![Viral Video: Man Plunges Into River While Ttaking A Selfie - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/selfie.jpg.webp?itok=HDSFsqdP)
ఇటీవలకాలంలో సెల్ఫీ పిచ్చి మాములుగా లేదు. సెల్ఫీ మోజులోపడి వేగంగా వెళ్లే ట్రెయిన్ వద్ద, ప్రమాదకరమైన లోయలు, సముద్రంలోని అలలు వద్ద..సెల్ఫీలు తీసుకుని చనిపోయిన ఉదంతాలు చూశాం. అయినా సరే జనాలు తగ్గేదే లే! అంటున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రమాదరకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ అంటూ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి బంధువులు లబోదిభోమని పెట్టే కేకలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని చవిచూశాడు ఇక్కడొక వ్యక్తి.
30 ఏళ్ల గోపాల్ పుండ్లిక్ చవాన్ మహారాష్ట్రలోని అజంతా గుహాల సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న బౌద్ధ గుహ దేవాలయాలను చూస్తూ ఉండగా సమీపంలో ఉన్న నది అతడిని ఆకర్షించింది. ఇంకేముంది..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అంతే ఒక్కసారిగా ఆ నదిలో పడిపోయాడు. సరిగ్గా సమీపంలోనే.. గర్జించే జలపాతం. మంచి ఫోర్స్‌గా వస్తున్న నీటి ప్రవాహం చూస్తే.. ఆ వ్యక్తి రాళ్లు గుంటలపై కొట్టుకుపోయేలా ఉంది.
అదృష్టవశాత్తు ఆ వ్యక్తి నీటిలోకి పడగానే ఈత కొట్టే యత్నం చేయడంతో వెంటనే అదికారులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేశారు. సుమారు 10 మందికి పైగా వ్యక్తుల తాడు సాయంతో ఆ వ్యక్తి లోయ నుంచి బయటకు తీశారు. కాగా, అతను భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టగట్టగలిగాడు కానీ లేదంటే చనిపోయేవాడని అధికారులు అంటున్నారు.
అతను పడిన వెంటనే గాభరాపడకుండా ఈత కొట్టే యత్నం చేశాడు కాబట్టే మాకు అతడిని రక్షించగలిగే సమయం దొరికిందని చెప్పుకొచ్చారు. చాలా మంది అతిడిలా అదృష్టవంతులు కాకపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక 2020 అధ్యయనం ప్రకారం షార్క్ దాడులతో చనిపోయే వారికంటే ఇలా నీళ్ల వద్దకు సెల్ఫీ కోసం వచ్చి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని పేర్కొనడం గమనార్హం.
(చదవండి: గూగుల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment