AISF leaders
-
తిరుపతి సభలో పవన్ కు నిరసన సెగ..
-
చేయి చేయి కలుపుదాం
కోసిగి (కర్నూలు): చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులను ఆదుకుందామని బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు రాముడు, నయకులు హొలగుంద కోసిగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోసిగిలో వరద బాధితుల సహాయార్థం వ్యాపార దుకాణాలు, ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేరళలో వరద ముంచుకొచ్చి ప్రజలు సర్వ కోల్పోయి నిరాశ్రులయ్యారు. విరాళాలు సేకరించిన వారిలో పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి లోకారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: కేరళలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరుపున విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు విశ్వనాథ్, నవీన్ నేతృత్వంలో మండల కేంద్రంలో పర్యటించి రూ.39వేలు సేకరించారు. ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో రఘు, జయలక్ష్మి, ఎల్లప్ప, అంజి, ప్రభుత్వ, రాఘవేంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కౌతాళం: మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి లింగన్న తెలిపారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వరదలతో నష్టపోయిన బాధితులకు విరాళాలు సేకరించామన్నారు. అలాగే కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ దూద్‌బాషా కుటుంబం కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రూ.12వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు దూద్ బాషా తెలిపారు. -
సంక్షోభంలో విద్యారంగం
సిద్దిపేటటౌన్ : రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని మరచిపోయారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శివరామకృష్ణ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముట్టడికి వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు హైస్కూల్ గ్రౌండ్ నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్న ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. విద్యార్థి సంఘ నాయకులు లోపలికి వెళ్లకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందించేందుకు అనుమతి ఉందని, తమను లోపలికి అనుమతించాలని లేదంటే ఇక్కడే నిరసన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు మొండికేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చుకుంటూ వ్యాన్లలోకి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ మాట్లాడుతూ వినతిపత్రం అందించడానికి వెళ్తున్నవారిని ముళ్ల కంచెలతో అడ్డుకోవడం సమంజసంగా లేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మన్నె కుమార్, సుధాకర్, రూపేష్, మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
చేతికి గోరింటాకు.. అయితే స్కూలుకు రాకు!
ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినులకు చేదు అనుభవం హైదరాబాద్: చేతులకు గోరింటాకు పెట్టుకొని వచ్చిన విద్యార్థినులకు స్కూల్లో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్లోకి రాకుండా యాజమాన్యం అడ్డుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పలువురు విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. సెలవులు ముగిసిన అనంతరం సోమవారం హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్‌కు వెళ్లారు. విద్యార్థినుల చేతులకున్న గోరింటాకును గమనించిన యాజమాన్యం వారిని స్కూల్లోకి రానివ్వకుండా బయటకు పంపించి వేసింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, నగర కార్యదర్శి శ్రీమాన్లతోపాటు పలువురు విద్యార్థి నాయకులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డిని నిలదీశారు. గోరింటాకు పెట్టుకోవడం స్కూల్ రూల్స్‌కు వ్యతిరేకమని, అందువల్లే బయటకు పంపించామని ప్రిన్సిపల్ సమాధానమిచ్చారు. గోరింటాకు పెట్టుకుంటే తప్పేంటని విద్యార్థి నాయకులు ప్రిన్సిపల్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో ఆ విద్యార్థినులను స్కూల్లోకి అనుమతించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈవోకు ఫిర్యాదు చేశామని, ఈ సమస్యను డీఈవో, బాలల హక్కుల కమిషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామని విద్యార్థి నేతలు చెప్పారు. -
సచివాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
హైదరాబాద్: మెస్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు, ఏఐఎస్ఎఫ్ నాయకులను సచివాలయం బయటే అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.