అక్కడ మొత్తం 83 ఆపరేషన్లూ ఫెయిలే!!
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో చేసిన మొత్తం 83 ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. వాళ్లలో 11 మంది మహిళలు మరణించగా, మిగిలినవాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేరుగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ఫోన్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యులతో కూడిన బృందాన్ని హుటాహుటిన బిలాస్పూర్ పంపారు. కుటుంబ నియంత్రణ శిబిరంలో సంభవించిన మరణాలపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు.
సెప్టిక్ షాక్ వల్లనే ఈ మరణాలు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ అమర్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. అయితే, శస్త్రచికిత్స పరికరాలు ఇన్ఫెక్ట్ కావడం వల్లే ఇలా జరిగిందన్నారు. తమకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్ష్యాలు ఇస్తున్నారని, వాటిని చేరుకోడానికే తొందరగా ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని సస్పెండైన నలుగురిలో ఒకరైన డాక్టర్ ఆర్కే భంగే చెప్పారు. రోజుకు ఒక బృందం 40 ఆపరేషన్లు చేయాలి. ఈ లక్ష్యాల వల్లే ఇలా జరుగుతోందని వాపోయారు. ఆపరేషన్లు విఫలమై మరణించిన వాళ్ల కుటుంబాలకు ఇంతకుముందు ప్రకటించిన రూ. 2లక్షల పరిహారాన్ని సీఎం రమణ్ సింగ్ 4 లక్షలకు పెంచారు. ఈ దుర్ఘటన సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అమర్ అగర్వాల్ నియోజకవర్గం పరిధిలోనే జరగడంతో ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.