భారత్‌కు ఏ380 విమానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380 మరికొద్ది రోజుల్లో భారతీయ ప్రయాణికులకు చేరువ కానుంది. దుబాయికి చెందిన విమానయాన సేవల సంస్థ ఎమిరేట్స్ త్వరలో భారత్‌కు ఏ380 సర్వీసులను నడపనుంది. తొలుత వాణిజ్య రాజధాని అయిన ముంబై నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుకు విస్తరించనున్నారు.
లగ్జరీ రూపు రేఖలనే మారుస్తూ రూపొందిన ఈ అతి ఖరీదైన విమానంలో ప్రయాణించేందుకు ఎంతో కాలంగా భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదే ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఎమిరేట్స్ సైతం భారత భూభాగం నుంచి ఏ380 సర్వీసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. విదేశీ విమానయాన సంస్థలు భారత్‌కు ఏ380 విమానాలు నడిపేందుకు 2014 జనవరిలో భారత సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. సర్వీసులు ఎప్పుడు ప్రారంభమయ్యేది ఏప్రిల్‌లో తేలనుంది.
నడిపేందుకు సిద్ధం...
ఏ380 విమానాలు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ షోలో పాల్గొన్న ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడుతూ ‘ఏ380 ఎప్పుడొస్తుందా అని ఇక్కడి వారు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నిరంతరం సర్వీసులు నడపగలిగే స్థాయిలో అవకాశాలున్నాయి. భారతీయులు దుబాయి మీదుగా ఇతర దేశాలకు వెళ్తున్నారు. వారి కోసం మేం నేరుగా సర్వీసులు ఇస్తాం’ అని వెల్లడించారు. సీట్ల కేటాయింపుల విషయంలో మరికొంత స్పష్టత రావాలన్నారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏ380 ఇక్కడ దిగుతుందని స్పష్టం చేశారు.
అదనపు సీట్లు కావాలి..: దుబాయి-భారత కార్యకలాపాలకుగాను వారానికి 30 వేల అదనపు సీట్లు కావాలని ఎమిరేట్స్ కోరుతోంది. వాస్తవానికి ఇటీవల యూఏఈతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం ఎమిరేట్స్‌తోపాటు మరో విమానయాన సంస్థ ఫ్లైదుబాయికి కలిపి 11 వేల అదనపు సీట్లు మాత్రమే కేటాయించింది. దీంతో యూఏఈకి కేటాయించిన సీట్ల సంఖ్య 54,200 కు చేరింది. తాజాగా ప్రకటించిన 11 వేల కొత్త సీట్లను 3 దశల్లో జత చేస్తారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే తొలి దశలో 5,500 సీట్లు జతకానున్నాయి. ఇందులో తమకు కేటాయించే సీట్ల ఆధారంగా భారత్‌కు ఏ380 నడపాలా లేదా బోయింగ్ 777 విమానాలు నడపాలా అన్నది నిర్ణయిస్తామని ఎమిరేట్స్ చెబుతోంది.
ఎమిరేట్స్ చేతిలో 45 ఏ380 విమానాలు..
ఏ380 విమానాన్ని ఎయిర్‌బస్ తయారు చేస్తోంది. ఇప్పటి వరకు 324 విమానాలకు ఆర్డర్లున్నాయి. ఇందులో 125 విమానాలను 10 విమానయాన సంస్థలకు సరఫరా చేశారు. మరో 25 విమానాలను డిసెంబరుకల్లా అందిస్తామని కంపెనీ చెబుతోంది. అత్యధికంగా దుబాయి సంస్థ ఎమిరేట్స్ 140 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ప్రస్తుతం ఎమిరేట్స్ వద్ద 45 ఏ380 విమానాలు ఉన్నాయి. ఒక్కో విమానం ఖరీదు దాదాపు రూ.2,500 కోట్లు. ఏ380 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయికి ఎకానమీ క్లాస్‌లో టికెట్ ధర రూ.21 వేలు ఉండొచ్చు. ఫస్ట్ క్లాస్(సూట్) అయితే రూ.75 వేలపైమాటేనని ఎమిరేట్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు.