స్కూల్‌లో కొడుకు మృతి.. పేరెంట్స్ ఆత‍్మహత‍్య
గుంటూరు: కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఆత‍్మహత‍్య చేసుకున‍్నారు. ఈ విషాదకర ఘటన ఆదివారం గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరు పట్టణం పట్టాభిపురానికి చెందిన చంద్రశేఖర్, నవీన దంపతుల కుమారుడు వంశీ శ్రీ చైతన్య టెక్నోస్కూల్‌లో చదువుతున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట జ్వరం రావడంతో పాఠశాలలోనే మృతిచెందాడు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన‍్యం చాలా ఆలస్యంగా పేరెంట్స్‌కు తెలియజేసింది. వంశీ మృతికి కారణాలు తెలియకపోవడం, మరోవైపు కుమారుడు లేడన్న బాధతో మనస్తాపానికి లోనైన వారు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఆత‍్మహత‍్య చేసుకున్నారు.
ఒక‍్కగానొక‍్క కొడుకు చిన‍్న వయసులో మృతిచెందడంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వంశీ తల్లిదండ్రుల మరణవార్తను తెలుసుకున్న విద్యార్థి సంఘాలు న్యాయం కోసం ఆందోళన చేపట్టాయి. వంశీ మృతితో పాటు అతడి పేరెంట్స్ బలవన్మరణానికి ప్రైవేట్ పాఠశాల యాజమాన‍్యమే కారణమని, వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థి డిమాండ్ చేశాయి. అకారణంగా కొడుకు మరణించడంతో జీవితంపై విరక్తి చెందిన తల్లిదండ్రులు ఆత‍్మహత‍్య చేసుకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనకు వైఎస్ఆర్‌సీపీ నేతలు, సీపీఎం నేతలు మద్ధతు తెలిపారు.