alerted
-
ప్రకాశం బ్యారేజీ: రేపు భారీగా వరదనీరు.. యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, విజయవాడ: రేపు ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమతమైంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉండగా, నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నానికి, సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వరదతో టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన
సాక్షి,చౌటుప్పల్(నల్లగొండ): పట్టణ కేంద్రంలోని ఊరచెరువు నిండుకుండలా మారడంతో పట్టణ వాసులో టెన్షన్ నెలకొంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి వరద వస్తుండడతో అలుగుపోస్తుంది. ఇప్పటికీ వర్షాలు తగ్గకపోవడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలోనైనా వరదలు సంభవించొచ్చని భావిస్తున్నారు. 2005 అక్టోబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సగానికిపైగా ఊరు, దుకాణాలు దెబ్బతిన్నాయి. గతేడాది అక్టోబరు 13న కురిసిన వర్షాల కారణంగా వరదలు సంభవించి చెరువు అలుగు నుంచి వలిగొండ రోడ్డు వైపుకు, శ్రీవాణి హోటల్ నుంచి మల్లికార్జున స్కూల్ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇప్పడు మరోసారి వర్షం అధికమై వరద పెరిగితే నీరు సర్వీస్ రోడ్ మీదుగా వెళ్తుందని లోతట్టు ప్రాంత ప్రజలు, దుకాణదారులు,చిరువ్యాపారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అప్రమత్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు.. గతేడాది అనుభవంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా స్థానిక ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చెరువు, అలుగు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద నీటితో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అదే విధంగా కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహరెడ్డి, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు, సైతం తమ వంతుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయంగా కాల్వలు తవ్విస్తూ వరద ముప్పు లేకుండా చూస్తున్నారు. -
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం అయ్యింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశామని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో 24 గంటలపాటు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీర్లు, సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు స్తంభాలు, వైర్లు తెగిపడిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియాజేయాలని ప్రభాకర్ రావు సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీలు, రహదారుల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను తాకవద్దని ఆయన తెలిపారు. నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్ సెల్లర్లలోకి నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. -
కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ అప్రమత్తం
సాక్షి, విజయవాడ: కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని స్పష్టం చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్ వచ్చిందన్నారు. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్ చేశామని పేర్కొన్నారు. (చదవండి: భారత్‌లో కొత్తరకం కరోనా.. ఆరుగురికి పాజిటివ్) 1406 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. మొత్తం 24 పాజిటివ్ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.(చదవండి: ఫ్లైట్ దిగారు.. పత్తా లేరు) -
కొత్త రకం కరోనాపై అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్
సాక్షి, విజయవాడ : కరోనా కొత్త వైరస్‌పై అమ్రమత్తంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అన్నారు. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని, లేకపోతే వారిని రాష్ట్రంలోకి అనుమతించం అని స్పష్టం చేశారు. ఏపీకి వచ్చే ప్రయాణికులపై పూర్తి స్థాయిలో మోనిటరింగ్ ఉందని, ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల బృందాలు క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. బ్రిటన్‌లో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయగా, ఇప్పటికే అన్నిజిల్లాల కలెక్టర్లకి తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. (వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..! ) ఏపీకి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్కులను ఏర్పాటు చేసి, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ అని తేలితే తప్పనిసరిగా హాస్పిటల్‌కు పంపించి చికిత్స అందించనుండగా, నెగటివ్ వచ్చిన వారు మరో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని కాటమనేని స్పష్టం చేశారు. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలో నెగిటివ్ అని వస్తేనే బయట తిరగడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం బ్రిటన్‌లో మాత్రమే కొత్త స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని కాటమనేని భాస్కర్ తెలిపారు. (అంటార్కిటికాలో ల్యాండ్ అయిన కరోనా) -
కొత్త కరోనా: ఏపీ సర్కార్ అప్రమత్తం
సాక్షి, అమరావతి: బ్రిటన్‌లో బయటపడ్డ కరోనా కొత్త రకం వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. పాజిటివ్ పేషెంట్లను కోవిడ్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. నెగిటివ్ వచ్చిన వారిని 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంచాలని, ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన వారి వివరాల సేకరణ పనిలో అధికారులు ఉన్నారు. (చదవండి: ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు) -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
► విధులు విస్మరిస్తే కఠిన చర్యలు ∙మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు ఉట్నూర్(ఖానాపూర్): వర్షాకాలం ప్రారంభం అవుతున్నందువల్ల గిరిజన గ్రామాల్లోæ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ ఎం. జ్యోతి బుద్ద ప్రకాశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణం పీఏమ్మార్సీ సమావేశ మందిరంలో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల కలెక్టర్లతో కలిసి రాయిసెంటర్ల సార్మేడీలు, గ్రామపటేళ్లు, దేవారీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో కలుషిత నీరు లేకుండా, పారిశుధ్యం లోపించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నివారణతో పాటు గ్రామాల్లో దోమలు ప్రబలకుండా గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి పథకాల వద్ద ప్రతీవారం క్లోరినేషన్ చేయడంతో పాటు నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. నాటు వైద్యం, మూఢనమ్మకాల బారిన గిరిజనులు పడకుండా దేవారీలు, గ్రామ పటేళ్లు, రాయిసెంటర్ సార్మేడీలు అవగాహన కల్పించాలన్నారు. ఆర్ఏంపీ, పీఏంపీ వైద్యులు తెలిసీ తెలియని వైద్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఉట్నూర్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఐసీయూల ద్వారా గిరిజనులకు అత్యవసర వైద్యం అందుబాటులోకి రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 12 ప్రభుత్వ ఆసుత్రుల్లో స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్వీకర్ణన్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా మలేరియా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో గుర్తించిన 986 గ్రామాల్లో పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ఇంటింటికి దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను పైఅధికారులకు వివరించాలన్నారు. గ్రామాల్లో నిత్యం వైద్యసిబ్బంది పర్యటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలితే వెంటనే రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. కుమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా గతేడాది తీసుకున్న చర్యలను పరిశీలించి తగు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ గోపి, ఆర్డీవో విద్యాసాగర్, ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి అల్హం రవి, నాలుగు జిల్లాల వైద్యాధికారులు, గ్రామీణ నీటి పారుదల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.