పీవీ సోనియాను జైలుకు పంపాలనుకున్నారా!
మార్గరెట్ అల్వా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు!
1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా.. ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సోనియాగాంధీ ప్రధాని పీవీపై ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్ అల్వా వెల్లడించారు.
మార్గరెట్ అల్వా పీవీ ప్రభుత్వంలో సిబ్బంది వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఆమె ఆధీనంలోనే సీబీఐ ఉండటంతో బోఫోర్స్ అప్పీలు విషయమై మార్గరెట్ సోనియాను కలిశారు. ఈ అప్పీలు విషయంలో తన పాత్ర ఏమీ లేదని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లాయని ఆమె సోనియాకు తెలుపగా.. 'ప్రధాని ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారా?' అంటూ సోనియా ఆగ్రహంగా పేర్కొన్నారని మార్గరెట్ అల్వా తన స్వీయచరిత్రలో తెలిపారు.
'కరెజ్ అండ్ కమిట్మెంట్' పేరిట రూప పబ్లికేషన్స్ ఆమె రాసిన ఆత్మకథను ప్రచురించింది. ఈ పుస్తకంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు ఉన్న విభేదాలు, వారి మధ్య రాజీ కుదర్చడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆమె వివరించారు. 'కాంగ్రెస్ (పీవీ) ప్రభుత్వం నా కోసం ఏం చేసింది? ఈ ఇంటిని చంద్రశేఖర్ ప్రభుత్వమే కేటాయించింది. నా కోసంగానీ, నా పిల్లల కోసం గానీ ఎలాంటి ప్రయోజనాలు ఆయన నుంచి కోరడం లేదు' అని సోనియా తనతో పేర్కొన్నట్టు మార్గరెట్ తెలిపారు. పీవీ మీద సోనియా చాలా కోపంతో ఉన్నారని పేర్కొన్నారు.
'సోనియా ఆయన (పీవీ)ను ఎంతమాత్రం విశ్వసిస్తున్నట్టు కనిపించలేదు. రాజీవ్‌గాంధీ హత్యకేసులో పాత్రపై విచారణ ఎదుర్కొంటున్న (ఆధ్యాత్మికవేత్త) చంద్రస్వామితో పీవీ సాన్నిహిత్యం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానికి దూరంగా ఉంటూ ఆయనను బలహీనుడ్ని చేయాలని ఆమె ఎప్పుడూ భావించేది. కానీ, బాబ్రీ మసీదు ఘటన తర్వాత (బోఫోర్స్ కేసులో ప్రభుత్వం అప్పీలుతో) ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం, అనుమానాలు మొదలయ్యాయి' అని మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు.