సమ్మె తాత్కాలికంగా విరమించిన జువెలర్స్
న్యూఢిల్లీ: బంగారు వ్యాపారులు ఎక్సైజ్ సుంకం విధింపునకు వ్యతిరేకంగా 42 రోజుల నుంచి (మార్చి 2) చేస్తోన్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. దేశ రాజధాని ఢిల్లీలో జువెలర్స్ సమ్మె బాట వదిలారు. జువెలర్స్‌పై ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవన్న ప్రభుత్వపు హామీ నేపథ్యంలో సమ్మెను ఏప్రిల్ 24 వరకు నిలిపివేస్తున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ తెలిపారు.
మహారాష్ట్రలో కూడా సమ్మెను ఏప్రిల్ 24 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మహా రాష్ట్ర రాజ్య సరాఫా సువర్ణకార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా వెల్లడించారు. ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకం విధింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏప్రిల్ 25 నుంచి తిరిగి సమ్మెను ప్రారంభిస్తామని బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ వర్మ హెచ్చరించారు. జువెలరీ పరిశ్రమకు 42 రోజుల సమ్మె కారణంగా రూ. లక్ష కోట్లమేర నష్టం వచ్చింటుందని అంచనా.