Ajita
-
Ajitha Challa: కాఫీ విత్ అజిత
మనలో చాలా మందికి కొన్ని ఇష్టమైన ఆసక్తులు ఉంటాయి. వాటిని వ్యాపకంగా మార్చుకుంటారు కొందరు. వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు అని నిరూపించి చూపుతున్నారు హైదరాబాద్ వాసి అజిత చల్లా. నిద్రలేస్తూనే ఫిల్టర్ కాఫీ రుచిని ఆస్వాదించకుండా ఆ రోజు గడవదనే అజిత దేశీ విదేశీ కాఫీ రుచులను కరఫా పేరుతో నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. కాఫీ ఫ్లేవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎనిమిదేళ్ల తన కాఫీ జర్నీని ఇలా ఆనందంగా మన ముందుంచారు. ‘‘మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఉదయం లేస్తూనే ఒక దృశ్యాన్ని చూస్తూ, నేనూ ఆస్వాదిస్తూ పెరిగాను. అదే, ఉదయాన్నే ఫిల్టర్ కాఫీతో రోజును మొదలుపెట్టడం. రాత్రి నిద్రపోయేటప్పుడు కాఫీ ఇచ్చినా కాదనను. అలాంటి ఇష్టం ఏ ఊరు వెళ్లినా నా రోజువారీ ప్లాన్‌లో సరైన కాఫీ కోసం అన్వేషణ సాగుతూనే ఉండేది. కుటుంబం నేర్పిన పాఠం నేను పుట్టి పెరిగింది విజయవాడ. ఇంజినీరింగ్ పూర్తిచేశాను. ఉద్యోగినిగా కన్నా బిజినెస్ ఉమన్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉండేది. మా నాన్న కన్స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్నారు. నాకు అది సూట్ కాదనిపించింది. పెళ్లయ్యాక హైదరాబాద్ రావడం, మా అత్తింటి వారు ఇన్స్టంట్ కాఫీ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో ఉండటంతో నా ఆసక్తికి కొంచెం ఊతం వచ్చి ఉంటుంది. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం వరకు ఆ విషయం నాకు స్ఫురణకు రాలేదు. ఎక్కడకు వెళ్లినా కాఫీ గురించి వెతుక్కోవడం. కాఫీ రుచి గురించి మా వాళ్లతో మాట్లాడటం తరచూ జరుగుతుండేది. టూర్స్‌కి విదేశాలకు వెళ్లినా అక్కడ కూడా వివిధ రకాల కాఫీలు టేస్ట్ చేసే నా అలవాటను మానేదాన్ని కాదు. ఓ రెండేళ్ల క్రితం స్వయంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కాఫీ కప్పు నాకు సమాధానంలా అనిపించింది. నేనెప్పుడూ ఫిల్టర్ కాఫీనే తాగేదాన్ని. పాలు, బెల్లం, డికాషన్ కలిపి చేసే ఆ కాఫీ నాకు చాలా ఇష్టమైనది. కానీ, మరొకరు ఇంకో రుచికరమైన కాఫీ కోసం అన్వేషించవచ్చు. మనకు తెలిసి కాఫీ అంటే చిరుచేదుగా ఉంటుందని చాలామంది మైండ్‌లో ఉంటుంది. కానీ, ఆ మాత్రం చేదు కూడా లేకుండా కాఫీని పరిచయం చేయచ్చు అని చాలా ప్రయోగాలు చేశాను. కాంబినేషన్స్ మారుతున్నకొద్దీ కాఫీ రుచి ఎలా మారుతుందో తెలుసుకుంటూ వచ్చాను. ఏది బెస్ట్ అని ఒక్క మాటలో చెప్పలేం. రోస్ట్ చేయడం, గ్రైండ్ చే సే విధానాన్ని బట్టి రుచిలో మార్పు వస్తుంటుంది. బ్లాక్ కాఫీలోనే పదుల సంఖ్యలో వెరైటీలు ఉన్నాయి. వాటిలో ఆరింటిని మేం పరిచయం చేస్తున్నాం. మరో పది దేశ విదేశీ కాఫీలు