అమలాపురం టౌన్: పసిమివన్నె పసిడి నిత్యావసరవస్తువు కాకపోవచ్చు. అయినా బంగారం వ్యాపారులు పాటిస్తున్న బంద్ ప్రభావం.. లగ్గసరి నేపథ్యంలో హెచ్చుగానే ఉంది. చివరికి తాళిబొట్టు తయూరీకి అవసరమైన బంగారం కూడా కొనలేక వధూవరుల కుటుం బాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బంగారం విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించినందుకు నిరసనగా బంగారు వర్తకులు చేపట్టిన బంద్ ఈనెల 17 వరకూ జరగనుంది. దేశ వాప్తంగా బంద్ జరుగుతుండటంతో ఎక్కడ, ఎవరికి బంగారం అవసరమైనా కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
జిల్లాలో ఉన్న రెండు వేలకు పైగా బంగారు దుకాణాలు ఈనెల 9 నుంచి మూతపడ్డారుు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం తదితర పట్టణాల్లోనే కాక మండల కేంద్రాల్లో ఉన్న పసిడి దుకాణాలూ తెరుచుకోక రోజుకు రూ.కోట్లలో అమ్మకాలు నిలిచిపోయాయి. ఈనెల 11,15 తేదీల్లో పెళ్లిళ్లకు బలమైన ముహూర్తాలు ఉండటంతో ఆ కుటుంబాలకు బంగారం లేదా నగలు కొనుగోలు చేయటం అత్యవసరం. ఈ రెండు ముహూర్తాల్లో జిల్లాలో మూడు వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా. కాలం మారిపోయి ఇప్పుడు పెళ్లిళ్లకు వధూవరులకు, ఇతర సంప్రదాయాలకు బంగారు నగలను తయారు చేయించటం లేదు.
అప్పటికప్పుడు దుకాణాలకు వచ్చి రెడీమేడ్ నగలను వచ్చి కొనుగోలు చేయటం పరిపాటైంది. చివరకు మంగళ సూత్రాలు కూడా రెడీమేడ్‌వి వినియోగిస్తుండటంతో ముహూర్తం దగ్గర పడ్డా సూత్రం సిద్ధం కాకపోవటంతో కంగారు పడుతున్నారు. జిల్లాలో దుకాణాలు 9 రోజుల పాటు మూత పడటంతో పెళ్లి ఇళ్ల వారికి ఏమీ చేయలేని నిస్సహాయత ఎదురవుతోంది. ఏ విజయవాడో, హైదరాబాదో వెళ్లి కొందామన్నా వీలు కాని పరిస్థితి. ఈ క్రమంలో పెళ్లి ఇళ్ల వారు బంగారు దుకాణ యజమానుల వద్దకు వెళ్లి బతిమాలుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి బంగారు వర్తకుల బంద్ గురించి తెలియక నగరాలు, పట్టణాల్లోని దుకాణాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
కొత్త బంగారముందా.. మిత్రులారా!
కాట్రేనికోన మండలం దొంతుకుర్రుకు చెందిన ఓ కుటుంబంలో ఈనెల 15న పెళ్లి జరగనుంది. వారు బంగారు నగల కొనుగోలుకు శుక్రవారం అమలాపురంలోని ఓ పెద్ద నగల దుకాణానికి వచ్చారు. బంద్ గురించి తెలిసి దుకాణ యజమాని ఇంటికి వెళ్లి నగల కోసం అడిగారు. యూనియన్ నిబంధనల ప్రకారం దుకాణాలు తెరవకూడదని, తాను చేయగలిగిందేమీ లేదని ఆయన చేతులెత్తేశారు. రాత్రి పది గంటల తర్వాతైనా దుకాణం తెరిచి నగలు అమ్మమని, కనీసం మంగళ సూత్రానికైనా బంగారం అమ్మమని పెళ్లింటి వారు బతిమాలారు.
ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉంది. పెళ్లిళ్లకు కచ్చితంగా కొత్త బంగారమే వాడతారు. అందులోకి మంగళ సూత్రానికి విధిగా కొత్త బంగారం కావాల్సి రావటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎవరైనా బంధువులు, స్నేహితులు గతంలో కొనుగోలు చేసిన కొత్త బంగారం ఉందేమోనని కొందరు అన్వేషణలో పడ్డారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం మార్కెట్‌లకు బంగారం కొనుగోలుకు వచ్చి నిరాశతో తిరిగి వెళుతున్న వినియోగదారుల సంఖ్య శుక్రవారం ఎక్కువగా కనిపించింది. మరో పక్క ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసేవరకూ బంద్ విరమించేది లేదనిముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల బులియన్ యూనియన్ల నుంచి సంకేతాలు వస్తున్న క్రమంలో ఈ బంద్ మరిన్ని రోజులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పుస్తెలకూ పసిడి కరువే
Published Sat, Mar 12 2016 4:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement