ఈ నెల 7 వరకూ ఆభరణాల వర్తకుల సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న ఆభరణాల వర్తకులు దీన్ని ఈ నెల ఏడవ తేదీ వరకూ పొడిగించారు. రత్నాలు, బంగారు ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధించడం పరిశ్రమ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ జి.వి. శ్రీధర్ చెప్పారు. ఎక్సైజ్ సుంకం విధింపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నామని చెప్పారు. తమ సమస్యలను పరిశీలిస్తానని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అయినప్పటికీ తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.
గతంలో ఈ విధంగానే ఎక్సైజ్ సుంకం విధించారని, కానీ సానుకూల ఫలితాలు రానికారణంగా తొలగించారని జీజేఎఫ్ మాజీ చైర్మన్, డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ చెప్పారు. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వర్తకులపై మాత్రమే వెండి-యేతర ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. రూ. రెండు లక్షలు, అంతకు మించిన ఆభరణాల కొనుగోలు చేస్తే పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను కూడా ఆభరణాల వర్తకులు వ్యతిరేకిస్తున్నారు. పాన్ నంబర్ తప్పనిసరి నిబంధనను రెండు లక్షలకు కాక రూ. 10 లక్షలకు మించిన కొనుగోళ్లకు వర్తింపజేయాలని కోరుతున్నారు. 3 రోజుల సమ్మెతో పరిశ్రమకు రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.