Always
-
సదా మీ సేవలో...
ఇక ఇంటి ముందుకు రానున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఆకర్షిస్తున్న యాజమాన్యం హన్మకొండ టు హైదరాబాద్‌కు మినీ బస్సులు త్వరలో నడిపించేందుకు చర్యలు సర్వే పూర్తిచేసిన అధికారులు హన్మకొండ : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం.. అనే నినాదంతో ముందుకుసాగుతున్న యాజమాన్యం మరో అడుగు వేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ఆర్టీసీ డోర్ టు డోర్ సర్వీస్‌కు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీధి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లి వారు చేరుకోవాల్సిన వాడలో దింపుతాయి. ఇందుకోసం టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం 236 మినీ బస్సులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో సగం ఏసీ మినీ బస్సులను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ప్రయాణికులపై సర్వే హన్మకొండ, వరంగల్‌లోని కాలనీలు, పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజు ఎంతమంది ప్రయాణికులు వెళ్తున్నారనే దానిపై వరంగల్ రీజినల్ అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. మొత్తం 514 మందిని సర్వే చేయగా.. అందులో ప్రధానంగా 20.62 శాతం ఉప్పల్‌కు, మహాత్మాగాంధీ బస్‌స్టేçÙన్కు 9.34 శాతం, సికింద్రాబాద్ జేబీఎస్‌కు 8.95 శాతం వెళ్తున్నట్లు తెలిసింది. హన్మకొండ, వరంగల్‌లో సర్వే చేయగా.. హన్మకొండ నుంచి 47.47 శాతం, వరంగల్ నుంచి 20.43, ఇతర ప్రాంతాల నుంచి 5.84 శాతం హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు తేలింది. వీరితో పాటు మరో 3,350 మంది ప్రయాణికులను సర్వే చేశారు. వీరిలో ఎవరెవరు ఏయే బస్సులో ప్రయాణిస్తున్నారు.. ఒక్కో వ్యక్తి నెలలో ఎన్ని రోజులు హైదరాబాద్‌కు వెళ్తున్నాడు.. జిల్లాలో ఏయే స్టేజీలో బస్సు ఎక్కుతున్నారు...హైదరాబాద్‌లో ఎక్కడ దిగుతున్నారు.. దిగిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనే అంశాలపై సర్వే చేపట్టారు. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సులను నడిపేందుకు కార్యా చరణ సిద్ధం చేశారు. త్వరలో 16 కొత్త మినీ బస్సులు వరంగల్ రీజియన్‌కు రానున్నాయి. ఈ బస్సులు వరంగల్, హన్మకొం డలోని పలు కాలనీలు, ప్రధాన కూడళ్ల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నడువనున్నాయి. ఇంటి ముందు బస్సు ఎక్కి తే మరో వాహనం అవసరం లేకుండా కోరుకున్న చోట దిగే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించనుంది. దీంతో ప్రయాణికులకు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతోంది. కాగా, బస్సుల సమాచారం, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. మొత్తంగా ప్రయాణికులను ఇంటి నుంచే తీసుకెళ్లి తిరిగి ఇంటివద్దనే దించే ఆలోచనలో యాజమాన్యం కసరత్తు చేస్తోంది. వరంగల్ రీజియ¯Œæకు 16 మినీ బస్సులు మినీ బస్సులను తొలుత హన్మకొండ–హైదరాబాద్, నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో నడుపనున్నారు. మొదటి దశలో వరంగల్ రీజియన్‌కు 16 ఏసీ మినీ బస్సులు రానున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై స్వయంగా ఆయా డిపో మేనే జర్లతో కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నష్టాలను పూడ్చుకోవడంపై డిపోల వారీగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడంపై దృష్టి సారించారు. అలాగే ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ రీజియన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హన్మకొండ–హైదరాబాద్ రూట్‌పై దృష్టి సారించారు. క్యాబ్‌లు, ప్రైవేట్ ట్యాక్సీకార్లలో వెళ్లే ప్రయాణికులు సైతం ఆర్టీసీ బస్సులోనే వచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ప్రయాణికుడి ఇంటి ముందుకు బస్సును తీసుకెళ్లి వారిని ఆకర్షించాలనే సంకల్పంతో ముందుకుపోతున్నారు. -
ప్రేమలో నాకెపుడూ చుక్కెదురే..
