All party leaders arrested
-
ఛలో అసెంబ్లీ...ముందస్తు అరెస్ట్‌లు
సాక్షి, అమరావతి: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమరావతిలో అసెంబ్లీతో పాటు, సచివాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐడీ కార్డులు చూపించిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు. గుంటూరులో సీపీఐ నేతలను, అలాగే గతరాత్రి నుంచే సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌ను పాతగుంటూరు పీఎస్‌లోనే ఉంచారు. ఇక కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గుడివాడలో పోలీసులు మందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. తిరుపతిలో సీపీఐ నేతలు, రంపచోడవరంలో సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు ముందస్తు అరెస్ట్‌లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌లు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రెండో రోజూ సిరిసిల్ల బంద్
కరీంనగర్: సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజుకు చేరుకుంది. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేసి జిల్లా కోసం ఆందోళన బాటపట్టారు. సిరిసిల్లను వెంటనే జిల్లా కేంద్రాల్లో చేర్చాలని కోరుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద అఖిలపక్ష కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అఖిలపక్షం నేతల ఆందోళన... అరెస్ట్
హైదరాబాద్ : సిరిసిల్లను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం నేతలు హైదరాబాద్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు.