పుత్తడిపై ఎక్సైజ్ సుంకం తొలగించండి
బంగారు వర్తకుల సమ్మె
చెన్నై: పుత్తడి అభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధించడాన్ని నిరసిస్తూ బంగారు వర్తకుల మూడు రోజుల సమ్మె బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సమ్మె కారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్, తమిళనాడుసహా దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో బంగారు ఆభరణాల షాప్‌లు మూతబడ్డాయని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) తెలిపింది. ఈ సమ్మె కారణంగా రూ.600-700 కోట్ల విలువైన వ్యాపారం దెబ్బతిన్నదని జీజే ఎఫ్ జోనల్ చైర్మన్(సావరిన్ రీజియన్) ఎన్. అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. బంగారు ఆభరణాల రంగం నుంచి మరింగా పన్ను ఆదాయం పెంచుకోవాలంటే వ్యాట్, లేదా కస్టమ్స్ సుంకాన్ని పెంచుకోవాలని సూచించారు. గతంలో పసిడి నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఎక్సైజ్ అధికారుల వేధింపులు అధికమయ్యాయని, తాజాగా 1 శాతం ఎక్సైజ్ సుంకం విధింపు కారణంగా ఇవే పరిస్థితులు పునరావృతమవుతాయని, పైగా స్మగ్లింగ్ కూడా పెరిగిపోతుందని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ సురీందర్ కుమార్ జైన్ పేర్కొన్నారు.