విద్యార్థి ఆచూకీ లభ్యం
♦ తీవ్ర గాయాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షం
♦ కిడ్నాప్ చేసి.. కాల్చారని వాంగ్మూలం
హుజూర్‌నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అదృశ్యమైన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆచూకీ లభించింది. శనివారం కాలిన గాయాలతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేళ్లచెరువు మండలం తమ్మారం కొత్తూరుకు చెందిన గాయం నాగార్జునరెడ్డి హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హాస్టల్‌లో ఉంటున్నాడు. నాగార్జునరెడ్డి రూ. 500 దొం గిలించాడని సహచర విద్యార్థులు ఆరోపిం చారు. తాను ఆ చోరీ చేయలేదని, తనపై నింద వేయడంతో పురుగుమందు తాగి చని పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తనను కిడ్నాప్ చేసి తగులబెట్టారని న్యాయమూర్తికి నాగార్జునరెడ్డి వాంగ్మూ లం ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. 18న పాఠశాల వద్ద ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారని, శనివారం ఉదయం చిల్లకల్లు పెట్రోల్‌బంక్ సమీపంలో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. అనంతరం వారే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విడిచి వెళ్లారన్నాడు. పోలీసుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివెళ్లారు.
పాఠశాల వద్ద ఉద్రిక్తత..
హుజూర్‌నగర్‌లో నాగార్జునరెడ్డి చదువుకుంటున్న ప్రైవేట్ పాఠశాల వద్ద బంధువులు, గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకొన్నారు. కాగా, నాగార్జునరెడ్డి అదృశ్యం మిస్టరీగానే మారింది.