ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించిన విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు
సిద్దిపేటటౌన్ : రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని మరచిపోయారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శివరామకృష్ణ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముట్టడికి వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు హైస్కూల్ గ్రౌండ్ నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్న ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. విద్యార్థి సంఘ నాయకులు లోపలికి వెళ్లకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తమకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందించేందుకు అనుమతి ఉందని, తమను లోపలికి అనుమతించాలని లేదంటే ఇక్కడే నిరసన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు మొండికేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చుకుంటూ వ్యాన్లలోకి లాక్కెళ్లారు.
ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ మాట్లాడుతూ వినతిపత్రం అందించడానికి వెళ్తున్నవారిని ముళ్ల కంచెలతో అడ్డుకోవడం సమంజసంగా లేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మన్నె కుమార్, సుధాకర్, రూపేష్, మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment