సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భూమి, సముద్రం, గగనతల రక్షణలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత వాయుసేనలో మహిళల సంఖ్య పెరుగుతుండటం, ఫైటర్ జెట్ పైలట్లలోనూ మహిళలు ఉండటం సంతోషకరమన్నారు.
శనివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీ, 75మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ కేడెట్లు, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో ఎనిమిది మంది అధికారులు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా పాల్గొనడం వాయుసేన చరిత్రలో తొలిసారి కావడం విశేషం. కేడెట్ల నుంచి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని అవార్డులతో సత్కరించారు.
వైమానిక దళం ఎంతో సేవ చేసింది
భారత వాయుసేనలో ఉద్యోగ జీవితం సవాళ్లతో కూడుకోవడంతోపాటు ఎంతో గౌరవప్రదమైందని రాష్ట్రపతి చెప్పారు. దేశ సేవకోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, కేడెట్లను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అకాడమీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానంలో భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు.
‘1948, 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో దేశాన్ని రక్షించడంలో భారత వైమానిక దళానికి చెందిన వీరులు పోషించిన గొప్ప పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కార్గిల్ పోరాటంలో, బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడంలో అదే సంకల్పాన్ని, నైపుణ్యాన్ని చూపారు. అందుకే భారత వైమానిక దళానికి వృత్తి నైపుణ్యం, అంకితభావానికి మారుపేరన్న ఖ్యాతి ఉంది.
విపత్తుల సమయంలో మానవత్వంతో సాయం చేయడంలోనూ భారత వాయుసేనకు గొప్ప పేరుంది’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. భవిష్యత్ యుద్ధరంగంలో అత్యాధునిక సాంకేతికత ముఖ్య భూమిక పోషిస్తుందని. ఈ నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాలు, చినోక్ హెవీ లిఫ్ట్ చాపర్ల వంటి సాధన సంపత్తిని వాయుసేన సమకూర్చుకుంటోందని చెప్పారు.
ఆకట్టుకున్న ఎయిర్ షో
పరేడ్ అనంతరం నిర్వహించిన ఎయిర్‌షో ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ ఎస్‌యూ–30, సారంగ్ హెలికాప్టర్లు, సూర్యకిరణ్ ఎరోబాటిక్ బృందాల గగనతల ప్రదర్శనలు అలరించాయి. గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.