టేస్ట్ చేయచ్చు. ప్రాజెక్ట్ వర్క్ కాఫీ ఆలోచనను మా కుటుంబ సభ్యుల ముందుంచినప్పుడు వారి నుంచి సపోర్ట్ రావడంతో నేననుకున్న కల నా ముందుకు వచ్చింది. వ్యాపారం ఆలోచన వచ్చాక రెండేళ్లుగా చాలా కసరత్తులు చేశాను. కాఫీ గింజలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించాలి, వాటిని ఏ పద్ధతిలో రోస్ట్ చేయాలి, కాఫీకి అనుబంధంగా ఎలాంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది, మిషనరీ ఏంటి... ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఆ ప్రయత్నానికి ఫ్రెంచ్ కాఫీ అండ్ టీ కెటిల్ పేరు ‘కరఫా’ అనేది ఫైనల్ అయ్యింది. ప్రత్యేకంగా.. మొదట ఇండియన్, వియత్నాం కాఫీ రుచులతో ప్రారంభించి, ఆ తర్వాత నుంచి భిన్న రుచులతో కొత్తదనాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. కెనడియన్, కొలంబియన్, ఇథోపియన్, ఇండియన్.. దేనికదే ప్రత్యేకత. మెక్సికన్లు దాల్చినచెక్క వేసుకొని కాఫీ తాగుతారు. ఇథోపియన్లు కాఫీతో పాటు పాప్ కార్న్ తీసుకుంటారు. వాళ్లలాగే మనమూ చేస్తే నచ్చకపోవచ్చు, కానీ, వాటి మీద ప్రయోగాలు చేస్తూ మనవారి టేస్ట్‌కు తగ్గట్టు ఇక్కడి కాఫీ ప్రియులకు నచ్చినట్టు పరిచయం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే, వియత్నాంతో పాటు ఇంకొన్ని దేశాల్లో కాఫీ తోటలు వాటంతటవే పెరుగుతాయి. మన దగ్గర ఒక నిర్మాణాత్మకంగా పెంచుతారు. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన కాఫీ గింజలకి, ఇక్కడికి తేడా ఉంటుంది. అందుకే, ఈ కాఫీ టేస్ట్ మాత్రమే బాగుంటుందని చెప్పలేం. అన్నీ టేస్ట్ చేయాల్సిందే. కాఫీతో పాటు... ఫుడ్ కూడా ఉంటుంది. కాఫీ సేవిస్తూ తినడానికి ఇష్టపడే ఐటమ్స్ ఏమేం ఉంటాయో వాటన్నింటినీ పరిచయం చేస్తున్నాం. కొందరికి బ్రేక్ ఫాస్ట్తోనూ, లంచ్ టైమ్ మీల్స్తోనూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దానిని కూడా ఇక్కడ అదే మెనూగా అందిస్తున్నాం. ప్రతి ఆలోచనా కాఫీతో పాటు కాఫీ చుట్టూతానే ఉంటుంది. ఇదంతా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటున్నాం. ఈ రోజు వాతావరణం చల్లగా ఉంటే ఒక రకమైన కాఫీ తాగాలనిపిస్తుంది. మరుసటి రోజు ఎండగా ఉంటే ఇంకోరకం కాఫీ తాగాలని ఉంటుంది. ఎవరు రెగ్యులర్‌గా తాగే కాఫీ వాళ్లకు బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు. అలాగే, ఎప్పటికప్పుడు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనే ఆసక్తి గలవారుంటారు. అందుకే, భిన్నరకాల రుచులతో కాఫీలను పరిచయం చేస్తూ నేనూ ఈ కాఫీ ప్రపంచంలో మమేకం అవుతున్నాను’ అని వివరించారు అజిత. – నిర్మలారెడ్డి -
33 ఏళ్ల తరువాత నాన్నను కలిసింది
