ajith tendulkar
-
అన్న గెలవాలని తమ్ముడు... తమ్ముడు నెగ్గాలని అన్న
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ నిర్మాణంలో అతడి అన్న అజిత్ టెండూల్కర్ పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తమ్ముడి ఉన్నతికి అజిత్ సొంత కెరీర్‌నే త్యాగం చేశాడంటారు. సచిన్ కూడా అవకాశం దక్కినప్పుడల్లా అన్న గురించి చాలా గొప్పగా చెబుతుంటాడు. వీరిద్దరి మధ్య అంతటి అనుబంధం ఉండేది. దీనిని మరింతగా చాటే ఓ ఉదాహరణను సచిన్... గురువారం అందరితో పంచుకున్నాడు. ముంబైలోని ఎంఐజీ క్రికెట్ క్లబ్లో తన పేరిట నెలకొల్పిన పెవిలియన్ ప్రారంభం సందర్భంగా ఈ క్లబ్‌తో ప్రత్యేక అనుబంధాన్ని చెప్పమన్నప్పుడు అతడీ విషయం చెప్పాడు. అదేంటో అతడి మాటల్లోనే... ‘ఇది గతంలో ఎప్పుడూ చెప్పని విషయం. చాలా ఏళ్ల క్రితం, అంటే నేనింకా రంజీల్లో కూడా అడుగుపెట్టని రోజులనుకుంటా. కానీ, అప్పుడప్పుడే నా ఎదుగుదల ప్రారంభమవుతోంది. అప్పట్లో ఎంఐజీలో జరిగే సింగిల్ వికెట్ టోర్నీలో నేను, అజిత్ పాల్గొనేవారం. ఓసారి ఇద్దరం వేర్వేరు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తూ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎదురుపడ్డాం. ఇలాంటి సందర్భం మాకు అదే మొదటిసారి. అయితే, నాకు బౌలింగ్ చేస్తున్నప్పుడు వైడ్లు, నో బాల్స్ వేస్తున్న అజిత్ బాడీ లాంగ్వేజ్ చూస్తే... అతడికి నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ, ఔట్ చేసే ఉద్దేశం ఉన్నట్లు కనిపించలేదు. సరిగ్గా నేను కూడా అన్నయ్య ఓడిపోకూడదన్నట్లు షాట్లు కొట్టే ఆలోచన చేయలేదు. డిఫెన్స్ ఆడుతూ వస్తున్నాను. దీంతో, నీ సహజమైన ఆట నువ్వు ఆడు అంటూ అజిత్ చెప్పాడు. మన కంటే పెద్దవాడైన అన్నయ్య చెప్పిన మాట వినాలి అంటారు కదా? నేనదే చేశాను. ఆ మ్యాచ్‌లో గెలిచి మా జట్టు ఫైనల్‌కు వెళ్లింది. ఇక్కడ అజిత్ ఓడినా నేను గెలిచినట్లు కాదు’. -
ఎల్లకాలం ఆడలేడుగా..!
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఈ నిర్ణయం తమను ఆశ్చర్యపరచలేదని మాస్టర్ సోదరుడు అజిత్ టెండూల్కర్ చెప్పారు. కొంతకాలంగా అతడు ఈ విషయంపై ఆలోచిస్తున్నాడని అన్నారు. ఎవరైనా ఆట నుంచి తప్పుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడని అజిత్ తన సోదరుడి గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. అతి పిన్న వయస్సులోనే సచిన్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని తామెప్పుడూ అనుకోలేదని, సరైన సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించాడని అన్నారు. ‘16 ఏళ్ల వయస్సులో సచిన్ దేశానికి ఆడతాడని మా కుటుంబంలో ఎవరూ అనుకోలేదు. అంత చిన్నప్పుడే భారత్‌కు ఆడి రికార్డులు సృష్టించాడు. 1989లో పాక్ పర్యటన కోసం తొలిసారిగా జట్టుకు ఎంపికైనప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఏదో ఒక నాడు రిటైర్మెంట్ తప్పదు. ఎవరూ ఎల్లకాలం ఆడలేరుగా. కొంతకాలంగా ప్రతీ పర్యటన అనంతరం ఈ విషయం గురించి ఓ అంచనాకు వస్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య ఈ అంశంపై చాలా చర్చలు జరిగాయి. తుది నిర్ణయం సచిన్‌కే అప్పగించాం. అందుకే ఆ నిర్ణయం మాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు’ అని అజిత్ వివరించారు. ‘క్రికెట్ అంటే ప్రాణం’ క్రికెట్‌ను సచిన్ ఎంతగా ప్రేమిస్తాడో 1999లో జరిగిన సంఘటనను అజిత్ ఉదాహరణగా చెప్పాడు. ‘1995 ఫిబ్రవరి 28న మా తండ్రికి గుండెపోటు వచ్చింది. ఈ విషయం సచిన్‌కు తెలీదు. అతడు ఆ తర్వాతి రోజు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మ్యాచ్‌కు అది చివరి రోజు కూడా. 1999 ప్రపంచకప్ సమయంలోనూ ఇలాగే జరిగింది. తండ్రి మరణం తర్వాత ఇంగ్లండ్ వెళ్లమని మేం అడగలేకపోయాం. అయితే సచిన్‌కు తండ్రి గురించి బాగా తెలుసు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన ఆడమనే సలహా ఇచ్చేవారు. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా అన్నింటినీ అధిగమించి మిగతా టోర్నీ ఆడేందుకు వెళ్లాడు’ అని గుర్తుచేశారు.