మనలో చాలా మందికి కొన్ని ఇష్టమైన ఆసక్తులు ఉంటాయి. వాటిని వ్యాపకంగా మార్చుకుంటారు కొందరు. వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు అని నిరూపించి చూపుతున్నారు హైదరాబాద్ వాసి అజిత చల్లా. నిద్రలేస్తూనే ఫిల్టర్ కాఫీ రుచిని ఆస్వాదించకుండా ఆ రోజు గడవదనే అజిత దేశీ విదేశీ కాఫీ రుచులను కరఫా పేరుతో నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. కాఫీ ఫ్లేవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎనిమిదేళ్ల తన కాఫీ జర్నీని ఇలా ఆనందంగా మన ముందుంచారు.
‘‘మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఉదయం లేస్తూనే ఒక దృశ్యాన్ని చూస్తూ, నేనూ ఆస్వాదిస్తూ పెరిగాను. అదే, ఉదయాన్నే ఫిల్టర్ కాఫీతో రోజును మొదలుపెట్టడం. రాత్రి నిద్రపోయేటప్పుడు కాఫీ ఇచ్చినా కాదనను. అలాంటి ఇష్టం ఏ ఊరు వెళ్లినా నా రోజువారీ ప్లాన్‌లో సరైన కాఫీ కోసం అన్వేషణ సాగుతూనే ఉండేది.
కుటుంబం నేర్పిన పాఠం
నేను పుట్టి పెరిగింది విజయవాడ. ఇంజినీరింగ్ పూర్తిచేశాను. ఉద్యోగినిగా కన్నా బిజినెస్ ఉమన్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉండేది. మా నాన్న కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్నారు. నాకు అది సూట్ కాదనిపించింది. పెళ్లయ్యాక హైదరాబాద్ రావడం, మా అత్తింటి వారు ఇన్‌స్టంట్ కాఫీ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో ఉండటంతో నా ఆసక్తికి కొంచెం ఊతం వచ్చి ఉంటుంది. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం వరకు ఆ విషయం నాకు స్ఫురణకు రాలేదు. ఎక్కడకు వెళ్లినా కాఫీ గురించి వెతుక్కోవడం. కాఫీ రుచి గురించి మా వాళ్లతో మాట్లాడటం తరచూ జరుగుతుండేది. టూర్స్‌కి విదేశాలకు వెళ్లినా అక్కడ కూడా వివిధ రకాల కాఫీలు టేస్ట్ చేసే నా అలవాటను మానేదాన్ని కాదు. ఓ రెండేళ్ల క్రితం స్వయంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కాఫీ కప్పు నాకు సమాధానంలా అనిపించింది.
నేనెప్పుడూ ఫిల్టర్ కాఫీనే తాగేదాన్ని. పాలు, బెల్లం, డికాషన్ కలిపి చేసే ఆ కాఫీ నాకు చాలా ఇష్టమైనది. కానీ, మరొకరు ఇంకో రుచికరమైన కాఫీ కోసం అన్వేషించవచ్చు. మనకు తెలిసి కాఫీ అంటే చిరుచేదుగా ఉంటుందని చాలామంది మైండ్‌లో ఉంటుంది. కానీ, ఆ మాత్రం చేదు కూడా లేకుండా కాఫీని పరిచయం చేయచ్చు అని చాలా ప్రయోగాలు చేశాను. కాంబినేషన్స్ మారుతున్నకొద్దీ కాఫీ రుచి ఎలా మారుతుందో తెలుసుకుంటూ వచ్చాను. ఏది బెస్ట్ అని ఒక్క మాటలో చెప్పలేం. రోస్ట్ చేయడం, గ్రైండ్ చే సే విధానాన్ని బట్టి రుచిలో మార్పు వస్తుంటుంది. బ్లాక్ కాఫీలోనే పదుల సంఖ్యలో వెరైటీలు ఉన్నాయి. వాటిలో ఆరింటిని మేం పరిచయం చేస్తున్నాం. మరో పది దేశ విదేశీ కాఫీలు టేస్ట్ చేయచ్చు.
