Ajanta Ellora Caves
-
ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..
ఇటీవలకాలంలో సెల్ఫీ పిచ్చి మాములుగా లేదు. సెల్ఫీ మోజులోపడి వేగంగా వెళ్లే ట్రెయిన్ వద్ద, ప్రమాదకరమైన లోయలు, సముద్రంలోని అలలు వద్ద..సెల్ఫీలు తీసుకుని చనిపోయిన ఉదంతాలు చూశాం. అయినా సరే జనాలు తగ్గేదే లే! అంటున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రమాదరకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ అంటూ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి బంధువులు లబోదిభోమని పెట్టే కేకలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని చవిచూశాడు ఇక్కడొక వ్యక్తి. 30 ఏళ్ల గోపాల్ పుండ్లిక్ చవాన్ మహారాష్ట్రలోని అజంతా గుహాల సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న బౌద్ధ గుహ దేవాలయాలను చూస్తూ ఉండగా సమీపంలో ఉన్న నది అతడిని ఆకర్షించింది. ఇంకేముంది..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అంతే ఒక్కసారిగా ఆ నదిలో పడిపోయాడు. సరిగ్గా సమీపంలోనే.. గర్జించే జలపాతం. మంచి ఫోర్స్‌గా వస్తున్న నీటి ప్రవాహం చూస్తే.. ఆ వ్యక్తి రాళ్లు గుంటలపై కొట్టుకుపోయేలా ఉంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి నీటిలోకి పడగానే ఈత కొట్టే యత్నం చేయడంతో వెంటనే అదికారులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేశారు. సుమారు 10 మందికి పైగా వ్యక్తుల తాడు సాయంతో ఆ వ్యక్తి లోయ నుంచి బయటకు తీశారు. కాగా, అతను భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టగట్టగలిగాడు కానీ లేదంటే చనిపోయేవాడని అధికారులు అంటున్నారు. అతను పడిన వెంటనే గాభరాపడకుండా ఈత కొట్టే యత్నం చేశాడు కాబట్టే మాకు అతడిని రక్షించగలిగే సమయం దొరికిందని చెప్పుకొచ్చారు. చాలా మంది అతిడిలా అదృష్టవంతులు కాకపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక 2020 అధ్యయనం ప్రకారం షార్క్ దాడులతో చనిపోయే వారికంటే ఇలా నీళ్ల వద్దకు సెల్ఫీ కోసం వచ్చి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని పేర్కొనడం గమనార్హం. (చదవండి: గూగుల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
Travel: భర్త రాసిన పుస్తకం.. సొంతంగా టూర్ ప్లాన్... అమ్మకు తోడుగా కొడుకు!
Kerala Mother Son Duo Travel Story: అజంతా ఎల్లోరా గుహలు... ఆమె పర్యటనల పుస్తకంలో తొలి పుట. ఆ తర్వాత జైపూర్ హవా మహల్, కేదార్నాథ్ ఆలయం, సిమ్లా మంచు తెరలు, మనాలి, రోహతాంగ్పాస్, తాజాగా కచ్, టిబెట్... పేజీలు నిండిపోతున్నాయి. విదేశీ పర్యటన కోసం కొత్త పుస్తకాన్ని మొదలు పెట్టిందామె. కేరళలో మొదలైన పర్యటన కాంక్ష హిమాలయాలను చేరింది. బహుశా ప్రపంచం మొత్తాన్ని చుట్టి తిరిగి కేరళ చేరుకునే వరకు ఆమెకు గమ్యాన్ని చేరిన భావన కలగకపోవచ్చు. ఆమెలో భ్రమణ కాంక్ష ఈ స్థాయిలో కలగడానికి కారణం ఆమె భర్త రాసిన పర్యాటక కథనాలేనంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఆమె పేరు గీతా రామచంద్రన్, ఆమె భర్త పేరు ఎం.కె. రామచంద్రన్. ఎం.కె రామచంద్రన్ పేరు తెలియని మలయాళ పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన అత్యంత ఆసక్తికరంగా రాసిన పర్యాటక కథనాల్లో ఉత్కంఠతో విహరించే వారు పాఠకులు. వాళ్లతోపాటు ఆయన భార్య గీతా రామచంద్రన్, కొడుకు శరత్ కృష్ణన్ కూడా. కేరళ, త్రిశూర్‌లో మొదలైన ఆయన రచనావ్యాసంగం హిమాలయాలను తాకింది. ‘తపోభూమి ఉత్తరాఖండ్, ఆది కైలాస యాత్ర, ఉత్తరాఖండిలూడి – కైలాస్ మాన్సరోవర్ యాత్ర’ వంటి యాత్రాకథనాలను వెలువరించారాయన. 2003లో ప్రచురితమైన ఉత్తరాఖండిలూడి – కైలాస్ మాన్సరోవర్ యాత్ర రచనకు గాను ఎం.