అక్కడ మొబైల్ సర్వీసులన్నీ బంద్
శ్రీనగర్: ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నేటికీ ఎక్కడికక్కడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్న జమ్ముకశ్మీర్లో ఒక్క బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ సర్వీసు తప్ప మిగితా మొబైల్ ఫోన్ సర్వీసులు ఆగిపోయాయి. అలాగే, బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సౌకర్యాలను కూడా మంగళవారం అధికారులు నిలిపివేయనున్నారు. ముస్లింల పర్వదినం బక్రీద్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం జమ్ముకశ్మీర్ లో గత 66 రోజులుగా అశాంతియుత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోపక్క బక్రీద్ సందర్భంగా బలగాల కాల్పుల్లో చనిపోయినవారికి నివాళి అర్పించినట్లుగా ర్యాలీ తీయాలని కొంతమంది వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. అయితే, ఈ ర్యాలీని ఆసరాగా చేసుకొని కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల నేపథ్యంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిషేధించారు. ఎలాంటి రూమర్లు వ్యాపించకుండా చేసే చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.