎస్ఏఎఫ్ మాత్రమే ఉత్పత్తి అయిందని అంతర్జాతీయ వైమానిక సంస్థ ఐఏటీఏ అంచనావేసింది. ఇది మొత్తం డిమాండ్‌లో 0.05 శాతం మాత్రమేనని చెప్పింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి జీవఇంధనాలతో కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఎస్ఏఎఫ్ వాడకాన్ని పెంచాలని వైమానిక సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఎలా మారుస్తారు? మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్ చేసి జీవఇంధనంగా మారుస్తారు. జీఎఫ్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకారం వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి. విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70ఫారన్‌హీట్ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్ ఈస్టర్, గ్లిసరిన్ తయారవుతాయి. బయోడీజిల్ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్ ఈస్టర్. గ్లిసరిన్ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి వాడతారు. -
ఇండియాలో రీఎంట్రీ ఇస్తున్న సూపర్ జంబో విమానం
ముంబై: ఎయిర్‌బస్ తయారీ ఏ380 సూపర్‌జంబో ఎయిర్‌క్రాఫ్ట్ మళ్లీ భారత్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబై–సింగపూర్ మధ్య జనవరి 10 నుంచి.. ఢిల్లీ–సింగపూర్ మధ్య ఫిబ్రవరి 14 నుంచి ఈ భారీ విమానాన్ని నడపనున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మహమ్మారి కారణంగా 20 నెలల క్రితం ఈ సర్వీసును నిలిపివేశారు. నాలుగు తరగతుల్లో మొత్తం 471 మంది ప్రయాణికులు ఏ380 విమానంలో కూర్చునే వీలుంది. మెయిన్ డెక్‌లో 343 ఎకానమీ, 44 ప్రీమియం ఎకానమీ క్లాస్ సీట్స్ ఉంటాయి. అప్పర్ డెక్‌లో 6 సీట్స్, 78 బిజినెస్ క్లాస్ సీట్స్ ఉన్నాయి. ఏ380 సూపర్‌జంబో విమానాలను ప్రపంచంలో తొలుత సింగపూర్ ఎయిర్‌లైన్స్ 2007లో ప్రవేశపెట్టింది. చదవండి:ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం -
అత్యవసరంగా విమానం దింపివేత
కొలంబో: సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ తగిన అనుమతులు తీసుకొని వెంటనే శ్రీలంకలోని కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశాడు. ఈ విమానంలో మొత్తం 500 మంది ప్రయాణీకులు ఉన్నారు. 'సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానం-ఏ 380- ఈకే 413ని సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా కొలంబోలో దించివేశాం' అని ఎయిర్ పోర్ట్ అధికార ప్రతినిధులు తెలియజేశారు. పైలెట్ సమయానికి స్పందించి సురక్షితంగా దించేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎలాంటి సాంకేతిక లోపం అనే విషయంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని ముందస్తుగా అన్ని రక్షణ చర్యలకు ఏర్పాట్లు కూడా చేశారు. -
విమానం @ 2030
800 మంది ప్రయాణించే సౌలభ్యం, మూడంతస్తుల్లో సకల సదుపాయాలతో గదులు, పడకలు, సిబ్బంది కార్యాలయాలు. ఇవన్నీ 2030లో రాబోయే సరికొత్త విమానం హంగులు. బార్సిలోనాకు చెందిన ఆస్కార్ వినాల్స్ అనే డిజైనర్ ఈగల్ కాన్సెప్ట్ అనే డిజైన్ రూపొందించారు. విమానం మొత్తానికి సరిపోయే విద్యుత్‌ను రెక్కలకున్న సౌరఫలకాలతో ఉత్పత్తి చేసుకుంటుందట. 96 మీటర్ల రెక్కలుండటంతో ల్యాండింగ్ సులువుగా చేయొచ్చట. 525 మందిని తీసుకెళ్లగల సామర్థ్యంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380తో పోలిస్తే కొత్త విమానం నమూనా (ఇన్సెట్)లో. -
