All India Gems and Jewellery
-
ధన్తేరాస్కు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ/ముంబై: ఈసారి ధన్తేరాస్ రెండు రోజులు రావడం పసిడి అమ్మకాలకు కలిసి రానుంది. ప్రస్తుతం బంగారం ధర కాస్త తగ్గడం కూడా ఇందుకు తోడ్పడనుందని, దీనితో ధన్తేరాస్ సందర్భంగా కొనుగోళ్లు మెరుగ్గానే ఉండగలవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. క్రమంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయని వెల్లడించాయి. పసిడి, వెండి మొదలైన వాటి కొనుగోలుకు శుభకరమైన రోజుగా దీపావళికి ముందు వచ్చే ధన్తేరాస్ (ధన త్రయోదశి)ని పరిగణిస్తారు. ఈసారి ధన్తేరాస్ రెండు రోజులు (గురు, శుక్రవారం) వచ్చింది. ఇప్పటిదాకా పేరుకుపోయిన డిమాండ్ అంతా అమ్మకాల రూపం దాల్చగలదని, శుక్రవారం విక్రయాలు మరింత పుంజుకోగలవని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. ‘కొనుగోలుదారులు నెమ్మదిగా ముందుకొస్తున్నారు. అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ గతేడాది స్థాయిలో మాత్రం ఈసారి ధన్తేరాస్ అమ్మకాలు ఉండకపోవచ్చు’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ (ఇండియా) సోమసుందరం పీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పసిడి ధర తగ్గటమనేది డిమాండ్కు కొంత ఊతమివ్వగలదని పేర్కొన్నారు. అయితే పరిమాణంపరంగా అమ్మకాలు 15–20 శాతం తగ్గినా.. విలువపరంగా చూస్తే గతేడాది స్థాయిని అందుకునే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. కరోనా కేసుల కారణంగా చాలా మంది ఆన్లైన్ జ్యుయలరీ సంస్థల నుంచి కూడా కొనుగోళ్లు జరుపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఈ సీజన్లోనే 65% పుత్తడి అమ్మకాలు
ముంబై: సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పండుగల సీజన్లోనే 60–65 శాతం అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని జువెల్లరీ పరిశ్రమ భావిస్తోంది. ‘వారం నుంచి కస్టమర్ల రాక మొదలైంది. 20–25 శాతం జరిగిన అమ్మకాలు ఇప్పుడు 40 శాతానికి చేరాయి. డిసెంబర్ దాకా పెళ్లిళ్లు ఉండడంతో పెద్ద ఎత్తున ఆభరణాలకు గిరాకీ ఉంటుంది’ అని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. అతిథుల సంఖ్య పరంగా నియంత్రణ ఉండడంతో జువెల్లరీపై అధికంగా వెచ్చిస్తారని అభిప్రాయపడ్డారు. బంగారం ధర బలహీనంగా ఉండడం కూడా కలిసి వచ్చే అంశమన్నారు. ఏడాది మొత్తం విక్రయాల్లో 60–65 శాతం ఈ సీజన్లోనే జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పుత్తడి ధర విషయంలో కస్టమర్లు అలవాటుపడ్డారని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ ప్రియ మాధవి వడ్డేపల్లి తెలిపారు. ‘24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56 వేల దాకా వెళ్లి ఇప్పుడు రూ.52 వేలకు దిగొచ్చింది. ఇది అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. మొత్తంగా మార్కెట్ కోలుకుంటోంది’ అని వివరించారు. -
పుత్తడిపై ఎక్సైజ్ సుంకం తొలగించండి
బంగారు వర్తకుల సమ్మె చెన్నై: పుత్తడి అభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధించడాన్ని నిరసిస్తూ బంగారు వర్తకుల మూడు రోజుల సమ్మె బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సమ్మె కారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్, తమిళనాడుసహా దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో బంగారు ఆభరణాల షాప్లు మూతబడ్డాయని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) తెలిపింది. ఈ సమ్మె కారణంగా రూ.600-700 కోట్ల విలువైన వ్యాపారం దెబ్బతిన్నదని జీజే ఎఫ్ జోనల్ చైర్మన్(సావరిన్ రీజియన్) ఎన్. అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. బంగారు ఆభరణాల రంగం నుంచి మరింగా పన్ను ఆదాయం పెంచుకోవాలంటే వ్యాట్, లేదా కస్టమ్స్ సుంకాన్ని పెంచుకోవాలని సూచించారు. గతంలో పసిడి నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఎక్సైజ్ అధికారుల వేధింపులు అధికమయ్యాయని, తాజాగా 1 శాతం ఎక్సైజ్ సుంకం విధింపు కారణంగా ఇవే పరిస్థితులు పునరావృతమవుతాయని, పైగా స్మగ్లింగ్ కూడా పెరిగిపోతుందని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ సురీందర్ కుమార్ జైన్ పేర్కొన్నారు.