కె. రామచంద్రన్ 2005లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన సాధించిన ఈ ఘనతలో గీతారామచంద్రన్ సహపర్యాటకురాలు కాలేకపోయారు. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేస్తూ గృహిణిగానే జీవితంలో ఎక్కువ భాగం గడిచిపోయింది. దేశంలోని ప్రతి వైవిధ్యతనూ భర్త స్వయంగా ఆస్వాదిస్తుంటే, ఆ వైవిధ్యతలోని అందాన్ని ఆమె ఆయన రచనల్లో ఆస్వాదించేవారు. పిల్లల బాధ్యత పూర్తయిన తర్వాత కావల్సినంత విరామం దొరికింది. డయాబెటిస్ రూపంలో ఆరోగ్యం ఒక సవాల్ విసిరింది. కానీ సరిగ్గా మెయింటెయిన్ చేస్తే డయాబెటిస్తో ముప్పు ఉండదని జవాబు ఇచ్చిందామె. భర్త రాసిన ప్రదేశాలతోపాటు రాయని ప్రదేశాల్లో కూడా పర్యటిస్తోంది. కొడుకు తోడుగా ఉండడంతో క్లిష్టమైన ప్రదేశాలకు కూడా ధైర్యంగా వెళ్లగలుగుతున్నానంటోంది గీతా రామచంద్రన్. సొంతంగా టూర్ ప్లాన్ ‘‘అరవై నిండిన వాళ్లకు తీర్థయాత్రల ప్యాకేజ్లుంటాయి. నేను నా భర్త రాసిన ప్రతి అక్షరాన్ని చదివాను, ఆ ప్రదేశాల గురించి చెప్పగలిగినంతగా చదివాను. వాటన్నింటినీ ఆసాంతం చూడాలి, ఆస్వాదించేవరకు అక్కడ గడపగలగాలంటే టూర్ ప్యాకేజ్‌లు కేటాయించే టైమ్ సరిపోదు. అందుకే సొంతంగా టూర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటాను. నా పిల్లల్లో శరత్‌కి పర్యటనలంటే చాలా ఇష్టం. నన్ను తనే తీసుకెళ్తాడు. ఒంటె మీద సవారీ చేయాలంటే చేయిస్తాడు, మంచులో నాతో కలిసి ఆడతాడు. బీచ్‌లో పరుగులు తీస్తాం. అడుగు జారుతుందేమోననే చోట చేయి పట్టి నడిపిస్తాడు. జైపూర్ వంటి కొన్ని పర్యాటక ప్రదేశాల్లో సైకిల్ రైడింగ్‌కి అవకాశం ఉంటుంది. అక్కడ సైకిల్ మీద ఆ ఊరంతా తిప్పి చూపిస్తాడు. మనాలి నుంచి రోహతాంగ్ పాస్‌కు మోటార్ బైక్ మీద తీసుకెళ్లాడు. బైక్ మీద టూర్ నాకదే మొదటిసారి. ఆ జర్నీ యూత్‌ఫుల్‌గా అనిపించింది. సిమ్లా, మనాలి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ సాగిన ఆ జర్నీలో అపాయకరమైన మలుపులను కూడా గమనించనేలేదు. క్లిష్టమైన మలుపుల్లో భయం వేయలేదా అని శరత్ అడిగే వరకు భయమనే మాటే గుర్తు రాలేదు. నేను టూర్ ఇటెనరీ బాగా వేస్తానని మా శరత్‌కి గట్టి నమ్మకం. ప్రొఫెషనల్ టూర్ ఆపరేటర్లు కూడా అలా వేయలేరంటాడు. మా వారి రచనలు చదివాను, కాబట్టి నా అభిరుచికి తగినట్లు అక్కడ యాక్టివిటీస్ కోసం ఎంత సమయం అవసరం ఉంటుందో లెక్కవేసి ఆ రోజు బస ఇతర సమయాలను ప్లాన్ చేస్తుంటాను. మూడు నెలలకో టూర్ వేయకపోతే నాకు తోచదు. నాకే కాదు శరత్‌కి కూడా. నేను ఆలస్యం చేస్తే ‘అమ్మా నెక్ట్స్ ఎక్కడికి?’ అని అడుగుతాడు. కొత్త లోకాన్ని చూస్తున్నాననడం లేదు, కానీ లోకాన్ని కొత్తగా చూస్తున్నానని చెప్పవచ్చు. అక్షరాల్లో చదివి ఊహించుకున్న ప్రదేశాల్లో విహరించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి అని మాత్రం చెప్పగలను’’ అంటోంది అరవై నాలుగేళ్ల గీతా రామచంద్రన్. అమ్మకు తోడు! ట్రావెల్ ప్యాకేజ్‌లలో పంపిస్తే అమ్మ ఆరోగ్యం, భద్రత గురించి మాకు క్షణక్షణం ఆందోళనగానే ఉంటుంది. నేను తీసుకువెళ్తే ఆ భయం ఉండదు కదా! మా అమ్మ ముఖంలో సంతోషం చూస్తే పర్యటన కోసం కేటాయించిన సమయం, డబ్బు ఏ మాత్రం వృథా కాలేదని సంతృప్తిగా ఉంటుంది. ఆమెకు అంతటి సంతోషాన్నిస్తున్న పని చేస్తున్నందుకు కొడుకుగా గర్వపడుతున్నాను. మా బాల్యంలో నాన్న ఎప్పుడూ టూర్లలోనే ఉండేవారు. నాన్నకు కావల్సినవి అమర్చిపెట్టడం, మాకు ఏ లోటూ లేకుండా చూసుకోవడంతోనే అమ్మ జీవితం గడిచిపోయింది. అప్పటి ఆ లోటు ఇప్పుడు తీరుస్తున్నాను. – శరత్ కృష్ణన్, ట్రావెలర్ చదవండి: Saudi Arabia: ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా.. -
అజంతా అందాలకు సీతా‘కోక’ల సింగారం!
ఔరంగాబాద్: అజంతా గుహల అందాలకు పంచవన్నెల సీతాకోక చిలుకల అందాలు మరింత శోభను చేకూర్చనున్నాయి. ఇకపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రమైన అజంతా గుహలను సందర్శించే పర్యాటకులకు గుహల అందాలతోపాటు రం గురంగుల సీతాకోకచిలుకల సోయగాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీ ఉమ్మడి యాజమాన్య కమిటీ(జేఎఫ్ఎంసీ)తో కలిసి అటవీ శాఖ అధికారులు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. గుహల సమీపంలో, కొండ కింద జలపాతాల దిగువ ప్రాంతంలో సీతాకోక చిలుకలను ఆకర్షించే వాతావరణాన్ని కల్పిం చేందుకు కృషిచేయనున్నా రు. ఈ విషయమై అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అజిత్ భోంస్లే మాట్లాడుతూ..‘ అజంతా గుహల సమీపంలో రెండు కిలోమీటర్ల దూరం వరకు సీతాకోక చిలుకలను ఆకర్షించేందుకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను పెంచాలని నిర్ణయించాం..’ అని అన్నారు. ‘ఈ ప్రదేశం లో ఎక్కువగా పుష్పించే వృక్షజాతులు ఉండటంతో వివిధ రకాల సీతాకోక చిలుకల ఉనికి ఇక్కడ స్పష్టంగా ఉంది. మేము ఈ వాతావరణాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ జాతుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. గుహలను సందర్శించేందుకు వచ్చే సందర్శకులకు ఈ సీతాకోక చిలుకలు అదనపు ఆనందాన్ని కలి గిస్తాయి..’ అని ఆయన చెప్పారు. సాధారణంగా వసంతకాలం, సీతాకాలాల్లో మాత్రమే సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే తాము వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా ఏడాది పొడవునా సీతాకోకచిలుకలు సందర్శకులను అలరించేలా చర్యలు తీసుకుంటున్నామని భోంస్లే తెలిపారు. వచ్చే ఏడాది జూన్-జూలై నుంచి తమ ప్రణాళిక అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పర్యాటకాభివృద్ధిలోభాగంగా గుహల సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలంలో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు భోంస్లే చెప్పారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఒక స్థలాన్ని ఉద్యానవనంగా మార్చి తీర్చిదిద్దనున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. పనికిరాని మొక్కలను, చెత్తచెదారాన్ని తొలగింపు పనులు నడుస్తున్నాయని చెప్పా రు. దీంతో పర్యాటకులు జలపాతాల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచివెళ్లి సందర్శించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుంచి గుహల వద్ద పారిశుద్ధ్య సంరక్షణ నిమిత్తం సందర్శకుల నుంచి ‘న్యూసెన్స్ ఫీ’ కింద రూ.10 వసూలు చేయనున్నామని భోంస్లే చెప్పారు. కాగా, ఇటీవల అజంతా గుహలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ(అటవీ) ప్రవీణ్ పరదేశీ, ఔరంగాబాద్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ మెయిపోకం అయ్యర్ సందర్శించి అటవీ శాఖ చేసిన ప్రతిపాదనలను ఆమోదించారని అజిత్ భోంస్లే వివరించారు.