నరాలు దెబ్బతిన్న విద్యార్థి లోకేష్‌సాయి
♦ మెడ నరాలు దెబ్బతిన్నాయంటున్న తల్లిదండ్రులు
♦ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే దాడి..
♦ ఉపాధ్యాయుడిపై బంధువుల ఎదురుదాడి
♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు
రాయదుర్గం: ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన విద్యార్థి తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యం దాడికి దిగగా.. బాధితులు ఉపాధ్యాయుడిపై ఎదురుదాడి చేశారు. బాధిత విద్యార్థి తండ్రి కథనం మేరకు.. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామానికి చెందిన గోవిందరాజులు తన కుమారుడు లోకేష్‌సాయిని రాయదుర్గం పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు స్కూల్లో ఈ ఏడాది ఎనిమిదో తరగతిలో చేర్పించాడు. పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు లోకేష్‌సాయిని ఎగతాళి చేస్తూ వేధింపులకు గురిచేసేవారు.
హెచ్‌ఎం లైట్‌గా తీసుకోవడం వల్లే..
హెచ్‌ఎం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినా.. ముగ్గురిలో ఒక విద్యార్థి పాఠశాల భవనం యజమాని కుమారుడు కావడంతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో భవనం యజమాని కుమారుడు మరింత రెచ్చిపోయాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, నేను తలుచుకుంటే టీచర్‌కు చెప్పి నిన్నే కొట్టిస్తా అంటూ బాధిత విద్యార్థిని బెదిరించాడు. నెలరోజుల కిందట ఉన్నవీ లేనివీ చెప్పడంతో సోషియల్ టీచర్ వెంకటస్వామి పూర్తిగా తెలుసుకోకుండా లోకేష్‌సాయిని చితకబాదాడు. అయితే దీని గురించి ఆ విద్యార్థి ఇంట్లో చెప్పలేదు. తనలో తానే కుమిలిపోతూ.. భయంతో పాఠశాలకు సక్రమంగా వెళ్లలేకపోయాడు.
జ్వరం వస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు రాయదుర్గంలో ప్రైవేటు వైద్యుల చేత చికిత్సలు చేయించారు. అయినా తగ్గకపోవడం, మెడ వంకర్లు పోతుండడంతో బళ్లారి, కర్నూలు వైద్యులతో చూపించారు. చికిత్సకోసం సుమారు రూ.80 వేల దాకా ఖర్చు అయింది. మెడ నరాలు దెబ్బతిన్నాయని, మూడునెలల పాటు మాత్రలు తప్పనిసరిగా వాడాలని, నెలకోమారు పరీక్షలకు రావాలని వైద్యులు చెప్పారు. వైద్యం చేయించుకువచ్చిన తరువాత కూడా స్కూల్‌కు వెళ్లమంటే విద్యార్థి భయపడే వాడు.
తండ్రి ఒట్టుతో బయటపడ్డ నిజం..
మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లి తండ్రి టీసీ తీసుకువచ్చాడు. ఎందుకు వెళ్లనంటున్నావో కారణం చెప్పు అని తండ్రి ఒట్టు వేయించుకోవడంతో ఆ విద్యార్థి జరిగిందంతా చెప్పాడు. శుక్రవారం రోజు ఈ ఘటనపై ఉపాధ్యాయులను అడిగేందుకు బంధువులతో కలిసి వచ్చాడు. విద్యార్థిదే తప్పు అంటూ యాజమాన్యం దాడికి యత్నించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి లోకేష్‌సాయి కుటుంబ సభ్యులు సోషిల్ టీచర్‌ను పటుకుని లాగారు. తమ కుమారుడిని కొట్టి, ఆస్పత్రిపాలు చేసి, ప్రశ్నించిన తమపై దాడికి యత్నించారని గోవిందరాజులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇదిలా ఉండగా తాను లోకేష్‌సాయిని మందలించాను తప్ప కొట్టలేదని సోషియల్ టీచర్ వెంకటస్వామి తెలిపాడు. విద్యార్థి తండ్రికి, హెచ్‌ఎంకు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ తనను అనవసరంగా కొట్టారని వాపోయాడు. లోకేష్‌సాయికి ఆరోగ్యం బాగలేదని టీసీ తీసుకెళ్లిన మూడు రోజుల తర్వాత గొడవకు వచ్చారని, దీనిపై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని హెచ్‌ఎం ప్రభాకర్ తెలిపారు. తమ పాఠశాల ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.