పాలక్కడ్ లేదా పాల్ఘాట్ అనే ఉళ్లో ఉంటున్న అజితకు తన తండ్రి అక్కడికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం జైలులో ఉన్నాడన్న సంగతి తెలియనే తెలియదు. ఆమె తండ్రి శివాజీని అజితకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు పోలీసులు పట్టుకెళ్లారు. దానికి కారణం రాజకీయ పార్టీ కార్యకర్త అయిన శివాజీ ఏదో హత్య చేశాడని అభియోగం. రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట జైలుకు వెళ్లాడు. దాంతో అతని భార్యకు మతిస్థిమితం తప్పి మరణించింది. వద్దన్నా తమ ఇంటి ఆడపిల్లను చేసుకుని, పార్టీ అని తిరిగి ఈ కష్టాలన్నీ తెచ్చాడని అల్లుడి మీద కోపం పెట్టుకున్న అత్తామామలు అజితను పెంచి పెద్ద చేసే క్రమంలో ఆమె తండ్రి ప్రస్తావనను పొరపాటున చేయడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో అజిత తన తండ్రి మరణించాడని అనుకుంది. అజిత పెద్దదయ్యింది. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలు. అయితే లాక్డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో తన తండ్రి గురించిన ప్రస్తావన వచ్చింది. తండ్రి పేరు, హత్య కేసు వివరాలు పోలికతో ఉండటంతో అజితకు జైలులో ఉన్నది తన తండ్రే అని తెలిసింది. ఇక ఆ కూతురి మనసు ఆగలేదు. 2006లో శిక్ష పూర్తి అయినా శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయితే శిక్షాకాలంలో అతను నాలుగుసార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో జైలులో ఉండిపోవాల్సి వచ్చింది. జైలులో ఉన్న తండ్రిని విడిపించుకోవడానికి అజిత తెలిసినవాళ్లందరి దగ్గరకూ పరిగెత్తింది. చివరకు కరోనా ఆమెకు సాయపడింది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంలో భాగంగా శివాజీకి కూడా 3 నెలల పెరోల్ ఇచ్చారు. వెంటనే అజిత వెళ్లి తండ్రిని తెచ్చుకుంది. 65 ఏళ్ల వయసు ఉన్న శివాజీ కూతురిని చూడటం ఒక ఉద్వేగం అయితే బయటికొచ్చి ఉండటం మరో ఉద్వేగం. ‘ఆయన చాలా ఆందోళన చెందాడు. కాని నా ఇంటికి వచ్చాక మెల్లగా సర్దుబాటు చెందాడు’ అని అజిత సంతోషంగా చెప్పింది. రక్త సంబంధం గొప్పతనం ఇలా ఉంటుంది. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా అది తన రక్తాన్ని ఆనవాలు పడుతుంది. సినిమా కథల కంటే నాటకీయమైన కథలను మనకు ఇస్తూ ఉంటుంది. -
మన కళ్లకు కనపడదా?
కడుపులో మొదలైన చిచ్చు కాటికి పోయేదాకా ఆగడంలేదు బాగా పోరాడితే భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయి కానీ భూమ్మీద పడ్డ ఆడపిల్లకి గుండెకోత తప్పడంలేదు పండంటి జీవితాలను పుండు పుండు చేస్తున్నారు ముళ్లకంపలో పారేస్తారు.. చెత్తకుప్పలో వదిలేస్తారు.. ఇంట్లో.. స్కూల్లో .. బజార్లో కాటేస్తారు! ఏం తప్పు చేసింది ఈ తల్లి? ఎందుకు ఈ విషపుగాట్లు? తప్పు తప్పు! తప్పు చేసింది తల్లికాదు ఆ కడుపునే పుట్టిన మగాడు! ఈ దాష్టీకాల గురించి ఎంత రాసినా... వాళ్ల రాత మాత్రం మారడంలేదు! మనలో గాంధీ మేల్కోవాలి.. మరో ఉద్యమం రావాలి..! మనం కళ్లు తెరవాలి... మన మనసు కదలాలి! ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడవగలుగుతుందో ఆ రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అన్న గాంధీ ఆలోచనలకు రూపంగా నిలిచిందే కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్! మనలో స్పందన కోసం స్ఫూర్తిగా ఆ సంస్థ గురించి తెలుసుకుందాం... భారమని... ఓ రాత్రి.. సమయం పదకొండు! స్థలం.. నల్గొండ బస్టాండ్. నాలుగేళ్ల పిల్ల గుక్కతిప్పుకోకుండా ఏడుస్తోంది. ఒంటి మీద దెబ్బలున్నాయి. పలుచగా ఉన్న జనం ఆ పసిదాని చుట్టూ ముగారు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా, మీ అమ్మానాన్న పేరేంటి? అని ఎంత అడిగినా వెక్కివెక్కి ఏడ్వడమే తప్ప జవాబు చెప్పడం రావట్లేదు. ఏం చేయాలో పాలుపోని జనం అక్కడి పోలీసులకు కబురు చేశారు. పోలీసులు వచ్చి పాపను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళితే అక్కడా ఆ పిల్ల నోటి నుంచి ఏ వివరమూ రాలేదు. తెల్లవారి ఎంక్వయిరీలో తెలిసిన సత్యం ఏంటంటే.. ఆ ‘ఆడపిల’్లను వదిలించుకోవడానికి తల్లిదండ్రులు ఈడ వదిలేసి వెళ్లారని. తన పేరును కూడా మర్చిపోయేంత భయంలోఉన్న ఆ పాపకు మహిత అని పోలీసులే నామకరణం చేశారు. రుణం తీర్చమని.. అజిత (పేరు మార్చాం)కు పన్నెండేళ్లు! ఏడవ తరగతిలో ఉంది. రంగారెడ్డిజిల్లాలోని ఓ మండలకేంద్రం ఆమె స్వస్థలం. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అజిత పిన్నమ్మను మారు మనువాడాడు తండ్రి. పిన్నమ్మ అయితే పిల్లకు తల్లిలేని లోటు తీరుస్తుందని! కానీ అలా జరగలేదు. అప్పులపాలై ఉన్న రెండు ఎకరాల భూమినీ అమ్ముకున్నాడు తండ్రి. వ్యవసాయ కూలీగా మిగిలాడు. కాలం లేక కూలి పనీ సాగలేదు. రుణ భారం మోయలేనంత అయింది. అప్పుడే దగ్గరి బంధువు నుంచి అజిత తండ్రికి ఓ కబురందింది. ఆయన కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేస్తే ఆ అప్పంతా తీరుస్తానని. 32 ఏళ్ల వాడికి పన్నెండేళ్ల నా కూతురు కావల్సి వచ్చిందా అని ఆవేశపడ్డాడు. ‘పదిహేనేళ్ల తేడా ఉండి, ఓ బిడ్డ తండ్రిని నేను చేసుకోలేదా? అతనిదైతే ఇంకా మొదటి పెళ్లే కదా?’ అని ఎకసెక్కం చేసింది అజిత పిన్నమ్మ. ‘అప్పులతో అందరం ఆత్మహత్య చేసుకునేకంటే బిడ్డను వాడిచేతిలో పెట్టి అప్పుతీర్చడం నయం కదా! ఇప్పుడా పిల్ల చదివి ఊళ్లు ఏలేదుందా? రాజ్యాలు ఏలేదుందా? ఎంత చదివించినా కట్నమిచ్చే కదా పెళ్లి చేయాలి. ఆ కట్నమేదో ఎదురొస్తుంటే నాలుగు అక్షింతలు వేయడానికేమయింది?’ అంటూ భర్త మనసు మార్చే ప్రయత్నం చేసింది. సఫలం కూడా అయింది. పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. విషయం తెలిసినప్పటి నుంచి అజిత ఇంట్లో యుద్ధం చేస్తూనే ఉంది.. ‘నాకు పెళ్లొద్దు. చదువుకుంటాను’ అని. కానీ ఎవరూ వినలేదు. కన్నందుకు ఈ పెళ్లి చేసుకొని రుణం తీర్చాల్సిందే అన్నట్టుగా ప్రవర్తించారు. పిల్ల గడపదాటకుండా కట్టడి చేశారు. పెళ్లి ముందు రోజురాత్రి ఆ బంధనాలు తెంచుకుని ఇంట్లోంచి పారిపోయింది అజిత. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తనవాళ్లకు కనిపించకుండానైతే వెళ్లాలి. ఈ పెళ్లి తప్పించుకోవాలి. ఈ ఆలోచనలతోనే సాగుతోంది. ఆ ఊరిపొలిమేర దాటేలోపే పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్నారు. బాల్య వివాహం నేరమని తల్లిదండ్రులను హెచ్చరించి ఆ ప్రయతాన్ని ఆపించారు. అయినా అజిత తల్లిదండ్రులతో ఉండనంది. వావి వరుసల ఇంగితం పోయి.. అన్విత (పేరు మార్చాం)ది మెదక్జిల్లాలోని ఓ పల్లెటూరు. వయసు పదిహేను. తొమ్మిదో తరగతిలో ఉంది. చదువులో ఫస్ట్. ఆటపాటల్లో బెస్ట్. డాక్టర్ కావాలని కోరిక. అంతే పట్టుదల. తండ్రి పచ్చి తాగుబోతు. తల్లి వ్యవసాయ కూలీ. అన్న దుబాయ్‌లో ఉంటాడు. పొలం పనుల నుంచి తల్లి ఇంటికొచ్చే సరికి పొద్దు పోయేది. ఒకరోజు.. విపరీతమైన జ్వరంతో మధ్యాహ్నమే బడి నుంచి ఇంటికి వచ్చేసి ఒళ్లు తెలియకుండా పడుకుండి పోయింది అన్విత. ఎప్పుడొచ్చాడో తండ్రి విపరీతంగా తాగి.. కూతురనే ఇంగితం కూడా మర్చిపోయి అత్యాచారం చేశాడు. ఆ బిడ్డ శరీరమే కాదు మెదడూ గాయపడింది. ఆ గాయం నుంచి శరీరం త్వరగా కోలుకున్నా మనసు ఇంకా కోలుకోలేదు. నాడి పట్టుకొని పేషంట్ల ఆరోగ్యం చూడాలని కలలుకన్న ఆ బంగారుతల్లి ఎండు పుల్లలు పట్టుకొని గాల్లో గీతలు గీస్తోంది.. పిచ్చి చూపులు చూస్తోంది! నేనున్నాంటూ.. అయితే ఇప్పుడు మహితకు అమ్మ ఒడి, అజితకు జీవన పాఠం నేర్పుతున్న బడి, అన్వితకు సాంత్వననిస్తున్న గుడి.. ఒకటి ఉంది. దాని పేరు హైదరాబాద్‌లోని కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్. అయినవాళ్ల దగ్గర, కాని వాళ్ల దగ్గర దగా పడ్డ ఆడబిడ్డలెందరినో అక్కున చేర్చుకొని ఆత్మబలాన్నిచ్చి తలెత్తుకునేలా చేస్తోంది ఈ ఆశ్రమం. దీని ప్రస్థానం మొదలై ఇప్పటికీ 70 ఏళ్లు. మహాత్మాగాంధీ ఆలోచనలకు రూపం ఇది. గాంధీజీ చేయిపట్టుకొని దక్షిణాఫ్రికా వెళ్లిన కస్తూర్బా అక్కడ భాష రాక, పెద్ద చదువులేక, ఆరోగ్యంపట్ల అవగాహనా కొరవడి చాలా ఇబ్బందులు పడ్డదట. ఈ విషయాన్ని గ్రహించిన గాంధీజీ దేశంలోని గ్రామీణ ప్రాంత మహిళల చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని, వాటి ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అనుకున్నారు. అది నిర్ణయంగా మారి కార్యరూపం దాల్చింది 1945లో. కస్తూర్బా మరణించిన తర్వాత. దేశంలోని 22 ప్రాంతాల్లో గ్రామీణ మహిళల విద్య, వైద్యం, స్వాలంబన లక్ష్యంతో ‘కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. ‘అదేం చిత్రమో ఇప్పటికీ ఇదే సమస్యల మీదా పోరాడాల్సి వస్తోంది’ అంటారు ట్రస్ట్ ప్రతినిధి పద్మావతి. బాల్యవివాహాలు, అత్యాచారం, డొమెస్టిక్ వయొలెన్స్ల వల్ల బాధితులైన వారికి ఆశ్రయం ఇస్తూనే కుటుంబ తగాదాల వల్ల, క్షణికావేశంలో హత్యలు చేసి జైలు పాలైన తల్లిదండ్రుల వల్ల అనాథలైన పిల్లలకూ ఇల్లవుతోంది కస్తూర్బాగాంధీ ట్రస్ట్. మతిస్థిమితం కోల్పోయిన అనాథ మహిళలనూ చేర్చుకుంటోంది. ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న ఆడపిల్లలకూ భరోసానిస్తోంది. ఆత్మగౌరవంతో నిలబెడుతోంది కస్తూర్బా ట్రస్ట్ ఈ అనాథలకు అమ్మానాన్న అయి ఆత్మీయతను పంచడమే కాక గురువుగా మారి పాఠాలనూ నేర్పుతోంది. పిల్లలకు బడిలో చదువును, ఆశ్రమంలో లైఫ్ స్కిల్స్‌నూ బోధిస్తోంది. ప్రత్యేకంగా కంప్యూటర్కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టి అప్ టు డేట్ నాలెడ్జ్‌ను అందిస్తోంది. అంతేకాదు ఈ ఆశ్రమంలో చక్కటి లైబ్రరీ కూడ ఉంది. 20 ఏళ్లు దాటిన వాళ్ల కోసం ఒకేషనల్ ట్రైనింగ్ ఉంది. టైలరింగ్, హ్యాండీ క్రాఫ్ట్స్, జ్యూట్ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడం వంటివి నేర్పిస్తోంది. ఇలా శిక్షణ తీసుకొని తయారు చేసిన ప్రొడక్ట్స్‌కి మార్కెట్ కూడా కల్పించి ఈ మహిళలకు ఆదాయం చూపిస్తోంది. అలా వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి సమాజంలో ధైర్యంగా తలెత్తుకు తిరిగే నిలబడే శక్తినిస్తోంది. సీజనల్ ప్రొడక్ట్స్ ఇవే కాక వినాయక చవితి, దీపావళి వంటి పండగ సందర్భాల్లో మట్టితో వినాయకుడి ప్రతిమలు, ప్రమిదలు వంటివి తయారు చేయడం నేర్పిస్తోంది ఆశ్రమం. దీనివల్ల సమాజానికి పర్యావరణ ప్రియమైన మెసేజ్‌ను అందించడమే కాక ఆశ్రమంలోని మహిళలకు అదనపు ఆదాయమూ చూపిస్తోంది. - సాక్షి ఫ్యామిలీ మీరేం చేయొచ్చు? గాంధీజీ నాటి ఆశయాన్ని ఏమాత్రం మరవక కాలం తెచ్చిన మార్పులకనుగుణంగా తన పరిధిని పెంచుకుంటూ ఎందరో ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్! ప్రాచుర్యం కన్నా ప్రమాణానికి విలువకడుతోంది! ఈ కొండంత సేవలో గోరంత భాగస్వామ్యం మీరూ పంచుకోవచ్చు.నా అన్నవాళ్లు లేక బేలగా ఉన్న ఈ ఆడబిడ్డల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంచే నాలుగు మాటలు మాట్లాడొచ్చువివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలు వాళ్ల విజయరహస్యాలను వీళ్లతో పంచుకొని కొత్త స్ఫూర్తిని నింపొచ్చులెక్కల ఎక్స్పర్ట్ వచ్చి లాజిక్సెన్స్ మీద లెసన్స్ ఇవ్వచ్చు ఇంగ్లీష్ ఇంపార్టెన్స్‌ను వివరించొచ్చు వైద్యులు తమ వాలంటరీ సర్వీస్‌కు ఈ ట్రస్ట్‌ను క్యాంప్‌గా చేసుకోవచ్చు ఎన్నో సంస్థలు వీళ్లకు ఉపాధి అవకాశాలూ కల్పించవచ్చుఆర్థిక సహాయమూ అందించవచ్చు: కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌లోని మహిళల స్వాలంబనకు మీరు చేయూతనివ్వాలనుకుంటే ఈ నంబర్లో సంప్రదించగలరు.. 9391011282