భారత్‌కు ఏ380 విమానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380 మరికొద్ది రోజుల్లో భారతీయ ప్రయాణికులకు చేరువ కానుంది. దుబాయికి చెందిన విమానయాన సేవల సంస్థ ఎమిరేట్స్ త్వరలో భారత్‌కు ఏ380 సర్వీసులను నడపనుంది. తొలుత వాణిజ్య రాజధాని అయిన ముంబై నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుకు విస్తరించనున్నారు. లగ్జరీ రూపు రేఖలనే మారుస్తూ రూపొందిన ఈ అతి ఖరీదైన విమానంలో ప్రయాణించేందుకు ఎంతో కాలంగా భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదే ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఎమిరేట్స్ సైతం భారత భూభాగం నుంచి ఏ380 సర్వీసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. విదేశీ విమానయాన సంస్థలు భారత్‌కు ఏ380 విమానాలు నడిపేందుకు 2014 జనవరిలో భారత సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. సర్వీసులు ఎప్పుడు ప్రారంభమయ్యేది ఏప్రిల్‌లో తేలనుంది. నడిపేందుకు సిద్ధం... ఏ380 విమానాలు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ షోలో పాల్గొన్న ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడుతూ ‘ఏ380 ఎప్పుడొస్తుందా అని ఇక్కడి వారు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నిరంతరం సర్వీసులు నడపగలిగే స్థాయిలో అవకాశాలున్నాయి. భారతీయులు దుబాయి మీదుగా ఇతర దేశాలకు వెళ్తున్నారు. వారి కోసం మేం నేరుగా సర్వీసులు ఇస్తాం’ అని వెల్లడించారు. సీట్ల కేటాయింపుల విషయంలో మరికొంత స్పష్టత రావాలన్నారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏ380 ఇక్కడ దిగుతుందని స్పష్టం చేశారు. అదనపు సీట్లు కావాలి..: దుబాయి-భారత కార్యకలాపాలకుగాను వారానికి 30 వేల అదనపు సీట్లు కావాలని ఎమిరేట్స్ కోరుతోంది. వాస్తవానికి ఇటీవల యూఏఈతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం ఎమిరేట్స్‌తోపాటు మరో విమానయాన సంస్థ ఫ్లైదుబాయికి కలిపి 11 వేల అదనపు సీట్లు మాత్రమే కేటాయించింది. దీంతో యూఏఈకి కేటాయించిన సీట్ల సంఖ్య 54,200 కు చేరింది. తాజాగా ప్రకటించిన 11 వేల కొత్త సీట్లను 3 దశల్లో జత చేస్తారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే తొలి దశలో 5,500 సీట్లు జతకానున్నాయి. ఇందులో తమకు కేటాయించే సీట్ల ఆధారంగా భారత్‌కు ఏ380 నడపాలా లేదా బోయింగ్ 777 విమానాలు నడపాలా అన్నది నిర్ణయిస్తామని ఎమిరేట్స్ చెబుతోంది. ఎమిరేట్స్ చేతిలో 45 ఏ380 విమానాలు.. ఏ380 విమానాన్ని ఎయిర్‌బస్ తయారు చేస్తోంది. ఇప్పటి వరకు 324 విమానాలకు ఆర్డర్లున్నాయి. ఇందులో 125 విమానాలను 10 విమానయాన సంస్థలకు సరఫరా చేశారు. మరో 25 విమానాలను డిసెంబరుకల్లా అందిస్తామని కంపెనీ చెబుతోంది. అత్యధికంగా దుబాయి సంస్థ ఎమిరేట్స్ 140 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ప్రస్తుతం ఎమిరేట్స్ వద్ద 45 ఏ380 విమానాలు ఉన్నాయి. ఒక్కో విమానం ఖరీదు దాదాపు రూ.2,500 కోట్లు. ఏ380 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయికి ఎకానమీ క్లాస్‌లో టికెట్ ధర రూ.21 వేలు ఉండొచ్చు. ఫస్ట్ క్లాస్(సూట్) అయితే రూ.75 వేలపైమాటేనని ఎమిరేట్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు.