ముంబై: సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పండుగల సీజన్లోనే 60–65 శాతం అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని జువెల్లరీ పరిశ్రమ భావిస్తోంది. ‘వారం నుంచి కస్టమర్ల రాక మొదలైంది. 20–25 శాతం జరిగిన అమ్మకాలు ఇప్పుడు 40 శాతానికి చేరాయి. డిసెంబర్ దాకా పెళ్లిళ్లు ఉండడంతో పెద్ద ఎత్తున ఆభరణాలకు గిరాకీ ఉంటుంది’ అని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు.
అతిథుల సంఖ్య పరంగా నియంత్రణ ఉండడంతో జువెల్లరీపై అధికంగా వెచ్చిస్తారని అభిప్రాయపడ్డారు. బంగారం ధర బలహీనంగా ఉండడం కూడా కలిసి వచ్చే అంశమన్నారు. ఏడాది మొత్తం విక్రయాల్లో 60–65 శాతం ఈ సీజన్లోనే జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పుత్తడి ధర విషయంలో కస్టమర్లు అలవాటుపడ్డారని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ ప్రియ మాధవి వడ్డేపల్లి తెలిపారు. ‘24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56 వేల దాకా వెళ్లి ఇప్పుడు రూ.52 వేలకు దిగొచ్చింది. ఇది అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. మొత్తంగా మార్కెట్ కోలుకుంటోంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment