క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి
సత్తెనపల్లి: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో గత ఐదేళ్ల కాలంలో అవినీతి, దౌర్జన్యాలు పేట్రేగిపోయాయని, కోడెల, ఆయన కుటుంబ అవినీతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అన్ని రాజకీయ పార్టీలు(అఖిలపక్షం) ప్రజా, పౌర సంఘాల నేతలు ముక్తకంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ‘క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి’ పేరుతో సత్తెనపల్లిలో నిరసన దీక్ష చేపట్టారు. కోడెల ఆదేశాలతో పోలీసులు నిరసన దీక్షను భగ్నం చేశారు. దీంతో అఖిలపక్ష నేతలు స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
కోడెలను రాజకీయాల నుంచి బహిష్కరించాలన్నారు. ఆయన కుటుంబ అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేటలో ప్రతి పనిలోనూ ‘కే ట్యాక్స్’ (కోడెల ట్యాక్స్) పిండుతున్నారని మండిపడ్డారు. అవినీతిపై ప్రశ్నించిన గొంతులను పోలీసు లాఠీలతో నొక్కేస్తున్నారని తెలిపారు. కోడెల అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన ముగ్గురిపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. అందుకే కోడెలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజకీయాల్లో అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఐదేళ్లుగా కోడెల, ఆయన కుటుంబ అవినీతిని సహించలేక అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా, పౌర సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి అవినీతిపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించామన్నారు. కోడెల, కోడెల కుటుంబ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై న్యాయ విచారణ జరిపేవరకు కలిసి పోరాడుతామని చెప్పారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసి అంబటి రాంబాబును క్రోసూరు, మిగిలిన నేతలను ముప్పాళ్ల, రాజుపాలెం పోలీస్ స్టేషన్లకు తరలించారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం సత్తెనపల్లి ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ, జనసేన ప్రాంతీయ సమన్వయకర్త బైరా దిలీప్ చక్రవర్తి, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధి బత్తిన శ్రీనివాసబాబు, పీసీసీ కార్యదర్శి మాదంశెట్టి వేదాద్రి, సీపీఐ సహాయ కార్యదర్శి మూసాబోయిన శ్రీనివాసరావు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నరిశేటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.