ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థినులకు చేదు అనుభవం
హైదరాబాద్: చేతులకు గోరింటాకు పెట్టుకొని వచ్చిన విద్యార్థినులకు స్కూల్‌లో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌లోకి రాకుండా యాజమాన్యం అడ్డుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పలువురు విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. సెలవులు ముగిసిన అనంతరం సోమవారం హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్‌కు వెళ్లారు. విద్యార్థినుల చేతులకున్న గోరింటాకును గమనించిన యాజమాన్యం వారిని స్కూల్లోకి రానివ్వకుండా బయటకు పంపించి వేసింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏఐఎస్‌ఎఫ్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, నగర కార్యదర్శి శ్రీమాన్‌లతోపాటు పలువురు విద్యార్థి నాయకులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డిని నిలదీశారు. గోరింటాకు పెట్టుకోవడం స్కూల్ రూల్స్‌కు వ్యతిరేకమని, అందువల్లే బయటకు పంపించామని ప్రిన్సిపల్ సమాధానమిచ్చారు. గోరింటాకు పెట్టుకుంటే తప్పేంటని విద్యార్థి నాయకులు ప్రిన్సిపల్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో ఆ విద్యార్థినులను స్కూల్‌లోకి అనుమతించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈవోకు ఫిర్యాదు చేశామని, ఈ సమస్యను డీఈవో, బాలల హక్కుల కమిషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామని విద్యార్థి నేతలు చెప్పారు.
చేతికి గోరింటాకు.. అయితే స్కూలుకు రాకు!
Published Tue, Oct 27 2015 1:56 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
Advertisement
Advertisement