పాలక్కడ్ లేదా పాల్‌ఘాట్ అనే ఉళ్లో ఉంటున్న అజితకు తన తండ్రి అక్కడికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం జైలులో ఉన్నాడన్న సంగతి తెలియనే తెలియదు. ఆమె తండ్రి శివాజీని అజితకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు పోలీసులు పట్టుకెళ్లారు. దానికి కారణం రాజకీయ పార్టీ కార్యకర్త అయిన శివాజీ ఏదో హత్య చేశాడని అభియోగం. రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట జైలుకు వెళ్లాడు. దాంతో అతని భార్యకు మతిస్థిమితం తప్పి మరణించింది.
వద్దన్నా తమ ఇంటి ఆడపిల్లను చేసుకుని, పార్టీ అని తిరిగి ఈ కష్టాలన్నీ తెచ్చాడని అల్లుడి మీద కోపం పెట్టుకున్న అత్తామామలు అజితను పెంచి పెద్ద చేసే క్రమంలో ఆమె తండ్రి ప్రస్తావనను పొరపాటున చేయడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో అజిత తన తండ్రి మరణించాడని అనుకుంది. అజిత పెద్దదయ్యింది. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలు. అయితే లాక్‌డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో తన తండ్రి గురించిన ప్రస్తావన వచ్చింది. తండ్రి పేరు, హత్య కేసు వివరాలు పోలికతో ఉండటంతో అజితకు జైలులో ఉన్నది తన తండ్రే అని తెలిసింది. ఇక ఆ కూతురి మనసు ఆగలేదు.
2006లో శిక్ష పూర్తి అయినా
శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయితే శిక్షాకాలంలో అతను నాలుగుసార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో జైలులో ఉండిపోవాల్సి వచ్చింది. జైలులో ఉన్న తండ్రిని విడిపించుకోవడానికి అజిత తెలిసినవాళ్లందరి దగ్గరకూ పరిగెత్తింది. చివరకు కరోనా ఆమెకు సాయపడింది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంలో భాగంగా శివాజీకి కూడా 3 నెలల పెరోల్ ఇచ్చారు. వెంటనే అజిత వెళ్లి తండ్రిని తెచ్చుకుంది. 65 ఏళ్ల వయసు ఉన్న శివాజీ కూతురిని చూడటం ఒక ఉద్వేగం అయితే బయటికొచ్చి ఉండటం మరో ఉద్వేగం. ‘ఆయన చాలా ఆందోళన చెందాడు. కాని నా ఇంటికి వచ్చాక మెల్లగా సర్దుబాటు చెందాడు’ అని అజిత సంతోషంగా చెప్పింది.
రక్త సంబంధం గొప్పతనం ఇలా ఉంటుంది. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా అది తన రక్తాన్ని ఆనవాలు పడుతుంది. సినిమా కథల కంటే నాటకీయమైన కథలను మనకు ఇస్తూ ఉంటుంది.
33 ఏళ్ల తరువాత నాన్నను కలిసింది
Published Thu, May 20 2021 12:58 AM | Last Updated on Tue, May 25 2021 6:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment