యా అల్లా.. ఏ క్యా హోగయా
= పనికోసం వెళ్లి కానరాని లోకాలకు..
= బస్సులోంచి జారిపడటంతో మృత్యువాత
= మర్తాడులో విషాదం.. వీధినపడ్డ కుటుంబం
యా అల్లా.. ఏ క్యా హోగయా అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. పని కోసమని వెళ్లిన వాడిని ఇలా కానరాని లోకాలకు తీసుకుపోతివా అంటూ విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. గార్లదిన్నె వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్తాడుకు చెందిన కూలీ అల్లాబకాష్ దుర్మరణం చెందాడు.
అతనో దినసరి కూలీ. పనికి వెళితే గానీ పూట గడవని పరిస్థితి. తెల్లవారుజామునే పని కోసం ఆర్టీసీ బస్సులో బయల్దేరిన అతను గమ్యస్థానం చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందే ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా ఉన్నాయి. మర్తాడుకు చెందిన అల్లాబకాష్(30)కు తొమ్మిదేళ్ల కిందట తాడిపత్రికి చెందిన షబానాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అల్లా బకాష్ టమాట గ్రేడింగ్, ఇతర కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
మంగళవారం తెల్లవారుజామున పనికోసం ఆర్టీసీ బస్సులో గార్లదిన్నెకు బయల్దేరాడు. గార్లదిన్నె రైల్వే గేట్ సమీపంలోకి రాగానే అక్కడ గేట్ వేపడింది. దీంతో డ్రైవర్ బస్సు నిలిపేందుకు స్లో చేశాడు. ఈ సమయంలో అల్లాబకాష్ కదులుతున్న బస్సు నుంచి కిందకు దిగబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే వెనుకచక్రం అతని తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసులు, ఆర్టీసీ డీఎం బాల చంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటì పెద్ద దిక్కు కోల్పోవడంతో మృతుడు భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మర్తాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.