చౌక టికెట్లతో ఎయిర్‌లైన్స్‌కు నష్టం ఉండదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన టిక్కెట్ల ఆఫర్ల వల్ల కంపెనీలకు లాభమే కాని నష్టం లేందంటోంది ఎయిర్కోస్టా. విమానయాన రంగంలోకి అడుగు పెట్టి అక్టోబర్ 15 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్కోస్టా ైచైర్మన్ రమేష్ లింగమనేనితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...
ఈ రంగంలోకి అడుగు పెట్టి నెలరోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటున్న సమయంలో వ్యాపార అనుభవాలను వివరిస్తారా?
చక్కటి ప్రణాళికతో వస్తే విజయం ఎలా సాధించవచ్చో అన్నది మా ఏడాది ప్రయాణం ఒక చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం ఉన్న విమానయాన సంస్థలకు భిన్నంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై ప్రధానంగా దృష్టిసారించాం. ఈ ప్రయోగం ఫలించడమే కాకుండా ఏప్రిల్, మే నెలల్లో దేశంలోనే అత్యధిక లోడ్ ఫ్యాక్టర్ (ప్రయాణికుల సామర్థ్యం) 78.7 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నాటికి బ్రేక్ ఈవెన్ సాధించే స్థాయికి వస్తున్నాం అంటే ఎంత ఆర్థిక క్రమశిక్షణతో నడుస్తున్నామో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రోజుకు ఎన్ని సర్వీసులను నడుపుతున్నారు? రానున్న కాలంలో మీ విస్తరణ ప్రణాళికలేంటి?
ఒకేసారి దేశవ్యాప్తంగా సర్వీసులు ప్రారంభించాలనే సూత్రానికి పూర్తి వ్యతిరేకం. నెమ్మది నెమ్మదిగా ఒక్కో పట్టణానికి విస్తరిస్తున్నాం. ప్రస్తుతం తొమ్మిది పట్టణాలకు రోజుకు 34 విమాన సర్వీసులను అందిస్తున్నాం. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి సర్వీసును ప్రారంభిస్తున్నాం.
రానున్న కాలంలో భువనేశ్వర్, ఇండోర్, పుణే, పాట్నా, రాయిపూర్, జోథ్ పుర్లకు సర్వీసులను నడపనున్నాం. వచ్చే ఆర్థిక ఏడాదిలో మరో 3-4 ద్వితీయ శ్రేణి పట్టణాలకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండగా, మార్చిలోగా మరో మూడు వస్తాయి. ఇవి కాకుండా 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరు ఇచ్చాం. ఏటా 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లు చొప్పున 2018 నుంచి డెలివరీ ప్రారంభవుతుంది.
దేశీయ విమానయాన రంగంలో ముఖ్యంగా చౌక విమానయాన సర్వీసుల్లో పోటీ అధికంగా ఉంది. దీన్ని ఎదుర్కొనడానికి మీరనుసరిస్తున్న వ్యాపార వ్యూహం ఏమిటి?
మేము ఏ విమానయాన సంస్థకి పోటీ కాదు. మా వ్యాపారం పూర్తిగా భిన్నమైనది. దీంతో ఎన్ని కొత్త సంస్థలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. మేము మెట్రో నుంచి మెట్రోకి సర్వీసులు అందించడం లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో పాటు మెట్రో నగరాలను కలుపుతున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్న తిరుపతి సర్వీసునే తీసుకోండి. కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్ పట్టణాలకు తిరుపతితో అనుసంధానం చేశాం. దీనిద్వారా కోయంబత్తూర్, బెంగళూరు ప్రయాణికులు చౌకగా తిరుపతి చేరుకోవచ్చు.
ప్రారంభ ఆఫర్ కింద హైదరాబాద్, తిరుపతి ప్రయాణాన్ని రూ. 2,999కే అందిస్తున్నాం. ఇలా నేరుగా కాకపోయినా వివిధ పట్టణాల మీదుగా ఎయిర్ కనెక్టివిటీ కల్పిస్తున్నాం. అలాగే ఎంబ్రార్ జెట్ ఫ్లయిట్‌తో మిడిల్ సీట్ లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాం. ఒకసారి మా విమానంలో ప్రయాణించిన వారు మళ్లీ మా ఫ్లయిటే ఎక్కుతారని చెప్పగలం.
దాదాపు అన్ని విమానయాన సంస్థలు నష్టాల్లో నడుస్తున్నా... పోటీపడి చౌక టికెట్లను ప్రకటించడాన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఈ చౌక టికెట్ ఆఫర్ల వల్ల ఎయిర్‌లైన్స్‌కు ఎలాంటి నష్టం ఉండదు. పరిమిత సీట్లకు మాత్రమే తక్కువ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఏదైనా ఒక ఫ్లైట్‌లో 100 సీట్లు ఉంటే, సగటున ఆ విమానంలో 70 సీట్లు పూర్తవుతున్నాయనుకుందాం. మిగిలిన 30 సీట్లతో ఖాళీగా వెళ్లే కంటే చౌక టికెట్లను ప్రకటిస్తున్నాయి. కొత్త ప్రయాణికులను ఆకర్షించడం ద్వారా లాభమే కానీ నష్టం ఉండదు. అలాకాకుండా అన్ని సీట్లకు చౌక టికెట్లను ప్రకటిస్తే మాత్రం ఆ సంస్థ మూసుకోవాల్సిందే. ఇప్పుడు విమానయాన సంస్థలన్నీ లోడ్ ఫ్యాక్టర్ ఆధారంగానే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
నష్టాలు తట్టుకోలేక కొన్ని సంస్థలు మూతపడుతుంటే, మరిన్ని సంస్థలు ప్రవేశించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు?
ఇతర సంస్థల నష్టాల గురించి నేను మాట్లాడను కాని, దేశీయ విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏటా దేశీయ ప్రయాణికుల సంఖ్య 12.1 కోట్లు, విదేశీ ప్రయాణికుల సంఖ్య 4.1 కోట్లుగా ఉంది. ఇది 2020 నాటికి 33.6 కోట్లు, 8.5 కోట్లకు చేరుకోవడం ద్వారా అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి ఎగబాకనుంది.
ఇదే విధమైన వృద్థితో 2030 నాటికి అత్యధిక విమానయాన ప్రయాణికులు కలిగిన దేశంగా ఇండియా అవతరించనుంది. కేంద్రం కూడా దేశంలో కొత్తగా 20 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే రైళ్ల టికెట్లు లభించడం లేదు. దీనికితోడు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే అవకాశం ఉండటంతో ఈ రంగానికి డిమాండ్ బాగుంది. ఇవన్నీ ఈ రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించేటట్లు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఇంత డిమాండ్ ఉందంటారా?
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటీని పెంచడం ద్వారా వ్యాపార, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. రానున్న కాలంలో రైలు కంటే విమాన ప్రయాణానికే ఎక్కువ డిమాండ్ ఉంటుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పుడు కడపకు డిమాండ్ ఉన్నప్పటికీ అక్కడున్న స్ట్రిప్ మా జెట్ ఫ్లయిట్స్ దిగడానికి అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు విమానాశ్రయాలున్నాయి. మిగిలిన 10 స్ట్రిప్‌లను ఒకేసారిగా కాకుం డా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా దశలవారీగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అలాగే రాష్ట్రంలో విమానయానాన్ని ప్రోత్సహించడానికి ఫ్యూయల్‌పై పన్నులను ఒక శాతానికి తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ్ర పభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కలిసొస్తుంది.
విజయవాడను రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన తరుణంలో అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఎయిర్కోస్టా దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోనుంది?
రాజధాని అవుతుందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా గత మూడేళ్లుగా విజయవాడ కేంద్రంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని కిందటేడాది కార్యకలాపాలు ప్రారంభించాం. ఎయిర్‌పోర్టు బాగుండి ఉంటే సర్వీసులు ఇంకా బాగా పెరిగేవి. ప్రస్తుతం రన్‌వే కేవలం 7,000 మీటర్లే ఉండటంతో అంతర్జాతీయ విమానాలు దిగలేకపోతున్నాయి. దీన్ని 10,000 మీటర్లకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని కావడంతో రానున్న కాలంలో సర్వీసుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న మేము రానున్న రోజుల్లో ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటాం.