Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే, పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29, బుధవారం నాడు వచ్చింది.హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మాఘ మాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలకు పిండప్రదానం చేస్తే, వారు పితృ దోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదేవిధంగా మౌని అమావాస్య నాడు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడొచ్చిన మౌని అమావాస్య..మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్యనాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.మౌనం వలన కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తుచేస్తుంది. మౌనం అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసికశాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు