ఆల్మట్టి ‘ఎత్తు’లకు కేంద్రం చెక్
ఎత్తు పెంపుతో కర్ణాటకకు దక్కే 130 టీఎంసీల
వినియోగ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట
► 9 ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు నిరాకరణ
► ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండానే వినియోగానికి తెరలేపిన కర్ణాటక
► హైడ్రాలజీ క్లియరెన్స్ లేదంటూ కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం
► అంతర్రాష్ట్ర వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున అటవీ అనుమతులకు నో
► 4 టీఎంసీల వినియోగంతో చేపట్టిన బసవేశ్వర ఎత్తిపోతలకూ విముఖత
సాక్షి, హైదరాబాద్
కృష్ణా బేసిన్లో ఎగువన ఉండటంతో విచ్చలవిడిగా నీటిని వినియోగించుకుంటున్న కర్ణాటకకు ఎట్టకేలకు చెక్ పడింది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వెలువరిం చిన తీర్పు అమల్లోకి రాకముందే.. వాటాల పేరు చెప్పి అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఆ రాష్ట్రానికి కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఆల్మట్టి ఎత్తుతో దక్కే నీటి వాటాలను ఆధారంగా చేసుకుని చేపట్టదలిచిన తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చేం దుకు నిరాకరించింది. ఆ పథకాలకు నీటి లభ్యత (హైడ్రాలజీ)పై స్పష్టత లేదని, అలాగే అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నందున అనుమతులివ్వలేమని స్పష్టం చేసింది.
అమల్లోకి రాకుండానే వినియోగం..
1969లో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా.. 2,130 టీఎంసీ జలాల లభ్యత ఉన్నట్టు తేల్చి మూడు రాష్ట్రాలకు (మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు) పంపిణీ చేసింది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత లెక్కన 2,578 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నట్టు తేల్చింది. అదనంగా తేల్చిన 448 టీఎంసీలను ఈ మూడు రాష్ట్రాలకు పంచింది. కృష్ణాలో గతంలో ఉన్న కేటాయింపులకు అదనంగా ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలను కేటాయించింది.
ఇదే సమయంలో కర్ణాటకకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524.25 పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌కు 519.6 మీటర్ల ఎత్తు వరకు అనుమతి ఉంది. దీంతో సుమారు 129 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది (నిల్వకు అదనపు నీటిని ఎత్తిపోతల ప్రాజెక్టులకు వినియోగిస్తారు). అయితే బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే.. ఆల్మట్టి ఎత్తు 524.25 మీటర్లకు, నిల్వ సామర్థ్యం 259 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే ఆల్మట్టి ద్వారా కర్ణాటక నీటి వాడకం 303 టీఎంసీలకు పెరుగుతుంది. కానీ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాలేదు (అమల్లోకి రాలేదు). అంతేగాకుండా దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో నీటి వాటాలేవీ అధికారికం కాలేదు. అయినా కర్ణాటక తమ పరిధిలో అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకునేలా రూ.17,207 కోట్లతో 9 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది.
నిలదీసిన ఈఏసీ..
కర్ణాటక బ్రిజేశ్ తీర్పు ఆధారంగా దక్కే 130 టీఎంసీలను వినియోగించుకునేలా 9 ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఆల్మట్టి కింద ముల్వాడ్, చిమ్మలాగి, హెర్కల్, కొప్పాల్ పథకాలను, నారాయణపూర్ కింద ఎన్‌ఆర్‌బీసీ, మల్లాబాద్, భీమా, రాంపూర్, ఇండి పథకాలు ఉన్నాయి. ఈ 9 పథకాల కోసం 1,45,937 ఎకరాలు భూమి అవసరం పడింది. అందులో 535 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. దీంతో పర్యావరణ అనుమతుల కోసం కర్ణాటక కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయితే పర్యావరణ అనుమతులు దక్కాలంటే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని ‘ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ)’ స్పష్టం చేసింది. ముఖ్యంగా నీటి లభ్యత అంశాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిసింది. అసలు బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును అవార్డు చేయకుండానే నీటి లభ్యత ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేగాకుండా కృష్ణా జలాల పంపిణీలో అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా ఈఏసీ లేవనెత్తిందని.. దీనిపై కర్ణాటక సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. దాంతో ఈ అంశాలపై స్పష్టతతో పాటు సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చే వరకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇక మరో 4 టీఎంసీలను వినియోగించుకుంటూ బెలగావ్ జిల్లాలో చేపట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి ఇవ్వలేదు.
అలాగైతే రాష్ట్రం ఎండమావే..
ఆల్మట్టి ఎత్తు పెరిగితే కర్ణాటకకు అదనంగా 130 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు లభిస్తుంది. అసలు ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు నీళ్లు వచ్చేందుకు సెప్టెంబర్ దాకా ఆగాల్సి వస్తోంది. ఎత్తు పెంచాక అక్టోబర్ తర్వాతే నీళ్లు వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ ఆయకట్టుకు పరిస్థితి దారుణంగా మారుతుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో చేపట్టిన.. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు, వీటి పరిధిలోని 25 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులు
ప్రాజెక్టు కావాల్సిన నీరు (టీఎంసీల్లో) ఆయకట్టు (లక్షల ఎకరాల్లో)
నెట్టెంపాడు 20 2
కల్వకుర్తి 25 3.40
ఏఎమ్మార్పీ 30 3.70
పాలమూరు 90 12.3
డిండి 30 3.5
రాష్ట్రాల మధ్య కృష్ణా కేటాయింపులు
రాష్ట్రం బచావత్ బ్రిజేశ్
ఉమ్మడి ఏపీ 811 1,001
మహారాష్ట్ర 585 666
కర్ణాటక 734 911
మొత్తం 2,130 2,578