అత్యవసరంగా విమానం దింపివేత
కొలంబో: సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ తగిన అనుమతులు తీసుకొని వెంటనే శ్రీలంకలోని కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశాడు. ఈ విమానంలో మొత్తం 500 మంది ప్రయాణీకులు ఉన్నారు.
'సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానం-ఏ 380- ఈకే 413ని సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా కొలంబోలో దించివేశాం' అని ఎయిర్ పోర్ట్ అధికార ప్రతినిధులు తెలియజేశారు. పైలెట్ సమయానికి స్పందించి సురక్షితంగా దించేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎలాంటి సాంకేతిక లోపం అనే విషయంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని ముందస్తుగా అన్ని రక్షణ చర్యలకు ఏర్పాట్లు కూడా చేశారు.