సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
► విధులు విస్మరిస్తే కఠిన చర్యలు ∙మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు
ఉట్నూర్(ఖానాపూర్): వర్షాకాలం ప్రారంభం అవుతున్నందువల్ల గిరిజన గ్రామాల్లోæ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ ఎం. జ్యోతి బుద్ద ప్రకాశ్ అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణం పీఏమ్మార్సీ సమావేశ మందిరంలో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల కలెక్టర్లతో కలిసి రాయిసెంటర్ల సార్‌మేడీలు, గ్రామపటేళ్లు, దేవారీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో కలుషిత నీరు లేకుండా, పారిశుధ్యం లోపించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నివారణతో పాటు గ్రామాల్లో దోమలు ప్రబలకుండా గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి పథకాల వద్ద ప్రతీవారం క్లోరినేషన్ చేయడంతో పాటు నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. నాటు వైద్యం, మూఢనమ్మకాల బారిన గిరిజనులు పడకుండా దేవారీలు, గ్రామ పటేళ్లు, రాయిసెంటర్ సార్‌మేడీలు అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌ఏంపీ, పీఏంపీ వైద్యులు తెలిసీ తెలియని వైద్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఉట్నూర్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఐసీయూల ద్వారా గిరిజనులకు అత్యవసర వైద్యం అందుబాటులోకి రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 12 ప్రభుత్వ ఆసుత్రుల్లో స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్వీకర్ణన్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా మలేరియా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో గుర్తించిన 986 గ్రామాల్లో పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ఇంటింటికి దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను పైఅధికారులకు వివరించాలన్నారు. గ్రామాల్లో నిత్యం వైద్యసిబ్బంది పర్యటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలితే వెంటనే రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. కుమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా గతేడాది తీసుకున్న చర్యలను పరిశీలించి తగు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ గోపి, ఆర్డీవో విద్యాసాగర్, ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి అల్హం రవి, నాలుగు జిల్లాల వైద్యాధికారులు, గ్రామీణ నీటి పారుదల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.