సెప్టెంబర్ 9న పాక్ దేశాధ్యక్షుడిగా మమ్నూన్ ప్రమాణం
పాకిస్థాన్ 12వ అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ సెప్టెంబర్ 9వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరిస్తారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈవాన్ - ఐ- సర్ద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మమ్నూన్ చేత పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మొహమ్మద్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలిపింది.
అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడిగా ఉన్న అసిఫ్ అలీ జర్దారీ పదవికాలం సెప్టెంబర్ 8వ తేదీతో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ దేశాధ్యక్ష పదవికి మమ్నూన్ హుస్సేన్ ఎన్నికైయ్యారు. దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, విదేశీ రాయబారులతోపాటు పలువురు ప్రముఖులు దేశాధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరువుతారని స్థానిక మీడియా ప్రచురించిన కథనంలో వెల్లడించింది.