ప్రాజెక్ట్ వర్క్
కాఫీ ఆలోచనను మా కుటుంబ సభ్యుల ముందుంచినప్పుడు వారి నుంచి సపోర్ట్ రావడంతో నేననుకున్న కల నా ముందుకు వచ్చింది. వ్యాపారం ఆలోచన వచ్చాక రెండేళ్లుగా చాలా కసరత్తులు చేశాను. కాఫీ గింజలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించాలి, వాటిని ఏ పద్ధతిలో రోస్ట్ చేయాలి, కాఫీకి అనుబంధంగా ఎలాంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది, మిషనరీ ఏంటి... ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఆ ప్రయత్నానికి ఫ్రెంచ్ కాఫీ అండ్ టీ కెటిల్ పేరు ‘కరఫా’ అనేది ఫైనల్ అయ్యింది.
ప్రత్యేకంగా..
మొదట ఇండియన్, వియత్నాం కాఫీ రుచులతో ప్రారంభించి, ఆ తర్వాత నుంచి భిన్న రుచులతో కొత్తదనాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. కెనడియన్, కొలంబియన్, ఇథోపియన్, ఇండియన్.. దేనికదే ప్రత్యేకత. మెక్సికన్లు దాల్చినచెక్క వేసుకొని కాఫీ తాగుతారు. ఇథోపియన్లు కాఫీతో పాటు పాప్ కార్న్ తీసుకుంటారు. వాళ్లలాగే మనమూ చేస్తే నచ్చకపోవచ్చు, కానీ, వాటి మీద ప్రయోగాలు చేస్తూ మనవారి టేస్ట్‌కు తగ్గట్టు ఇక్కడి కాఫీ ప్రియులకు నచ్చినట్టు పరిచయం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే, వియత్నాంతో పాటు ఇంకొన్ని దేశాల్లో కాఫీ తోటలు వాటంతటవే పెరుగుతాయి. మన దగ్గర ఒక నిర్మాణాత్మకంగా పెంచుతారు. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన కాఫీ గింజలకి, ఇక్కడికి తేడా ఉంటుంది. అందుకే, ఈ కాఫీ టేస్ట్ మాత్రమే బాగుంటుందని చెప్పలేం. అన్నీ టేస్ట్ చేయాల్సిందే.
కాఫీతో పాటు...
ఫుడ్ కూడా ఉంటుంది. కాఫీ సేవిస్తూ తినడానికి ఇష్టపడే ఐటమ్స్ ఏమేం ఉంటాయో వాటన్నింటినీ పరిచయం చేస్తున్నాం. కొందరికి బ్రేక్ ఫాస్ట్‌తోనూ, లంచ్ టైమ్ మీల్స్‌తోనూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దానిని కూడా ఇక్కడ అదే మెనూగా అందిస్తున్నాం. ప్రతి ఆలోచనా కాఫీతో పాటు కాఫీ చుట్టూతానే ఉంటుంది. ఇదంతా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూసుకుంటున్నాం. ఈ రోజు వాతావరణం చల్లగా ఉంటే ఒక రకమైన కాఫీ తాగాలనిపిస్తుంది. మరుసటి రోజు ఎండగా ఉంటే ఇంకోరకం కాఫీ తాగాలని ఉంటుంది. ఎవరు రెగ్యులర్‌గా తాగే కాఫీ వాళ్లకు బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు. అలాగే, ఎప్పటికప్పుడు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనే ఆసక్తి గలవారుంటారు. అందుకే, భిన్నరకాల రుచులతో కాఫీలను పరిచయం చేస్తూ నేనూ ఈ కాఫీ ప్రపంచంలో మమేకం అవుతున్నాను’ అని వివరించారు అజిత.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment