సమ్మె నిరవధికంగా కొనసాగిస్తాం
♦ ఏఐబీజేఎస్‌ఎఫ్ ప్రకటన
♦ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా
♦ ఎత్తివేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ఎక్సైజ్ సుంకం విధింపు చ ర్యను నిరసిస్తూ చేస్తున్న సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని ఆల్ ఇండియా బులియన్, జువెలర్స్, స్వర్ణకార్ ఫెడరేషన్ (ఏఐబీజేఎస్‌ఎఫ్) ప్రకటించింది. అలాగే వచ్చే వారం నుంచి వివిధ మార్గాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తామని తెలిపింది. బంగారు షాపుల తాళాలను జైట్లీకి అందించడం, దున్నపోతు ముందు ఈల ఊదడం, జిల్లా కేంద్రాల్లో బెల్స్ మోగియడం, ఎంపీల ఇంటి ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, డిమాండ్ల ప్రదర్శన, దుకాణాల రిజిస్ట్రేషన్ కాగితాలను ఆర్థిక మంత్రి పేరుకి మార్చడం, మానవహారాలుగా ఏర్పడటం వంటి తదితర నిరసన కార్యక్రమాలను చేస్తామని వివరించింది.
దేశవాప్తంగా ఉన్న దాదాపు 375 జువెలరీ ట్రేడ్ అసోసియేషన్స్ ప్రతినిధులు సమ్మె కొనసాగింపునకు సుముఖంగా ఉన్నారని ఏఐబీజేఎస్‌ఎఫ్ ప్రకటించింది. కేంద్రం జువెలరీ పరిశ్రమలో ఇన్‌స్పెక్టర్ రాజ్ పరిస్థితులు రావని హామీ ఇచ్చినప్పటి నుంచి జీజేఎఫ్, ఏబీజేఏ, జీజేఈపీసీ వంటి దిగ్గజ జువెలరీ పరిశ్రమ అసోసియేషన్స్ సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ ఏఐబీజేఎస్‌ఎఫ్ మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెను కొనసాగిస్తోంది.