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన కిక పెళ్లి యోగం లేదేమోనని బెంగ పడుతున్నాడట. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న రియాల్టీ షో కు విచ్చేసిన సల్మాన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా పెళ్లి ఎపుడు అని మీడియా ప్రశ్నించినపుడు తాను ఆ విషయంలో ఎపుడూ దురదృష్ట వంతుడినేనని సమాధానం ఇచ్చాడట. అంతేకాదు.. పెళ్లి చేసుకోవాలని తాను ఉవ్విళ్లూరుతున్నానని.. పడి చచ్చిపోతున్నానని ..అయితే తనకు అదృష్టం కలసి రావడం లేదని వ్యాఖ్యానించాడు. ఎపుడూ అవతలి వ్యక్తి( అమ్మాయి) ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని తెలిపాడు. పెళ్లి విషయంలో మగాళ్లు చేసేదేమీ లేదని..అంతా ఆడవాళ్లే నిర్ణయిస్తారని కమెంట్ చేశాడు. కాగా బాలీవుడ్ బాచిలర్ బాబు సల్మాన్ తరచూ ప్రేమ వివాదాల్లో నిలవడం మామూలే. గతంలో అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం సాగించడం.. అది పెళ్లి దాకా రాకపోవడం తెలిసిందే. సంగీతా బిజ్లాని , ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తదితర స్టార్ హీరోయిన్లు ఈ కోవలోకి వస్తారు. అయితే ఇటీవల లులియా వాంతూర్ తో పెళ్లి దాదాపు ఖాయమనే వార్తలు బీ టౌన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. -
20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను...
చీకటిని చూసి భయపడితే ఎప్పటికీ భయంగానే ఉంటుంది...ఆ చీకట్లోకి వెళ్ళినప్పుడే అక్కడ ఏముందో తెలుస్తుంది. ఇంచుమించుగా ఇటువంటి అనుభవాన్నే ఆ మహిళ ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంది. భారత దేశంలో మహిళ ఒంటరి ప్రయాణం సురక్షితం కాదు.. అన్న అనుమానం నిజమా కాదా అన్నది నిరూపించాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ జరిగే భయంకరమైన ఘటనల గురించి విని, చదివి భయపడే వారికి భిన్నంగా ఆలోచించింది. దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించి తన అనుభవాలను వివరించింది. ముఖ్యంగా అంతా భయపడే ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ బస్తర్ లో ఓ మహిళ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలనుకుంది స్వాతీ జైన్. అక్కడివారంతా తనను ఎంతో వింతగా చూస్తారని అభిప్రాయపడింది. కానీ వారు తనపై చూపిన ఆదరణ, సహాయ సహకారాలకు ఆశ్చర్యపోయింది. మొదటి 96 గంటలపాటు 1300 కిలోమీటర్లు గిరజన ప్రాంతంలో ప్రయాణించిన ఆమె.. దూరంగా చూసి ఏ విషయానికీ భయపడకూడదన్న సత్యాన్ని గ్రహించింది. ఏ ఒక్కరూ తనవైపు వింతగా చూడలేదని, ముట్టుకోడానికి ప్రయత్నించలేదని, భయపెట్టలేదని చెప్తోంది. నిజంగా అనుమానం పెనుభూతం అన్న సామెతకు ఇదే ఉదాహరణ అంటోంది. ఛత్తీస్‌గఢ్ లో తన ఒంటరి ప్రయాణం కోసం ముందుగా ట్రావెల్ వెబ్ సైట్లు, పుస్తకాలు సందర్శించిన ఆమె... బస్తర్ ప్రయాణంపై పర్యాటకులకు సలహాదారులు వ్యతిరేక సమాచారం ఇవ్వడాన్నే చూసింది. అయితే అక్కడి పార్కులు, గుహలు వంటి సందర్శనా స్థలాలతోపాటు... వారు జరుపుకునే దసరా వేడుకను చూడాలన్న ఉద్దేశ్యంతో బస్తర్ లో ప్రయాణించింది. అలాగే తాను రాజస్థాన్ ప్రాంతంలో ప్రయాణించేప్పుడు ఓ నిర్మానుష్య ప్రాంతంలో టాక్సీ ఆగిపోయినప్పుడు... ఓ దంపతులు ట్రాక్టర్ లో ఎక్కించుకొని తనకు అక్కడికి దగ్గరలోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించారని చెప్తోంది. ముందుగా తాను ఒంటరిగా వారితో ప్రయాణించేందుకు భయపడి... తనతోపాటు పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకున్నానని, అయితే వారు ఆ అర్థరాత్రి సమయంలో సహాయం అందించడమే కాక.. మరుసటిరోజు ప్రయాణానికి కూడా సహకరించారని తెలిపింది. అలాగే కార్గిల్ లోని జాన్స్ కర్ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు తన షేర్ టాక్సీలోని ఓ వ్యక్తి తన కజిన్ గెస్ట్ హౌస్ లో ఆశ్రయం కల్పించాడని, తన ఇల్లులాగే ఫీల్ అవ్వమంటూ ఎంతో మర్యాదగా చూశాడని ఆ ఒంటరి ప్రయాణీకురాలు తన అనుభవాలను వెల్లడించింది. ప్రతి విషయానికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ ప్రాంతంలోనైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చని అంటోంది. అంతేకాదు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకన్నా భారత దేశంలోనే మహిళలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితమని తాను భావిస్తున్నట్లు వివరిస్తోంది. ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించిన ఆమె... ప్రతివారూ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేసి, ప్రత్యేక అనుభవాలను మూటగట్టుకోవాలని సలహా ఇస్తోంది.