జేడీయూలో అసమ్మతి.. షాకిచ్చిన ఎంపీ!
పట్నా: జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ మరోసారి బీజేపీతో చేతులు కలిపి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నిన్నసాయంత్రం అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామాచేసి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కూటమికి వీడ్కోలు పలికి.. మళ్లీ పాత దోస్త్ బీజేపీతో జట్టు కట్టారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో నరేంద్రమోదీ ఎదుగదలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీతో నితీశ్ తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యారు. బిహార్‌లో మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు లాలూ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి సరికొత్త కూటమిని నితీశ్ తెరపైకి తెచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆర్జేడీకి అత్యధికంగా 80 స్థానాలు రాగా, జేడీయూకి 71 స్థానాలు దక్కాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నితీశ్‌కుమార్.. లాలూ కుటుంబంపై సీబీఐ దాడులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో మహాకూటమితో తెగదెంపులు చేసుకొని.. హుటాహుటీన బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
ఇలా మరోసారి కమలదళంతో నితీశ్‌కుమార్ చేతులు కలుపడంపై ఆయన సొంత పార్టీ జేడీయూలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. నితీశ్ నిర్ణయాన్ని తాజాగా జేడీయూ ఎంపీ అలీ అన్వర్ వ్యతిరేకించారు. నితీశ్ మరోసారి బీజేపీతో కలువడాన్ని తన అంతరాత్మ ఒప్పుకోవడం లేదని, అందుకు తాను దీనిని సమర్థించడం లేదని అలీ అన్వర్ మీడియాకు తెలిపారు. నితీశ్ తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించారని, తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం తాను నడుచుకుంటానని ఆయన చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ఈ విషయాన్ని పార్టీ వేదికలో లేవనెత్తుతానని అన్నారు.