ప్రాణాలు కోల్పోయిన మహికీర్తన , చందన (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకు కరాటే కసరత్తులో మునిగిన ఆ చిన్నారులకు అవే చివరి క్షణాలయ్యాయి. చిరునవ్వులొలికే పిల్లలను మృత్యువు స్టేజీ రూపంలో కబళించింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న వేదిక (స్టేజీ) బీములు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
బీములు కూలి..
కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో ఉన్న న్యూ సెంచరీ స్కూల్ ఆవరణలో గురువారం మధ్యాహ్నం నాలుగో తరగతి విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. స్కూలు ఆవరణలోని స్టేజీపై 25 మంది కసరత్తు చేస్తున్నారు. పాతబడిన ఆ స్టేజీ కూలి కింద ఉన్న చిన్నారులపై పడింది. శకలాల కింద రక్తపు మడుగుల్లో ఉన్న విద్యార్థులను సమీపంలోని అను పమ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహి కీర్తన (9), చందన (8) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నరేశ్ (11), సందీప్ (10), నిఖిత (9), దేవిశ్రీ (10)లకు గాయాలవగా.. నరేశ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం నరేశ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు
జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన వెంకటేశం, స్వర్ణలత దంపతులు తమ కూతురు మహి కీర్తనను ఇటీవలే న్యూ సెంచరీ స్కూల్‌లో చేర్పించారు. మరికొద్ది సేపట్లో చిరునవ్వుతో తిరిగి రావాల్సిన చిన్నారి ఆస్పత్రిలో విగతజీవిగా ఉందన్న విషయం తెలుసుకొని కుప్పకూలిపోయారు. ఆల్విన్ కాలనీకి చెందిన నాగబాబు, వెంకటేశ్వరమ్మల కుమార్తె చందనను మృత్యువు స్టేజీ రూపంలో కబళించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కూతురుకు ప్రమాదం జరిగిందని తెలుసుకుని ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రులు.. చందన మరణించిందని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.
సీజ్ చేయాలి: ఎమ్మెల్యే కృష్ణారావు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు.. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిల్లల మృతికి కారణమైన పాఠశాలను సీజ్ చేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల చిన్నారులు మృతి చెందడాన్ని నిరసిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు శుక్రవారం ప్రైవేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.
ప్రమాదానికి కారణం ఇదేనా?
పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల కోసం 18 ఏళ్ళ క్రితం వేదిక ఏర్పాటు చేశారు. నలువైపులా 4 బీములు మినహా స్లాబ్ వేయలేదు. బీములకు ఇనుప రాడ్లు వేసి కాంక్రీట్ మిక్చర్ వేయకుండా సిమెంట్ ప్లాస్టరింగ్ మాత్రమే చేశారు. కాలం చెల్లిన బీములు ఇటీవలి వర్షాలకు నాని సామర్థ్యం కోల్పోయాయి. కరాటే శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను బలిగొన్నాయి. బెంగళూరు పెంకులతో నిర్మించిన ఆ పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment