సిద్దిపేట రూరల్: సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్‌ల నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం చేసిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన సుమారు 100 మంది బాధిత రైతులు తమ గోడును విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చారు. అయితే బాధితులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. వారితో మాట్లాడి గొడవ కాకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమను లోపలికి అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని చెప్పిన రైతులు, ఒక్కసారిగా కార్యాలయ భవనంపైకి ఎక్కి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.
దీంతో పోలీసులు వారిని భవనంపైనుంచి కిందకి తీసుకువచ్చారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ కొండపాక మండలం దుద్దెడ, రాంపల్లి గ్రామాలకు చెందిన 663, 143 సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 165 మంది రైతులకు 365 ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం భూమిని సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ నిర్మాణానికి సేకరించిందని, భూమికి నష్టపరిహారంగా రూ. 20 లక్షలు, కలెక్టరేట్ వద్ద 200 గజాల ఇంటి స్థలం అందిస్తామని అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు.
తమలో కొంతమందికి డబ్బులు ఇచ్చి.. ఇంటిస్థలం పట్టా సర్టిఫికెట్ మాత్రం ఇచ్చారని, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయడంలేదని చెప్పారు. ఈ విషయంపై ఎన్నోసార్లు కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసినా అధికారుల్లో మార్పు రాలేదని విచారం వ్యక్తంచేశారు. అనంతరం రైతులను ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వద్దకు అనుమతించగా బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వారంలోపు సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాధితులు బయటకు వచ్చాక భవనంపైకి ఎక్కిన ఘటనలో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment